close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

పల్లెకో ట్రాక్టర్‌ ఫలించేనా!

సగం గ్రామాల్లో ఆర్థిక పరిస్థితి అంతంతే

కొనుగోలు, నిర్వహణ ఎలా?

కొన్నది కొద్దిమందే

బ్యాంకులు రుణం ఇస్తేనే ముందడుగు

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌, న్యూస్‌టుడే, వికారాబాద్‌ గ్రామీణ

పంచాయతీల్లో చెత్తను ఎప్పటికప్పుడు తరలించి పరిశుభ్రంగా ఉంచేందుకు.. హరితహారంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు ట్రాక్టర్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం సర్పంచులను ఆదేశించింది. ఇందుకోసం పంచాయతీ, ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలని.. ఆదాయం లేని చోట బ్యాంకుల ద్వారా రుణం తీసుకోవాలని సూచించింది. ఈ ఆదేశాలతో సర్పంచులు ఆందోళనకు గురవుతున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకే నిధులు లేవని, విద్యుత్తు బిల్లులు చెల్లించేందుకు నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. గతంలో చెత్తను తరలించేందుకు మూడు చక్రాల రిక్షాలు పంపిణీ చేశారని, వాటి నిర్వహణకే నిధులు లేక మూలకు చేరాయని చెబుతున్నారు. ఇప్పుడు ట్రాక్టర్ల భారం ఎలా మోయాలని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 61 పంచాయతీలు ట్రాక్టర్లను కొనుగోలు చేశాయి. మిగతా గ్రామాల సర్పంచులు నిధులు ఎక్కడినుంచి తేవాలని ఆలోచిస్తున్నారు. వీరికి రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధమైతేనే అడుగు ముందుకు పడనుంది.

జిల్లాలో ప్రస్తుతానికి 14వ ఆర్థిక సంఘం నిధులున్న పంచాయతీలు నేరుగా వాహనాలు కొనుగోలు చేస్తున్నాయి. సరిపడా సొమ్ము లేనివి బ్యాంకు రుణం కోసం నిరీక్షిస్తున్నాయి. రుణం ఇస్తే తిరిగి చెల్లిస్తారో లేదో అన్న సంశయం బ్యాంకు అధికారుల్లో కనిపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 14 బ్యాంకుల శాఖలు కొనసాగుతున్నాయి. వీటిల్లో ఒకే బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందుకొచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్ఛు ఇక ట్రాక్టర్‌ కొనుగోలు, డ్రైవర్‌, ఇతర సిబ్బంది, డీజిల్‌, ఇతర నిర్వహణ ఖర్చులు అదనపు భారం కానున్నాయి. ఆదాయం ఉన్న గ్రామాలు ఎలాగూ నెట్టుకొచ్చినా, ఆర్థిక స్థోమత లేని వాటి పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

మొత్తం పంచాయతీలు 565

జిల్లాలో మొత్తం 565 పంచాయతీలు ఉన్నాయి. ఇందులో నిధులు అందుబాటులో ఉన్నవి ట్రాక్టర్లు కొనుగోలు చేశాయి. మిగతా పల్లెలు నిధుల కోసం అన్వేషిస్తున్నాయి. ఇటీవల మంత్రి సబితారెడ్డి సమీక్షా సమావేశంలో జిల్లా మినరల్‌ ఫండ్‌ నుంచి కొంత సొమ్మును సర్దుబాటు చేయాలని సూచించారు. అయినా కొన్నింటికి వాహనం సమకూరేలా కనిపించడం లేదు. ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలంటే పంచాయతీ ఖాతాలో కనీసం రూ.6 లక్షల పైగా నిధులు అందుబాటులో ఉండాలని నిర్ణయించారు. అంతకంటే తక్కువ ఉన్న వాటికి సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీంతో గ్రామాల వారీగా నిధుల గురించి లెక్కలు వేస్తున్నారు.

లెక్కలు ఇలా

సుమారు 250 పంచాయతీల్లో రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలంటే కనీసం రూ.9 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన రూ.6 లక్షల కంటే తక్కువ నిధులు ఉన్న పంచాయతీలు మరో 250 వరకు ఉంటాయని అంచనా. వాటికి ఎలా సమకూర్చాలో అధికారులకు అంతుబట్టడంలేదు. (ఉదాహరణకు కుల్కచర్ల మండలంలో రూ.6 లక్షల కంటే ఎక్కువ నిధులు ఉన్న పంచాయతీలు 20 ఉన్నాయి. అంతకంటే తక్కువ నిధులు ఉన్నవి 24 ఉన్నాయి.) వాహనం కొనుగోలుతో సరిపోదు. దాన్ని నడిపించాలంటే డ్రైవర్‌, డీజిల్‌ అవసరం ఉంటుంది. పల్లెల్లో వసతలు కల్పనకే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇటువంటి పరిస్థితిలో ట్రాక్టర్ల నిర్వహణ కష్టసాధ్యమే అంటున్నారు.

50 శాతం బ్యాంకు రుణం

పంచాయతీల్లో ట్రాక్టర్ల కొనుగోలుకు సరిపడా నిధులు అందుబాటులో లేనపుడు యూనిట్‌ ఖరీదులో 50 శాతం రుణం ఇవ్వడానికి జిల్లాలో ఒక బ్యాంకు ముందుకొచ్చింది. మిగతా సగం పంచాయతీ ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఇప్పటికిప్పుడు రూ.4.5 లక్షల నుంచి రూ.5 లక్షల సొమ్ము చెల్లించాలి. రుణం ఇచ్చిన మొత్తానికి సుమారుగా 9 నుంచి 10 శాతం వడ్డీ వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 60 నెలలు కాలపరిమితి విధిస్తున్నారు. అయితే రుణం ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావడంవలేదు. పంచాయతీ ఏ బ్యాంకు పరిధిలో ఉంటే అక్కడి నుంచి మాత్రమే రుణం లభిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.

నిర్వహణ ఖర్చు ప్రభుత్వమే చెల్లించాలి

పంచాయతీలకు సరఫరా చేసిన ట్రాక్టర్లకు సంబంధించి డ్రైవర్‌ జీతాలను ప్రభుత్వమే చెల్లించాలని సర్పంచులు కోరుతున్నారు. రూ.రెండు, మూడు వేలకు డ్రైవర్లు రావడం లేదని, రూ. 10 వేల నుంచి 12 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చు మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తే కొంత భారం తగ్గుతుందని అంటున్నారు.

అన్ని పంచాయతీలకు సమకూరుస్తాం

రిజ్వానా, జిల్లా పంచాయతీ అధికారి

ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించాం. నిధులు అందుబాటులో ఉన్న వాటికి సంబంధించి ముందుగా సరఫరా చేస్తున్నాం. అవసరమైన చోట బ్యాంకర్లతో మాట్లాడి రుణ సదుపాయం కల్పిస్తాం. మరికొన్నింటిలో నగదు నిల్వలు తక్కువగా ఉన్న చోట ఏం చేయాలనేది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటాం.

విద్యుత్తు బిల్లులు భరించలేకపోతున్నాం

-అంజయ్య, సర్పంచి, సిద్ధులూరు

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తోంది. అందుకు అనుగుణంగా నిధులు మంజూరు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. 30 రోజుల ప్రణాళికలో విడుదలైన మొదటి నెల నిధులతో కరెంటు బిల్లులు చెల్లించాం. రెండో సారి విడుదల కాగానే ట్రాక్టర్‌ కొన్నాం. నెల తిరిగే సరికి రూ.లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది. డ్రైవర్‌, సిబ్బంది జీతాలు, విద్యుత్తు బిల్లులు ప్రభుత్వమే భరిస్తే పంచాయతీలు మరింతగా పురోగతి చెందుతాయి.

ప్రణాళికలకు తగ్గట్లుగా నిధులు కేటాయించాలి

-అనిత, సర్పంచి, గోధుమగూడ

గ్రామాల పురోగతికి ప్రభుత్వం మంచి ప్రణాళికలే అమలు చేస్తోంది. నిధులు మాత్రం సరిపోవడం లేదు. పంచాయతీలో పని చేసేవారికి ప్రతి నెలా జీతం చెల్లించాలి. విడుదల చేసిన నిధులు విద్యుత్‌ బిల్లులు, ట్రాక్టర్ల కొనుగోలు ఉపయోగిస్తే పంచాయతీ ఖర్చులు భరించడం కష్టం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.