close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

మానసిక రోగులకు భరోసా

జిల్లాలో నాలుగు పీహెచ్‌సీల్లో చికిత్స

మరో అయిదుచోట్ల ప్రారంభానికి సన్నాహాలు

వారానికోసారి మానసిక వైద్యుడితో పరీక్షలు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ మున్సిపాలిటీ

మన జీవనశైలిలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒత్తిడి, కోపం, కుంగుబాటు, అసంతృప్తి, ఆవేశం.. ఎక్కువవుతున్నాయి. ఫలితంగా అనేక మంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారు. చివరికి ఆత్మహత్యకు పాల్పడటం, హింసాత్మక సంఘటనలు చేయడానికి సైతం వెనుకాడటం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలల క్రితం ప్రయోగాత్మకంగా నాలుగు జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో హైదరాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేట, వికారాబాద్‌ జిల్లాలున్నాయి. ఈ నేపథ్యంలో వికారాబాద్‌లో సేవలపై ‘న్యూస్‌టుడే’ కథనం..

వికారాబాద్‌ జిల్లాలో నవల్గా, యాలాల, ధారూర్‌, దౌల్తాబాద్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మానసిక రుగ్మతలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలకు వారానికి ఒకసారి మానసిక వైద్యుడు వెళ్లి రోగులను పరీక్షిస్తారు. వారికి అవసరమైన మందులు అందజేసి చికిత్స చేస్తారు. ఒకవేళ మందులతో తగ్గకపోతే హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు సిఫార్సు చేస్తారు.

ఇలా గుర్తిస్తారు..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో శిక్షణ పొందిన ఆశా కార్యకర్తలు గ్రామాలకు వెళ్లి రోగులను గుర్తిస్తారు. ప్రస్తుతం నవల్గా 21, యాలాల 32, ధారూర్‌ 22, దౌల్తాబాద్‌లో 51 మంది అశా కార్యకర్తలున్నారు. మానసిక రుగ్మతలున్న వారిని గుర్తించేందుకు కుటుంబ సభ్యులను 20 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నింటికీ అవును, కాదు అని సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నల్లో అధిక సంఖ్యలో ‘అవును’ అని వస్తే మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వెళ్లాలని సూచిస్తారు. అనంతరం వీరు వెళ్లారా? లేదా అని ఆరా తీస్తారు. ఒక వేళ వెళ్లకుంటే మరోసారి ఇంటికి వెళ్లి నచ్చచెబుతారు. ఆసుపత్రికి వెళ్లే విధంగా చూస్తారు.

పెరుగుతున్న రోగులు

జిల్లాలో మానసిక రుగ్మతలున్న రోగులు నానాటికి పెరుగుతున్నారు. వైద్యాధికారులు లెక్కల ప్రకారం సెప్టెంబర్‌ 17 నుంచి నవంబర్‌ 30 వరకు జిల్లాలో 960 మంది మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ఈ రోగులు కేవలం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనే ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తే వీరి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.

మత్తు పదార్థాలే కారణం

మానసికంగా బలహీన పడటానికి ప్రధానంగా మత్తు పదార్థాలు తీసుకోవడమే. జిల్లాలో ఎక్కువ మంది స్థాయిని మించి అల్కహాల్‌ తాగడం వల్ల మానసికంగా దెబ్బతింటున్నారు. గంజాయి, కోకైన్‌ వంటి మత్తు పదార్థాల వల్ల మానసిక స్థితిలో మార్పులు వస్తాయని, ఇలాంటి వారు ఆత్మహత్యలకు లేదా హింసాత్మక ఘటనలకు పాల్పడతారని వైద్యులు పేర్కొంటున్నారు.

మరిన్ని కేంద్రాల్లో పరీక్షలు

- డాక్టర్‌ దశరథ్‌, జిల్లా వైద్యాధికారి

జిల్లాలో మానసిక రుగ్మతలున్న వారిని పరీక్షించటానికి మరో 5 కేంద్రాలు మంజూరు చేశారు. మోమిన్‌పేట, సిద్దులూర్‌, పట్లూరు. కోట్‌పల్లి, చన్‌గోముల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు చేయనున్నారు. ఇక్కడ విధులు నిర్వహించే వైద్యులకు మూడు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. వీరి పరిధిలోని అశా కార్యకర్తలకు రోగుల గుర్తింపుపై శిక్షణ ఇవ్వనున్నారు.

చికిత్స అందిస్తున్నాం

- డా.రాధికారాణి, ఎన్‌సీడీ కార్యక్రమ అధికారిణి

మూడు నెలల్లో జిల్లాలోని నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 959 మంది రోగులను గుర్తించాం. వీరికి చికిత్స చేస్తున్నాం. అవసరమైన మందులు ఇచ్చి మానసిక స్థితి మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యోగా, ధ్యానం చేయాలని సూచిస్తున్నాం. దీంతో వారిలో క్రమంగా మార్పు వస్తోంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.