close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

చూసొద్దాం

జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన
విజయవంతంగా నిర్వహణకు విద్యాశాఖ సన్నాహాలు
ఈ నెల 8 నుంచి చొప్పదండిలో ప్రదర్శన
న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం

భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా బాలలు ఎదిగేందుకు తరగతి గదిలోని పాఠాలు... పరీక్షల్లో పొందే మార్కులే కాదు.. ఉపాధ్యాయుల బోధనతో ఒంటపట్టుకున్న విజ్ఞానం, శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తితో విద్యార్థులు రూపొందించే వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదపడుతాయి. గతం కంటే భిన్నంగా రెండేళ్లుగా జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు వివిధ రకాల ఆవిష్కరణలు, పలు ప్రయోగాలను చేయాలన్న స్పృహ పెరిగింది.. ఈ నేపథ్యంలో కొత్తగా పలు ప్రాజెక్టులను రూపొందించే వారిని ప్రోత్సహించేందుకు జిల్లా స్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా విద్యాశాఖ ఏర్పాటు చేస్తోంది. జవహర్‌లాల్‌ నెహ్రూ సైన్స్‌, గణిత, పర్యావరణ ఎగ్జిబిషన్‌ పేరుతో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు చొప్పదండిలోని జాన్సీ పాఠశాలలో దీన్ని నిర్వహిస్తున్నారు.

అన్ని పాఠశాలలు పాల్గొనేలా..
ఏటా జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన జరుగుతున్నా ఈ సారి అన్ని పాఠశాలలు పాల్గొనేలా జిల్లా విద్యాశాఖ దృష్టి సారించింది. రెండేళ్ల కాలంగా ప్రేరణ మనాక్‌, జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ ప్రదర్శనల్లో విద్యార్థులు పెద్దసంఖ్యలో నూతన ఆవిష్కరణలతో పాల్గొంటున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రదర్శనల్లోనూ జిల్లా విద్యార్థులు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జిల్లా స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌లోనూ ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ప్రాజెక్టులతో పాల్గొనేలా పాఠశాలలను జిల్లా విద్యాశాఖ సమాయత్తం చేసింది. ఈ విషయంపై ఎంఈవోలకు డీఈవో సూచనలు జారీ చేశారు. గతేడాది కరీంనగర్‌లో జరిగిన జిల్లా స్థాయి సైన్స్‌ ఎగ్జిబిషన్‌కు స్పందన బాగానే లభించింది.

ప్రదర్శనల్లో రెండు విభాగాలు
జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో రెండు విభాగాల్లో విద్యార్థులు ప్రాజెక్టులను ప్రదర్శించనున్నారు. జూనియర్‌ విభాగంలో 6, 7 తరగతుల విద్యార్థులు, సీనియర్‌ విభాగంలో 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొంటారు. ప్రతి పాఠశాల నుంచి జూనియర్‌ విభాగంలో ఆరు, సీనియర్‌ విభాగంలో 6 విద్యార్థులు పాల్గొనేందుకు అర్హులు. ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులతో పాటు విషయ నిపుణుడు ఒకరు పాల్గొంటారు.
* గతేడాది కరీంనగర్‌లో జరిగిన జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో మొత్తం 411 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. సీనియర్స్‌లో 226, జూనియర్స్‌లో 185 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఈ సారి సీనియర్స్‌తో పాటు జూనియర్స్‌లో మరిన్ని ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్టుల ప్రదర్శనలు రానున్నాయని అధికారులు భావిస్తున్నారు.

ముమ్మర ఏర్పాట్లు
జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన అట్టహాసంగా నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.. జిల్లా నలుమూలల నుంచి హాజరయ్యే ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, విషయ నిపుణులకు ఉచిత భోజన, వసతి, తాగునీటి సదుపాయాలను కల్పిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది.. జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు జిల్లా పాలనాధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఛైర్మన్‌గా, డీఈవో దుర్గాప్రసాద్‌ కన్వీనర్‌గా, కో-కన్వీనర్లుగా ఎంఈవో రాజస్వామి, జిల్లా సైన్స్‌ అధికారి ఎం.స్వదేశ్‌కుమార్‌ వ్యవహరిస్తారు. వీరితో పాటు 60 మంది ఉపాధ్యాయులతో ఆర్గనైజేషన్‌, ఫుడ్‌, కల్చరల్‌, క్రమశిక్షణ, ప్రెస్‌-పబ్లిసిటీ కమిటీలను ఏర్పాటు చేశారు. డీఈవో, కమిటీ సభ్యులు సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు.

అన్ని పాఠశాలలు పాల్గొనాలి: ఎన్‌.వి.దుర్గాప్రసాద్‌, డీఈవో కరీంనగర్‌
జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రాజెక్టుల ప్రదర్శనతో పాల్గొనాలి. ప్రధానంగా ప్రాథమికోన్నత పాఠశాలలు ఎక్కువ సంఖ్యలో హాజరవ్వాలి. విద్యార్థుల్లో సైన్స్‌, గణిత విజ్ఞానంపై ఆసక్తిని మరింత పెంచేందుకు ఇది దోహదపడనుంది. అన్ని పాఠశాలల విద్యార్థులను ప్రాజెక్టులను చూసేందుకు తీసుకురావాలి. జాన్సీ పాఠశాలలో ఈ నెల 8న ఉదయం ప్రాజెక్టుల ప్రదర్శించే విద్యార్థులు తమ పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, ఈ నెల 9న ఉదయం ప్రారంభ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్‌, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆహ్వానించాం.

ఉచిత బస్‌ సౌకర్యం: ఎం.స్వదేశ్‌కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి
చొప్పదండిలో జరిగే జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనే విద్యార్థులు, చూసేందుకు వచ్చే విద్యార్థులకు ఉచిత బస్‌ సౌకర్యం కల్పిస్తున్నాం. ప్రైవేటు పాఠశాలల సహకారంతో కరీంనగర్‌ నుంచి చొప్పదండి వరకు ఈ నెల 8, 9, 10వ తేదీల్లో బస్‌లను ఏర్పాటు చేస్తున్నాం. కరీంనగర్‌లోని జిల్లా సైన్స్‌ మ్యూజియం, జడ్పీ కార్యాలయం ముందు ఈ బస్సులను నిలుపుతున్నాం. బస్సులు విద్యార్థులను ఉచితంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లడంతో పాటు తిరిగి ఇక్కడికి తీసుకొస్తాయి.

ప్రదర్శించే అంశాలు
జిల్లా విద్యాశాఖ మూడు రోజుల పాటు నిర్వహించే జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనను పలు అంశాల ఆధారంగా నిర్వహిస్తున్నారు. ప్రధాన అంశంగా సుస్థిర అభివృద్ధికి శాస్త్ర సాంకేతికతను, ఉప అంశాలుగా సుస్థిర వ్యవసాయం, పరిసరాల పరిశుభ్రత-ఆరోగ్యం, వనరుల నిర్వహణ, భవిష్యత్తు రవాణా-సమాచార రంగం, పారిశ్రామికాభివృద్ధి, విద్యా విషయక ఆటలు-గణిత నమూనాలు, సైన్స్‌, గణితానికి సంబంధించిన నూతన ఆవిష్కరణల ప్రదర్శనలు ఉంటాయి. జిల్లా విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా మూలకాల ఆవర్తన పట్టికపై సైన్స్‌ సెమినార్‌, క్విజ్‌, చిత్రలేఖనం, పోస్టర్‌ ప్రదర్శనలుంటాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.