close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

వాహనం కొన్నచోటే.. సంఖ్యా ఫలకం

డీలర్ల వద్ద అందుబాటులో

మారిన నిబంధనలు

వాహన దారులకు తప్పనున్న నిరీక్షణ

న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

తాండూరులో రవాణా శాఖ ఉప కార్యాలయం

తాండూరుకు చెందిన రమేష్‌ కొత్తగా కారు కొనుగోలు చేశారు. తాండూరులోని ఆర్టీఏ ఉప కార్యాలయంలో వాహనం రిజిస్ట్రేషన్‌ చేయించేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. వారంలో ఒక్కరోజే కార్యాలయంలో సేవలు అమలు చేస్తుండటంతో రోజుల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఈ క్రమంలో సంఖ్యా ఫలకానికి (నంబరు ప్లేటు) ఎన్నాళ్లు ఎదురు చూడాలోనని ఆందోళన చెందారు. ఇదే విషయాన్ని ఆర్టీఏ కార్యాలయంలో వాకబు చేశారు. నిబంధనలు మారాయని, కారు ఎక్కడ కొనుగోలు చేశారో అక్కడే సంప్రదించాలని సూచించారు. అక్కడికి వెళ్లి అడిగితే నాలుగురోజుల వ్యవధిలో నంబరు సమకూర్చారు. దీంతో ఆర్టీఏ కార్యాలయంలో రద్దీతోపాటు, ఎదురు చూడాల్సిన పరిస్థితి తప్పింది.

జిల్లాలో వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌లోని 565 పంచాయతీల్లో 9.79 లక్షల జనాభా ఉన్నారు. ప్రస్తుతం వాహనాల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. పట్టణాలు, గ్రామాలు తేడాలేకుండా విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం చేసే వారంతా వీటిని వాడుతున్నారు. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు ఇంటింటికీ ఒకటిరెండు చొప్పున ఉన్నాయి. పద్దెనిమిది మండలాల్లో యాభై శాతం పైగా ప్రజలు వాహనాలను వినియోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 2లక్షల వాహనాలు ఉన్నాయి. వాహనాల కొనుగోలు, వాడకందారుల సంఖ్య పెరుగుతుండగా అందుకు అనుగుణంగా రవాణా శాఖ సేవలను విస్తరించడం లేదు. జిల్లాలో వికారాబాద్‌, పరిగి రవాణా శాఖ కార్యాలయాలు కొనసాగుతుండగా తాండూరులో ఉప కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. పరిగి, వికారాబాద్‌లో నిరంతరం సేవలు అందిస్తుండగా తాండూరులో మాత్రం వారంలో శుక్రవారం ఒక్కరోజే సేవలు అందిస్తున్నారు. సిబ్బంది కొరతతో కార్యాలయంలో మంగళవారం అందించే సేవలను నెల కిందట రద్దు చేశారు. దీంతో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలంతోపాటు పట్టణంలోని వాహనదారులు రవాణా శాఖ సేవలకు నిరీక్షించక తప్పడం లేదు. ఇదే కార్యాలయానికి పక్కనున్న కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాల నుంచి వస్తున్న వారికి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. వికారాబాద్‌, పరిగి కార్యాలయాల్లో సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో వాహనదారులు రిజిస్ట్రేషన్లు, నంబరు, చోదక అనుమతులు పొందేందుకు నెలల తరబడి కార్యాలయాల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక నుంచి ఊరట

ఇప్పటివరకు వాహనాలకు రిజిస్ట్రేషన్‌ చేయిస్తే వికారాబాద్‌, పరిగి, తాండూరు ఆర్టీఏ కార్యాలయాల పరిసరాల్లో ఇతర సిబ్బందితో సంఖ్యా ఫలకాలను బిగించేవారు. అందుకు వారాల తరబడి సమయం పట్టేది. తాజాగా ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేయడంతో టీర్‌(టెంపరరీ రిజిస్ట్రేషన్‌) సంఖ్య జారీ అయిన వాహనాలన్నింటికి సంబంధించిన ఫలకలను సంబంధిత డీలరు, లేదంటే సబ్‌ డీలరు వద్దనే పొందేలా వెసులుబాటు కల్పించారు.

షోరూంలలో రుసుం..

కొత్తగా కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్‌ను సదరు యజమాని అభీష్టం మేరకు ఎక్కడైనా చేసుకోవచ్ఛు రిజిస్ట్రేషన్‌ నిమిత్తం ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఈ సమయంలో రిజిస్ట్రేషన్‌ రుసుంతోపాటు సంఖ్యా ఫలకానికి వసూలు చేసే వారు. తాజాగా నంబరుకు సంబంధించిన రుసుంను వాహన కొనుగోలు సమయంలోనే డీలర్లు వసూలు చేస్తున్నారు. దీంతో షోరూంలలోనే అమర్చే విధానాన్ని అమలు చేస్తున్నారు. నూతన విధానాన్ని తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌లోని షోరూంలలో ఆచరణలోకి తెచ్చారు.

షోరూంలలోనే అమర్చుకోవాలి

కిషోర్‌, మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌, తాండూరు

కొత్తగా వాహనాలు కొన్నవారు నంబరును అదే షోరూంలకు వెళ్లి అమర్చుకోవాలి. ఇప్పటివరకు ఆర్టీఏ కార్యాలయాల వద్ద కొంత స్థలం ఇచ్చి థర్డ్‌ పార్టీ సిబ్బందితో అమర్చాల్సి వచ్చేది. నిబంధనల్లో మార్పు చేయడంతో కార్యాలయాల వద్ద నంబరు ప్లేటు అమర్చడం కుదరదు. వాహనదారులు షోరూంలకు వెళ్లి అమర్చుకోవాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.