close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

గ్రామాల్లో దొంగల హల్‌చల్‌

మర్పల్లి మండలంలో వరుస చోరీలు

న్యూస్‌టుడే, మర్పల్లి

పట్లూర్‌లో లక్ష్మయ్య ఇంట్లో తెరిచి ఉన్న బీరువా

మర్పల్లి మండలంలోని పట్లూర్‌ గ్రామానికి చెందిన కోటపల్లి లక్ష్మయ్య ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. మంగళవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టారు. బీరువా తెరిచి రూ.12 వేలు, 12 తులాల వెండి దొంగిలించారు. అదే గ్రామంలో మొరంగపల్లి మాణెమ్మ హైదరాబాద్‌లోని కూతురు ఇంటికి వెళ్లింది. ఎవరూ లేనిది చూసి ఆ ఇంటి తాళం పగలగొట్టారు.

పట్లూర్‌ గ్రామంలో పది రోజుల క్రితం జీడిలగడ్డ ఫయాజ్‌కు చెందిన రూ.50 వేలు విలువ చేసే రెండు ఆవులు ఎత్తుకెళ్లారు. అదే కాలనీలో మహమ్మద్‌ అఖీల్‌కు చెందిన రెండు లారీల్లో నుంచి రూ.10 విలువైన రెండు బ్యాటరీలు మాయమయ్యాయి.

బూచన్‌పల్లి గ్రామంలో వెంకటేశం పొలంలో పశువుల పాక కోసం బిగించిన రేకులను రాత్రి సమయంలో దొంగిలించారు.

మొగిలిగుండ్లలో ఐదు రోజుల క్రితం మ్యాతరి లక్ష్మి ఇంటి తాళాలు విరగ్గొట్టి నగదు చోరీ చేశారు. కుటుంబసభ్యులంతా పొలంలో పత్తి తీసేందుకు వెళ్లగా మధ్యాహ్నం సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఇలా ఇటీవల కాలంలో గ్రామాల్లో వరుస చోరీలు జరుగుతుండటం ఆందోళన రేపుతోంది.

మర్పల్లి మండలంలో నెల రోజులుగా చోరీలు జరుగుతూనే ఉన్నాయి. వీటిలో చాలావరకు పెద్ద మొత్తంలో సొత్తు పోయినవి కాకపోవడంతో బాధితులు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం లేదు. కొందరు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు దొంగల ఆచూకీ కనిపెట్టలేదు. రాత్రుళ్లే కాకుండా పగటి పూటా దొంగతనాలు జరుగుతుండటం అందరినీ కలవరపెడుతోంది. మండల కేంద్రంలో ప్రతి వారం నిర్వహించే సంతలో తరచూ రూ.10 వేల నుంచి రూ.20 వేలు విలువైన చరవాణిలు పోతున్నాయి. బూచన్‌పల్లి, మర్పల్లి, దమస్తాపూర్‌, కోట్‌మర్పల్లి తదితర గ్రామాల బాధితులు ఈ జాబితాలో ఉన్నారు. చోరీలు జరుగుతున్న సంత ప్రాంతం పొలీసుస్టేషన్‌ పక్కనే ఉండటం విశేషం. పక్షం రోజుల వ్యవధిలో ఒక్క పట్లూర్‌లోనే ఆరు చోట్ల చోరీలు జరిగాయి.

నిఘా కరవు

గ్రామాల్లో నిఘా, పోలీసులు సంచారం తక్కువైందని స్థానికులు పేర్కొంటున్నారు. రోజూ ఏదోక సమయంలో గస్తీ తిరుగుతుంటే దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఇటీవల మద్యం దుకాణాలకు టెండర్లు ముగిసి కొత్తగా ఏర్పాటుచేయడంతో గ్రామాల్లో గొలుసు దుకాణాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. దొంగతనాలు పెరిగేందుకు మద్యం ఒక కారణమని గ్రామాలోని ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు.

గురించి చర్యలు తీసుకుంటాం

- సతీష్‌, ఎస్సై, మర్పల్లి

గ్రామాల్లో చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. అదే సమయంలో ప్రజలూ అప్రమత్తంగా ఉండాలి. ఇంటి యజమానులు ఇంట్లో నుంచి వెళ్లిన సమయంలో పక్కింటివారికి సమాచారం ఇవ్వాలి. లేకుంటే పోలీసులకు చెప్పాలి. ఊరెళ్లే సమయంలో నగదు, ఆభరణాలు ఇంట్లో ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నాం. గ్రామాల్లో అపరిచితులు సంచరిస్తే మాకు చెప్పాలి.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.