close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

సహకారం.. మరింత ప్రయోజనం!

మండలానికి రెండు సంఘాల ఏర్పాటుకు నిర్ణయం

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, బషీరాబాద్‌

కొత్తగా ఏర్పాటైన కోట్‌పల్లి మండలంలో రెండు సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. మండల కేంద్రంలో ఒకటి, మరొకటి రైతులకు అందుబాటులో ఉండేలా. ఇప్పటి వరకు మండలంలో సంఘం లేకపోవడంతో బంట్వారం, పెద్దేముల్‌ మండలంలో సేవలు పొందుతున్నారు.

బషీరాబాద్‌ మండలంలో 36 పంచాయతీలకు నవాంద్గీలో మాత్రమే సంఘం ఉంది. కొన్ని గ్రామాల వారే దీని ద్వారా సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం మండలంలో మరోకటి ఏర్పాటు కానుంది. మండలంలో 12వేల మంది రైతులను ఆరువేల చొప్పున విభజించి రెండుగా ఏర్పాటు చేయనున్నారు.

సహకార సంఘాలను రైతులకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మండలానికి రెండు సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటి ఉంటే మరోటి ఏర్పాటు చేయనున్నారు. అధికారులు వివరాలు సేకరించి ఏ గ్రామంలో సంఘం ఏర్పాటు చేస్తే అన్నదాతలకు అనువుగా ఉంటుందోనని నిర్ణయం తీసుకోనున్నారు. జిల్లాలో ఎక్కడెక్కడ కొత్తవి ఏర్పాటు చేయాలో నివేదిక ఇవ్వాలని జిల్లా సహకార శాఖ అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

వికారాబాద్‌ జిల్లాలోని 18 మండలాల పరిధిలో 22 సహకార సంఘాలు కొనసాగుతున్నాయి. ఇందులో 20వేల వరకు రైతులు సభ్యులుగా ఉన్నారు. వీటి ద్వారా రైతులకు తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయానికి వడ్డీ లేని రుణాలు అందజేస్తోంది. వీటితో పాటు ఖరీఫ్‌, రబీ సీజనులో రైతులకు ఇబ్బందులు కలగకుండా విత్తనాలు, ఎరువులను అందుబాటులో పెడుతున్నారు. ధాన్యం, కందుల కొనుగోలు కేంద్రాలను సైతం నిర్వహిస్తున్నారు. అన్ని వ్యవసాయ కార్యకలాపాలు సంఘాల ద్వారా రైతులకు అందించాలని ప్రభుత్వం బావించింది. మండలానికి ఒకే సంఘం ఉండడంతో దూరం కావడం.. సేవల్లో నిర్లక్ష్యం వంటి కారణాలతో రానురాను రైతులు దూరం అవుతున్నారు. వీటన్నింటినీ అధిగమించి మండలంలో ఉన్న ప్రతి రైతుకు సభ్యత్వాన్ని ఇచ్చి సంఘాల్లో సేవలు తీసుకునేలా చర్యలు తీసుకునేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.

జిల్లాకు కొత్తగా 14 సహకార సంఘాలు

ధారూరు, మోమిన్‌పేట, పెద్దేముల్‌, నవాబుపేట, వికారాబాద్‌ మండలాల్లో ప్రస్తుతం రెండు సంఘాలు కొనసాగుతున్నాయి. బషీరాబాద్‌, యాలాల, పూడూరు, దోమ, కుల్కచర్ల, తాండూరు, పరిగి, దౌల్తాబాద్‌, కొడంగల్‌, బొంరాస్‌పేట, మర్పల్లి, బంట్వారం మండలాల పరిధిలో ఒకే సహకార సంఘం కొనసాగుతోంది. ఒక సంఘం ఉన్న మండలాల్లో అదనంగా మరొకటి, కొత్తగా ఏర్పాటైన కోట్‌పల్లి మండలంలో రెండు మొత్తం కలిపి 14 కొత్త సహకార సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వివరించారు.

కొత్త వాటి ఏర్పాటుతో మేలు

లక్ష్మినారాయణ, జిల్లా సహకారశాఖ అధికారి, వికారాబాద్‌

జిల్లాలో కొత్తగా ఏర్పాటయ్యే 14 సహకార సంఘాల ద్వారా రైతులకు సకాలంలో సేవలు అందుతాయి. ఒకటే సంఘం ఉన్న మండలాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందేవి కావు. ప్రతి ఒక్కరైతుకు ఇబ్బంది కలగకుండా వ్యవసాయ సంబంధిత అన్నిరకాల సేవలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మండలానికి రెండు సంఘాల ఏర్పాటు చేస్తోంది. నివేదికను ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది.

బలోపేతానికి అవకాశం.!

కొత్త సంఘాల ఏర్పాటుతో రైతులంతా సభ్యత్వాలు స్వీకరించేలా చర్యలు తీసుకోనుండటంతో బలోపేతం కానున్నాయి. రుణాలు తీసుకున్న రైతులకు పదిశాతం భాగం ఉంటుంది. వీటితో పాటు బంగారు రుణాలు ఇవ్వడం, వ్యవసాయ అనుబంధ అభివృద్ధికి తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తే రైతులు ఎక్కువగా బ్యాంకులకు వెళ్లకుండా సహకార సంఘాలకు రావడానికి మొగ్గు చూపిస్తారు. లావాదేవీలు పెరిగి సంఘాలు అభివృద్ధిబాటలో పయనిస్తాయి.

ఇప్పట్లో ఎన్నికలు లేనట్లే.!

కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం నిర్ణయంతో ఇక ఇప్పట్లో సహకార సంఘాల ఎన్నికలు లేనట్లేనని తెలుస్తోంది. సహకార సంఘాల పాలకవర్గం పదవీకాలం ముగిసి ఏడాదిన్నర కావస్తోంది. పాత పాలకవర్గాలనే పొడిగిస్తూ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోంది. మండలానికి రెండు సంఘాలను పెంచిన తరువాతే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.