close

గురువారం, డిసెంబర్ 12, 2019

ప్రధానాంశాలు

విపత్తుల వేళ.. వెలుగు దివ్వెలు

అన్ని హంగులతో డీఆర్‌ఎఫ్‌ సేవలు
కొత్తగా సమకూరిన ట్రక్కులు, ఆస్కా లైట్లు
ఈనాడు, హైదరాబాద్‌

అనుకోని విపత్తు.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు.. చీకటిపడిందంటే చాలు సహాయక చర్యలు కొనసాగించడానికి పడే అవస్థలు వర్ణనాతీతం.. చాలా సందర్భాల్లో ఘటనా స్థలంలో విద్యుత్తు సౌకర్యం అందుబాటులో ఉండదు. జనరేటర్లను తీసుకెళ్లి విద్యుద్దీపాలను ఏర్పాటుచేయడం కుదరకపోవచ్చు. అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు జీహెచ్‌ఎంసీ విపత్తు స్పందన దళం(డీఆర్‌ఎఫ్‌) ఆస్కా లైట్లను సమకూర్చుకుంది. ఇటీవల దేశం మొత్తాన్ని కలిచివేసిన గోదావరి పడవ బోల్తా దుర్ఘటన సహాయక చర్యల్లో ఈ దీపాలు చాలా ఉపయోగపడటం తెలిసిందే. అదే స్ఫూర్తితో గ్రేటర్‌లో చోటు చేసుకునే భవన నిర్మాణ ప్రమాదాలు, శిథిల భవనాలు కుప్పకూలే ఘటనల్లో ఆస్కాలైట్ల సాయం తీసుకునేందుకు డీఆర్‌ఎఫ్‌(డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌) రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే.. విపత్తుల నుంచి జనాన్ని గట్టెక్కెంచేందుకు అవసరమైన అన్ని రకాల పరికరాలు, ఎనిమిది కొత్త వాహనాలను కూడా అందిపుచ్చుకుంది.

సహాయ చర్యలు సులభమిక..
హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ అంటే రోడ్లపై చెత్త తొలగించడం, రోడ్లు వేయడం, పైవంతెనలు, అండర్‌ పాస్‌లు నిర్మించడమే కాదు.. విపత్తులు సంభవించినప్పుడు దీటుగా సేవలందిస్తామని కార్యాచరణతోనే స్పష్టం చేస్తోంది. రెండేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం బల్దియాలో డీఆర్‌ఎఫ్‌ విభాగాన్ని ఏర్పాటుచేసింది. మొదట ఎనిమిది ఇసుజు వాహనాలు, పలువురు సిబ్బందితో ఈ సేవలు మొదలయ్యాయి. డైరెక్టర్‌గా నియమితులైన విశ్వజిత్‌ కంపాటి క్రమంగా సిబ్బంది సంఖ్యను పెంచారు. చెట్లు కూలినప్పుడు వాటిని వేగంగా ఎలా తొలగించాలి, వరదల్లో ప్రజలను రక్షించే విధానం, సహాయక చర్యల నిర్వహణ, అగ్ని ప్రమాదాల్లో స్పందించే తీరు, ఇళ్లు కూలినప్పుడు శిథిలాలను తొలగించే విధానం, తదితర నైపుణ్యాలను వారికి నేర్పించారు. వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య విభాగంలో పని చేసే సిబ్బందికి మూడు నెలలకోసారి పోలీసుల తరహాలో ఈ శిక్షణ ఇచ్చి మెలకువలు నేర్పించారు. సమాంతరంగా వర్షాకాలం విపత్తులను ఎదుర్కొనేందుకు జేసీబీలు, చెట్లు కత్తిరించే యంత్రాలు, పైఅంతస్తుల్లోని ప్రజలను క్షేమంగా కిందకు తీసుకొచ్చే యంత్రాలు, జనరేటర్లు, రంపాలు, టార్చిలైట్లు తదితర పరికరాలను సమకూర్చుకున్నారు.

కొత్త వాహనాల్లో..
విపత్తుల నివారణకు ప్రత్యేకంగా రూపొందించిన వాహనాల్లో ఒక్కోదానిలో ఆరు ప్రత్యేక పరికరాలు కలిగిన పెట్టెలు, జనరేటర్‌, ప్రాణవాయువు సిలిండరు, ప్రాథమిక చికిత్స అందించే పరికరాలు, సేఫ్టీ హెల్మెట్‌లు, కట్టర్లు, నీటిని తోడే మోటార్లు, భవనాలను ధ్వంసం చేసే భారీ సమ్మెటలు, స్లాబు కట్టర్లు, ఫైర్‌బాల్స్‌, ఫైర్‌సూట్‌, భవనాల పైనుంచి కింద పడేవారిని రక్షించే రక్షణ వల, రోప్‌ ల్యాడర్‌, ఎలక్ట్రిక్‌ కట్టర్లు తదితర 13 రకాల పరికరాలు ఉన్నాయి. వీటికి ఆస్కాలైటు అదనం. పెట్రోల్‌తో నడిచే జనరేటర్‌ పైభాగంలో ప్రత్యేక వస్త్రంతో ఈ దీపం వెలుగుతుంది. గాలి ఊదినపుడు బంతి ఎలాగైతే వ్యాకోచం చెందుతుందో.. అదే రీతిలో తొడుగులాంటి వస్త్రం జనరేటర్‌ నుంచి విడుదలయ్యే గాలితో 20 అడుగుల ఎత్తు వరకు వెళుతూ పై నుంచి కింది వరకు కాంతిని విరజిమ్ముతుంది. ఆ వెలుగు చుట్టూ 360 డిగ్రీల కోణంలో 500మీటర్ల వరకు వ్యాపిస్తుంది. ఈ వెలుగులో జేసీబీలతో, ఇతర యంత్రాలతో చక్కగా సహాయక చర్యలు చేపట్టవచ్చని డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ కంపాటి ‘ఈనాడు’కు తెలిపారు.

సమర్థంగా సేవలు..
తాజాగా జరిగిన కాచిగూడ రైలు ప్రమాదం, గోల్నాకలో ఓ ఫంక్షన్‌హాల్‌ గోడ కూలిన ఘటన, వనస్థలిపురం, నుమాయిష్‌ అగ్ని ప్రమాదాలు.. ఇలా చాలా ప్రమాదాల్లో డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది అద్భుత సేవలందించారు.  అపశ్రుతులు తలెత్తకుండా పరిస్థితులను అదుపులోకి తెచ్చారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.