close

శుక్రవారం, డిసెంబర్ 06, 2019

ప్రధానాంశాలు

అక్కడ చెత్త బంగారమే!

దేశంలో మొదటి స్థానంలో ఇండోర్‌
ప్రయత్నిస్తే జీహెచ్‌ఎంసీకీ సాధ్యమేనంటున్న అధికారులు
ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే

ఇళ్లలోని వ్యర్థాలను తీసి రోడ్డుపైనో, చెత్త కుండీలోనో పడేస్తుంటాం. ఆ చెత్తను వివిధ రూపాల్లో వేరు చేసి వాడుకుంటే ఏ ఒక్కటీ వృథా పోదు. చెత్త బంగారమంటే ఇదే. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చెత్తను అన్ని విధాలుగా వినియోగించుకుంటున్నారు. పారిశుద్ధ్యంలో ఏటా దేశంలోనే మొదటి స్థానంలో నిలుస్తున్న ఆ నగరాన్ని జీహెచ్‌ంఎసీ ఖైరతాబాద్‌ జోన్‌కు చెందిన పలువురు అధికారుల బృందం సందర్శించింది.

తడి, పొడిపై ప్రజలకు పూర్తి అవగాహన
ప్రతి ఇంట్లో, వ్యాపార కేంద్రంలో తప్పనిసరిగా తడి, పొడి చెత్త కోసం రెండు డబ్బాలు సొంతంగా ఏర్పాటు చేసుకుంటారు. బదిలీ కేంద్రంలోనూ చెత్తను తడి, పొడిగా వేరు చేస్తున్నారు. తడి, పొడి చెత్తపై బస్తీలు, కాలనీల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు.

ఆటోవాలకు, ర్యాక్‌ పిక్కర్లకు వేతనాలు
ఇండోర్‌లో చెత్త ఆటోలు కార్పొరేషన్‌వే. ఆటో డ్రైవర్‌కు నెలకు రూ.15వేల వరకు, దుకాణాల నుంచి వ్యర్థాలను సేకరించి తెచ్చే ర్యాక్‌ పిక్కర్లకు రూ.6వేల వరకు వేతనం ఇస్తున్నారు. మార్కెట్‌ నుంచి వచ్చే చెత్తలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు, వస్త్రాలు, కర్ర, తడి, పొడి చెత్త, రాళ్లు తదితరాలను వేరుచేసి వేర్వేరుగా ఉన్న గదుల్లో ఉంచుతారు. వ్యాపార కేంద్రాల్లో ర్యాగ్‌పిక్కర్లు సేకరించిన ప్లాస్లిక్‌ వ్యర్థాలను కార్పొరేషన్‌ అనుమతిచ్చిన కేంద్రాల్లోనే అమ్ముకోవాలి.

చెత్త సేకరణలో ఇక్క ఇళ్లూ మిస్‌ కాదు
ప్రతి ఆటోకు 800 ఇళ్లు కేటాయిస్తారు.  ఆటోవాలాలు నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నారో లేదో కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షిస్తారు. దారి తప్పితే వైర్‌లెస్‌ సెట్‌ ద్వారా కారణం తెలుసుకుంటారు. ఆటో వెళ్లలేని ఇళ్లకు కార్మికుల్ని పంపి సేకరిస్తారు. ప్రతి ఆటోతో డ్రైవర్‌, సహాయకుడు ఉండగా ఎన్జీఓ పర్యవేక్షిస్తాడు.

తినుబండారాల కవర్లతో ఫర్నిచర్‌
తినుబండారాల కవర్లతో అక్కడ ఫర్నిచర్‌ తయారు చేస్తున్నారు. ఈ పనుల్ని స్వచ్ఛంద సంస్థకు అప్పగించగా ప్లాస్టిక్‌ సమర్థన్‌ పేరుతో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యర్థాలతో రంగురంగుల బెంచీలు, కుర్చీలు, ఇతర పరికరాలను వీరు తయారు చేస్తున్నారు.

అత్యవసర వాహనాలకు ప్రత్యేక దారి
ఇండోర్‌ నగరవ్యాప్తంగా అధికంగా నాలుగులేన్ల రోడ్లు ఉన్నాయి. ఒక లేన్‌లో అంబులెన్స్‌, అగ్నిమాపక యంత్రం, ఏసీ ఆర్టీసీ బస్సు వెళతాయి. అత్యవసర మార్గానికి కూడళ్లలో మినహా మిగతా ప్రాంతంలో రోడ్డు పొడవునా ఫెన్సింగ్‌ ఉంటుంది.

ఇండోర్‌తో హైదరాబాద్‌ పోటీ పడాలంటే..
ఇండోర్‌తో హైదరాబాద్‌ నగరం పోటీ పడాలంటే తగినంత పారిశుద్ధ్య సిబ్బంది అవసరం. తొలుత బదిలీ కేంద్రాలు (ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లు) ఆధునికీకరించాల్సి ఉంది. తడి, పొడి చెత్తను వేరు చేసేందుకు జనానికి బిన్లను అప్పగించినా సేకరణకు తగిన యంత్రాంగం లేదు. ప్రజలపై ఒత్తిడి తెచ్చి తడి, పొడి వేరుచేయించినా ఆటోలో తీసుకెళ్తున్న తీరూ మారాల్సి ఉంది. తొలుత బదిలీ కేంద్రాలను ఆధునికీకరించి, వాహనాలు అందుబాటులోకి తెచ్చి.. తడి, పొడిని వేరు చేయగలిగితే ఇండోర్‌తో పోటీ పడే అవకాశం లేకపోలేదని అధికారులు భావిస్తున్నారు. బృందం చూసిన అంశాల్ని నరగంలోని అన్ని జోన్ల అధికారులకు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఇటీవల వివరించారు. ఇండోర్‌ వెళ్లిన అధికారుల బృందంలో ఉపకమిషనర్లు బి.గీతారాధిక, జె.సువార్త, ఏఎంఓహెచ్‌ డా.భార్గవ్‌ నారాయణ, ఇంజినీర్లు బి.కృష్ణ, బి.విజయ్‌కుమార్‌, ఏసీపీలు వై.కృష్ణకుమారి, కె.శ్రీనివాస్‌, డీపీఓ ఆర్‌.సంధ్యారాణి ఉన్నారు.

ఎరువుగా.. బయోగ్యాస్‌గా
తడి చెత్తను గ్రైండింగ్‌ చేసి ఎరువు (కంపోస్టు)గా, అందులో నుంచి వెలువడే ద్రవ పదార్థాన్ని బయోగ్యాస్‌గా వినియోగిస్తున్నారు. పొడి చెత్తను బయోగ్యాస్‌ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు. ఎరువును మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్కుల్లోని మొక్కలకు వాడుతున్నారు. మిగిలితే ప్రైవేటు వారికి విక్రయిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. అక్కడి భారీ కూరగాయల మార్కెట్‌ ఎదుç ‘బయో మెకనైజేషన్‌ ప్లాంట్‌’ ఉంది. మార్కెట్‌లోని చెత్తను నేరుగా ఆ ప్లాంటుకు తరలిస్తారు. పొడి చెత్త, ప్లాస్టిక్‌ను ర్యాగ్‌ పిక్కర్స్‌తో వేరుచేయిస్తారు.

బర్తన్‌ బ్యాంకు
ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న ఆలోచనతో ఇండోర్‌ కార్పొరేషన్‌ శుభకార్యాలకు ఉచితంగా స్టీల్‌ ప్లేట్లను అందిస్తోంది. అందుకోసం బర్తన్‌ బ్యాంకులను నిర్వహిస్తోంది. నగర వ్యాప్తంగా ఆరు కేంద్రాల్లో వీటి నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. ఎక్కడ శుభకార్యం ఉన్నా ఆ సంస్త వ్యక్తులు అవసరమైన ప్లేట్లు ఉచితంగా సరఫరాచేస్తారు. మరోవైపు అక్కడి పొదుపు సంఘాలతో రాత్రి బజార్‌ నిర్వహిస్తూ ఉపాధి కల్పిస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.