సోమవారం, డిసెంబర్ 09, 2019
విభిన్నం.. వేగన్ల జీవన శైలి
పాల ఉత్పత్తులకు చాలా దూరం
ప్రత్యేకంగా గూపులు, రెస్టారెంట్లు సైతం..
ఈనాడు డిజిటల్, హైదరాబాద్
ఒక్కసారి ఆలోచించండి..! ఏ జీవినీ హింసించకుండా, వాటి నుంచి ఎలాంటి లబ్ధి పొందకుండా ఒక రోజంతా గడపగలరా..? ఊహించడానికే కాస్త కష్టంగా ఉంది కదూ.. ఉదయం తాగే కాఫీ, టీలు తయారుచేసే పాలు గేదెలు, ఆవుల నుంచి వచ్చినవే. ఆదివారం ఇష్టంగా తినే మాంసం ఒక మూగజీవి ప్రాణం తీస్తేనే వస్తుంది కదా..! ఆహారం, ఆభరణాలు, నిత్యావసర వస్తువుల్లో జంతువుల ప్రమేయం లేకుండా ఎలా ఉంటుందో ఊహించడం కొంత కష్టమే కదూ..! ఆ ఊహను నిజం చేసేలా.. వీటన్నింటికీ దూరంగా ఉంటున్నవారు మన నగరంలోనే ఉన్నారు. వీరినే వీగన్లు అని పిలుస్తున్నారు. పదుల్లో..వందల్లో కాదు.. నగరం వీరు వేలల్లోనే ఉన్నారు.
మతంతో సంబంధం లేదు..
వేగన్లు జంతువును హింసించి వండిన ఆహారం స్వీకరించరు. వాటితో ప్రమేయం లేని వస్తువులనే వినియోగిస్తారు. శాఖాహారుల కంటే కాస్త భిన్నంగా.. పాలు, పాల ఉత్పత్తులకు సైతం దూరంగా ఉంటారు. జంతువులతో సంబంధం ఉండే ఎలాంటి వినోద కార్యక్రమాలకూ హాజరుకారు. అలా అని వీరందరినీ ఒక మతానికి చెందినవారిగా జమ కట్టేయలేము. జంతువులపై ప్రేమను ఇలా చాటుకుంటూ వారి జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నారు వేగన్లు.
వీగన్ల జీవన శైలి చాలా ప్రత్యేకం.
శాఖాహారులకంటే కఠినంగా వీళ్లు
జీవిస్తారు. ఎంతగా అంటే... పాలతో చేసే ఉత్పత్తులను ముట్టుకోరు.. పట్టు
దుస్తులను కూడా ధరించరు. ఎందుకని ప్రశ్నిస్తే.. అవి ఉత్పత్తి అవడానికి కూడా జీవిని హింసించాలి కదా అని
సమాధానమిస్తున్నారు.
నగరంలో ప్రత్యేక రెస్టారెంట్లు
వేగన్ల కోసం నగరంలో ప్రత్యేకంగా రెస్టారెంట్లు ఉన్నాయి. మాదాపూర్‌లోని స్మార్ట్ అలెక్, బంజారాహిల్స్‌లోని టెర్రాసిన్, కొండాపూర్‌లోని బొటానిక్ గార్డెన్ సమీపంలోని ది లష్ గ్లేజ్ బేకరీతో పాటు పలు సౌందర్య సాధనాల దుకాణాలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడి ఉత్పత్తులు,, అందులో వాడే పదార్థాలు తదితర విషయాలు వాటి మీదే ముద్రిస్తారు.
మూడు వేల మందికి పైగా..
నగరంలో వేగన్లు మూడు వేల మందికి పైగా ఉన్నారు. వీరంతా ఫేస్బుక్లో ఓ గ్రూప్. ఇందులో ఉన్నవారందరూ వారే కాదని.. కొందరు తమ జీవనశైలిని అలా మార్చుకోవాలని చేరినవారున్నారని ‘వేగన్ హైదరాబాద్’ సభ్యులు చెబుతున్నారు. జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించకూడదంటూ నగరంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సహజంగానే పాలు, పెరుగు తయారీ..
వేగన్ ఆహారపు అలవాట్లు శాఖహారులకు దగ్గరగా ఉన్నా కాస్త వైవిధ్యం ఉంటుంది. గేదె, ఆవు పాలను వీరు వాడరు. బదులుగా కొబ్బరి, వేరుసెనగ, నువ్వులు, జీడిపప్పు, బాదం, బియ్యం, ఓట్స్ తదితరాల నుంచి సహజంగా పాలను తయారు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారు. ఈ పాలతోనే పెరుగును తయారు చేస్తున్నారు. తోడు లేకుండానే కొన్ని రకాల పదార్థాలను కలిపి పెరుగును తయారుచేస్తుండటం విశేషం.
ఆహారంలో ఇబ్బందేం లేదు
- సౌమ్య
డెలాయిట్ కంపెనీ ఉద్యోగిని. మా ఇంట్లో అందరూ వీగన్లు కాదు.. నా కోసమే మారుతున్నారు. విందులు, వినోదాల కోసం బయటకు వెళ్లినా అక్కడ శాఖాహారులు తినే పప్పు, ఆకుకూరలు, పప్పుచారు, కూరగాయలతో చేసిన ఆహారాన్నే తీసుకుంటాము. పాలతో చేసిన పదార్థాలను మాత్రమే ముట్టుకోం. సౌందర్య సాధనాలు, చిరుతిళ్లు, డిటర్జెంట్లు, టాయిలెట్ క్లీనర్లు, ఇతర ఆభరణాల కోసం ప్రత్యేకంగా వేగన్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసే సమయంలో ఫిల్టర్‌ను ఎంపిక చేసుకుని కొనుగోలు చేస్తాం. ముత్యాల తయారీ క్రమంలో ఆల్చిప్పలు సైతం చాలా బాధ అనుభవిస్తాయి. అందుకే ముత్యాలను ధరించం. ఒక పట్టు చీర రావడానికి ఎన్ని పట్టుపురుగులు చనిపోతాయో అని ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంటుంది. అందుకే పట్టు దుస్తులు ధరించము.
తాజా వార్తలు
జిల్లా వార్తలు