close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

జాతీయ-అంతర్జాతీయ

కొలువుల్లో నకి‘లీలలు’

● పొరుగు జిల్లా, రాష్ట్రాల నుంచి నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు

● తప్పుడు ధ్రువ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు

● ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా చర్యలు శూన్యం

ప్రభుత్వ కొలువు సాధించడం అంటే ఒక కల. రేయింబవళ్లు కష్టపడి చదివి, పోటీ పరీక్షల్లో రాణించి ఆ కలను సాకారం చేసుకోవాలి. కొందరు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో సులువుగా ఉద్యోగాలు సాధించేస్తున్నారు. కీలక శాఖలో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అంతేనా...విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులుగా, వ్యవసాయాధికారులుగా, ప్రాణం పోసే వైద్యులుగా చలామణి అవుతున్నారు. ఇలా ప్రతి శాఖ కొలువుల్లోనూ నకిలీలు దర్శనమిస్తూనే ఉన్నాయి.

ఈనాడు డిజిటల్‌ - కర్నూలు: ఎల్లెల్సీ డీఈఈ వెంకటేశ్వర్లు ఓసీకి చెందినవారని, ఎస్టీ(చెంచు)గా నకిలీ ధ్రువపత్రంతో ఉద్యోగం సంపాదించారని ప్రొద్దుటూరుకు చెందిన ఓ మహిళ గత నెల 25న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వర్లు నకిలీ ధ్రువపత్రంతో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి ధ్రువపత్రం రద్దు చేయాలని కడప కలెక్టర్‌ ఆదేశించారు. 2006లో ఆత్మకూరు కరివేనలో ఎస్సార్బీసీ డ్రాఫ్ట్‌మెన్‌గా విధుల్లో చేరి పదోన్నతిపై డీఈఈగా వచ్చారు.

*జిల్లాలోని జలవనరుల శాఖలోని కొన్ని విభాగాల్లో విధులు నిర్వహించే కొందరు ఇంజినీర్లు నకిలీ ధ్రువీకరణ పత్రాలతో చలామణి అవుతున్నారు. మైనర్‌ ఇరిగేషన్‌, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీ కెనాల్‌లో వందల సంఖ్యలో నకిలీలు ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఎమ్మిగనూరు పరిధిలోని ఓ లస్కర్‌ 6-10 ఏళ్లు పనిచేశాక పదోన్నతి అవకాశం రావడంతో విద్యార్హత కోసం కర్ణాటక నుంచి నకిలీ ధ్రువపత్రాలు పొంది దర్జాగా ఉద్యోగం చేస్తున్నారు. కేసీ కాల్వ నంద్యాల డివిజన్‌ పరిధిలో కొందరు ఏఈఈలు ఎస్సీ, ఎస్టీ ధ్రువీకరణ పత్రాలతో కొనసాగుతున్నా ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ● జిల్లాలో ప్రస్తుతం నాపరాళ్లకు ప్రసిద్ధిగాంచిన ఓ మండలంలోని ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. ఒక్క అక్షరంతో పేరు మార్చుకుని ప్రకాశం జిల్లా నుంచి దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నారు. అంతేనా? క్రిస్టియన్‌(మాదిగ) మార్చి ఎస్సీ(మాల)గా ధ్రువీకరణ పత్రం పొంది 2003 డీఎస్సీ ద్వారా ప్రభుత్వ కొలువు సాధించారు. ఈ తంతును సహ చట్టం ద్వారా బయటకు తీసి ఆధారాలతో బీటీఎఫ్‌ ప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వీటితోపాటు సీనియర్లను పక్కనపెట్టి జూనియర్లకు తప్పుడు మార్కులు వేసి పదోన్నతి, రిటైర్డ్‌ అయిన అటెండర్‌కు పదోన్నతి వంటి అవకతవకలను వెలుగులోకి తెచ్చారు.

*ఇలా జిల్లా అంతటా విద్యాశాఖలో నకిలీలు రాజ్యమేలుతున్నాయి. కుల ధ్రువీకరణ పత్రాలు అధికంగా ఆత్మకూరు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి పొందుతున్నట్లు వెలుగులోకి వస్తున్నాయి. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, పీజీ వంటి సర్టిఫికెట్లు జిల్లాలో మారుమూల నిర్వహించే కళాశాలల నుంచి, కడప, ప్రకాశం జిల్లాలు, కర్ణాటక రాష్ట్రం నుంచి పొందుతున్నారు. రాయలసీమ వర్సిటీలో సైతం కింది స్థాయి బోధనేతర సిబ్బంది 30 మంది వరకు దేవనకొండ మండలంలోని ఒకే పాఠశాలలో పదో తరగతి చదివినట్లు తప్పుడు పత్రాలతో పొరుగు సేవల కింద కొలువులు సాధించారు.

రైతులకేం అవగాహన కల్పిస్తారు?: ఇంటర్‌ ఎంపీసీ చదివి వ్యవసాయాధికారిగా ఓ అధికారి జిల్లా కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆదోనిలో వ్యవసాయ శాఖలో ఓ అధికారి ఇంటర్‌ బోగస్‌ సర్టిఫికెట్‌తో కొలువు సాధించారన్న ఆరోపణలున్నాయి. జిల్లాలో వ్యవసాయశాఖలో సుమారు 35 మంది నకిలీ ధ్రువపత్రాలతో కొలువులు పొందినట్లు అమరావతిలోని ఉన్నతాధికారులకు 2010లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో అమృతరాజ్‌ విజిలెన్స్‌ కమిటీ వేసి నివేదికలు సైతం అందజేశారు. ఇప్పటికీ ఇలాంటివారిపై చర్యలు తీసుకోకుండా యంత్రాంగం నాన్చుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఎక్కడైనా చదవని, ఏ డిగ్రీ చేయని వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నవారిని క్రమబద్ధీకరించాలని గత ప్రభుత్వంలో ఓ జీవో 64 సైతం తీసుకొచ్చారు. ఏజీ బీఎస్సీ చదివిన పట్టభద్రులు దీనిపై 45 రోజులు ధర్నా చేయడంతో విషయం తెలుసుకున్న ప్రభుత్వం జీవోను రద్దు చేశారు. ఇలా కొలువు సాధించి నకిలీ బయో ఉత్పత్తులు, విత్తనాల వ్యాపారాలు పరోక్షంగా చేసుకుంటూ ఆర్జిస్తున్నారే తప్ప రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారు.

నకిలీ వైద్యులు ఎన్నో లీలలు : జిల్లాలో నకిలీ ధ్రువపత్రాలతో వైద్యుల అవతారమెత్తి నాడి పట్టిన వారెందరో ఉన్నారు. నగరానికి చెందిన నాగేంద్ర అనే వ్యక్తి బీటెక్‌ చదివి ఎంబీబీఎస్‌ ఎండీగా, ఇంటర్‌ చదివిన తన భార్యను ఎంబీబీఎస్‌, డీసీహెచ్‌గా, బీకాం చదివిన బావమరిదిని ఎంబీబీఎస్‌ ఎండీగా నకిలీ వైద్యుల అవతారమెత్తారు. స్థానికంగా జేపీ చిల్డ్రన్‌ సూపర్‌స్పెషాల్టీ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. అంతేనా ఈఎస్‌ఐ నిధులు సైతం స్వాహా చేయడంతో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేసి పట్టుకున్న విషయం విదితమే. మాధవీనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుడు నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగంలో చేరినట్లు అధికారులు గుర్తించారు. ఆయా శాఖల్లో నకిలీ తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగాలు చేసే వారిని గుర్తించి తొలగించాలని 2017, జూన్‌ 15న కేంద్రం రాష్ట్రాలకు సూచించినా ఆ దిశలో అడుగులు పడలేదు. నకి‘లీలల’పై జల వనరుల శాఖ ఎస్‌ఈ శ్రీరామచంద్రమూర్తి స్పందిస్తూ ఏఈ స్థాయి అధికారుల ధ్రువీకరణ పత్రాలు ఈఎన్‌సీ కార్యాలయం విచారించి విధుల్లోకి తీసుకుంటుందన్నారు. ఆ తర్వాత పరిశీనల చేయాల్సిన బాధ్యత తమపైనా ఉంటుందన్నారు. ఏవైనా లోపాలు గుర్తిస్తే ఈఎన్‌సీకి నివేదిస్తామని, ఎల్లెల్సీ డీఈఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్లిందన్నారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.