close

సోమవారం, జనవరి 20, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

ఎర్రదొంగల కొత్తపంథా!

ఆగని అక్రమరవాణా

పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలు

 

ఎర్రచందనం అక్రమ రవాణా కొత్తపుంతలు తొక్కుతోంది. పోలీసులు, అటవీశాఖ అధికారుల నిఘా నుంచి తప్పించుకునేందుకు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు. నీళ్లు సరఫరా చేసే ట్యాంకర్‌లో తరలిస్తుండగా పోలీసులకు సమాచారం అందడంతో ట్యాంకర్‌లో దాచిన 92 ఎర్రచందనం దుంగలను సీతారామపురం పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఎవరికీ అనుమానం రాకుండా ఎర్రచందనం తరలించేందుకు స్మగ్లర్లు ఎత్తుగడ చూసి పోలీసులుసైతం విస్తుపోతున్నారు.

న్యూస్‌టుడే, సీతారామపురం: ఎర్రచందనం అక్రమరవాణాకు స్మగ్లర్లు తిగిరి బరితెగిస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించవచ్చునన్న అత్యాశతో చట్టాలు కఠినతరమని తెలిసినా... భయపడటంలేదు. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దుకావడంతో సీతారామపురం మండల అడవుల్లో ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డాగా మార్చుకుంటున్నారు. ఇటీవల దేవమ్మచెరువు అటవీప్రాంతంలో చెన్నై నుంచి స్మగ్లర్లు వచ్చారన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండోసారి గాలింపుచర్యలు నిర్వహించినపుడు 12 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో దేవమ్మచెరువు ప్రాంతంపై నిఘా ఎక్కువగా ఉండటంతో చింతోడు వైపు మళ్లారు. ఎవరికీ అనుమానం రాకుండా నీళ్లట్యాంకర్‌లో దాచిఉంచి తరలించేందుకు సిద్ధమైన సమయంలో పోలీసులు పట్టుకుని స్మగ్లర్ల ఆటకట్టించారు.

ట్యాంకర్‌లో మార్పులు : ట్యాంకర్‌లో ఎర్రచందనం దుంగలు తరలించేందుకు నిందితులు దానిని మార్పు చేశారు. ట్యాంకర్‌ వేగనిరోధకాల వద్ద ఎక్కిదిగినప్పుడు నీరు తొణికి బయటికి వచ్చేవిధంగా మార్పులు చేయించారు. ట్యాంకర్‌ ముందుభాగంలోని రేకును సగానికి కత్తరించి అక్కడినుంచి దుంగలను లోపలికి పెట్టి అనంతరం రేకును బోల్టులద్వారా బిగించారు. దానిపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అనిరాసి ఉంచారు. సాధారణంగా ఎవరైనా ట్యాంకర్‌ను చూసినట్లయితే నీటితో వెళుతుందనే విధంగా దానికి పనులు చేయించడం గమనార్హం. ఎర్రచందనం దుంగలను ట్యాంకర్‌ ద్వారా కనిగిరికి తరలించి అక్కడి నుంచి చెన్నైకి తీసుకెళ్లాలన్నది నిందితుల ప్లాన్‌గా పోలీసువిచారణలో తేలింది.

ముగ్గురు నిందితులకు రిమాండ్‌ : ఎర్రచందనం దుంగల అక్రమరవాణా ఘటనలో బుధవారం భీమిరెడ్డి ఓబుల్‌రెడ్డి, నల్లబోతుల పవన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకోగా, అదేరోజు రాత్రి బాలయ్యను అరెస్టు చేశామని ఎస్సై రవీంద్రనాయక్‌ తెలిపారు. ముగ్గురిని ఉదయగిరి మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా రిమాండ్‌ విధించడంతో ఆత్మకూరు సబ్‌జైలుకు తరలించినట్లు ఎస్సై చెప్పారు.


నిందితులు దుంగలను తరలించేందుకు వినియోగించిన ట్యాంకర్‌ను పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు

 

 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.