close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

మూర్ముర్‌లో క్లోరిన్‌ కలకలం

మిషన్‌ భగీరథ కేంద్రంలో గ్యాస్‌ లీకేజీ
ఏడుగురు కార్మికులకు తీవ్ర అస్వస్థత
వాయువును అరికట్టే యత్నంలో ఇద్దరు అధికారులకూ..

రామగుండం, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మూర్ముర్‌ వద్ద గురువారం మిషన్‌ భగీరథ శుద్ధి కేంద్రంలో క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లీకేజీని ఆరికట్టే ప్రయత్నంలో వాయువు పీల్చిన ఏడుగురు కార్మికులు, ఇద్దరు అధికారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని గోదావరిఖని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు.

పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలకు మిషన్‌ భగీరథ పథకం కింద తాగునీటిని అందించేందుకు మూర్ముర్‌ శివారులో శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడి క్లోరిన్‌ హౌస్‌లో దాదాపు 25 సిలిండర్లను ప్రత్యేక స్టాండులపై బిగించారు. దాదాపు 1600 కిలోల బరువుండే సిలిండరును ఆన్‌ చేసి నీటి సరఫరా పైప్‌లైన్‌లోకి క్లోరిన్‌ పంపిస్తారు. కాగా గురువారం ఉదయం 11 గంటలకు ఖాళీ అయిన సిలిండరు స్థానంలో నిండు సిలిండరును బిగించే పనులను ఆపరేటర్‌ బండారి వెంకటేశ్‌, హెల్పర్‌ అర్కల ఉదయ్‌ చేస్తున్నారు. నిల్వ సిలిండరును బిగించి, ఖాళీ సిలిండర్‌ను తొలగిస్తుండగా పట్టు తప్పి నిల్వ సిలిండరును తాకింది. దీంతో సరఫరా పైప్‌ మధ్యలో తెగి గ్యాస్‌ లీకయింది. వెంకటేశ్‌, ఉదయ్‌ దానిపై తడి గోనె సంచులను కప్పినా ఫలితం లేకపోయింది. అప్పటికే వారిద్దరూ క్లోరిన్‌ను పీల్చడంతో అస్వస్థతకు గురై బయటికి పరుగెత్తారు. సివిల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో పని చేస్తున్న పర్యవేక్షణాధికారి చంద్రశేఖర్‌, ఆపరేటర్లు బాదరవేని నవీన్‌, కీసరి రమేష్‌, జంపాల సాగర్‌, హెల్పర్లు పోతుగంటి నంబయ్య, పెసరి ప్రశాంత్‌ వచ్చి గ్యాస్‌ లీకేజీని ఆపేందుకు ప్రయత్నించారు. తెగిన పైపు ముక్క తొలగించి బోల్టు వాచర్‌ బిగించి లీకేజీని అరికట్టాలని చూశారు. మరోవైపు క్లోరిన్‌ అప్పటికే వేగంగా వ్యాపించడం మొదలైంది. నీటి శుద్ధి కేంద్రం సైట్‌ ఇన్‌ఛార్జి ప్రదీప్‌కుమార్‌ శ్రీవాస్తవ కూడా అక్కడికి చేరుకుని కార్మికులతో కలిసి లీకేజీని ఆరికట్టేందుకు ప్రయత్నించారు. ఏడుగురు కార్మికులతోపాటు ఇద్దరు అధికారులు క్లోరిన్‌ వాయువును పీల్చడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారు శ్వాస తీసుకోవడం కష్టంగా మారడంతో ఆటోల్లో గోదావరిఖనిలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

పరిసర గ్రామాల్లో ఆందోళన
అస్వస్థతకు గురైన తొమ్మిది మందికి ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. అందరికీ ప్రాణాపాయం తప్పింది. మధ్యాహ్నం ఒంటి గంటకు ఎన్టీపీసీ, గోదావరిఖని నుంచి అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అయితే గ్యాస్‌ వ్యాపించి ఉండటంతో సిబ్బంది క్లోరిన్‌హౌస్‌లోకి వెళ్లి లీకేజీని అరికట్టలేకపోయారు. చివరికి ఎన్టీపీసీ రెస్యూ టీం సభ్యులు వచ్చి లీకేజీని ఆపారు. సిలిండర్‌ వద్ద తెగిన పైపు ముక్కను తొలగించారు. బోల్టు వాచర్‌ బిగించి గ్యాస్‌ లీక్‌ కాకుండా చేశారు. గ్యాస్‌ లీకయిన సమయంలో గాలి దిశ పడమర వైపు ఉండటంతో వాయువు అటువైపే వ్యాపించింది. ఆ వైపున గ్రామాలు లేవు. కాగా క్లోరిన్‌ గ్యాస్‌ లీకేజీతో సమీప మూర్ముర్‌, ఎల్లంపల్లి, బ్రాహ్మణపల్లి గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయులు పాఠశాలలు మూసివేసి విద్యార్థులను ఇంటికి పంపించారు. చికిత్స పొందుతున్న వారిలో మూర్ముర్‌ సర్పంచి బాదరవేని స్వామి కుమారుడు నవీన్‌ ఉన్నాడు. ఉదయ్‌, రమేష్‌, సాగర్‌, నంబయ్య, ప్రశాంత్‌ మూర్ముర్‌ గ్రామస్థులు కాగా, చంద్రశేఖర్‌ది ఎల్లంపల్లి, వెంకటేష్‌ పొట్యాలకు చెందిన వారు. ఆస్పత్రిలో బాధితులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, భాజపా నాయకుడు కౌశిక హరి, అంతర్గాం మండలంలోని పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పరామర్శించారు. ఈ ఘటనపై అంతర్గాం పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, పని స్థలాల్లో ఉపయోగించడానికి తమకు రక్షణ పరికరాలు అందించాలని పలుమార్లు అధికారులను కోరినా పట్టించుకోలేదని కార్మికులు తెలిపారు. క్లోరిన్‌హౌస్‌లో ఎలాంటి రక్షణ పరికరాలు లేకుండానే పని చేస్తున్నామని పేర్కొన్నారు. కార్మికుల భద్రత విషయంలో అధికారుల నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.