close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

తీరని ఇసుక కష్టాలు

మరిన్ని రీచ్‌ల అవసరం ●

దూరాభారంగా రవాణా

ఇసుక నిల్వ కేంద్రం

జిల్లాలో ఇసుక కొరత ఇంకా తీరలేదు. రీచ్‌లు గుర్తించి విక్రయాలు ప్రారంభించినా ప్రజలకు సరిపడా అందడం లేదు. దీంతో నిర్మాణాలు చేపట్టేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక నిల్వ కేంద్రాలు దూరంగా ఉండడంతో సామాన్యులకు రవాణా ఛార్జీలు భారంగా మారాయి. జిల్లాలోని పది నియోజకవర్గాలకు ఇసుక రీచ్‌లు కేటాయించారు. వీటికి సమీపంలో ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటుచేశారు. వీటి నుంచి తీసుకెళ్లడం నియోజకవర్గంలోని శివారు ప్రాంతాల వారికి భారంగా మారింది.

న్యూస్‌టుడే, పుల్లూరు (పెళ్లకూరు): జిల్లాల్లో 12 చోట్ల ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఆయా ప్రాంతాల్లో ఇసుకకు 10 టైర్లు, ట్రాక్లర్లకు నింపుకుని తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. దీనికి ముందుగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడ సమస్య ఉత్పన్నమవుతోంది. బుకింగ్‌ సమయంలో 12 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతి ఇచ్చినా క్షణాల్లో నిల్వలు అవుతున్నాయి. నెల్లూరు సమీపంలో పెన్నా రీచ్‌ దగ్గర, స్వర్ణముఖి నది ప్రాంతం వాకాడులో ఇవే పరిస్థితులున్నాయి. ఇసుక సామాన్యులకు అందుబాటులో వచ్చే ఏర్పాట్లు చేయాల్సి ఉందని పలువురు కోరుతున్నారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఆరు మండలాలకు కలిపి ఓ చోట మాత్రమే ఇసుక నిల్వ కేంద్రం ఏర్పాటుచేశారు. ఇది అటు తడ, ఇటు ఓజిలి మండలాలకు దూరంగా మారింది. నియోజకవర్గం మొత్తానికి పుల్లూరు దగ్గర స్వర్ణముఖి నది నుంచి ఇసుక తీసుకోవడానికి ఆనుమతి ఉంది. ఇక్కడ రోజుకి 205 మెట్రిక్‌ టన్నుల తీసుకోవచ్ఛు ఇది అందరికీ అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు నలిగిపోతున్నారు. నిల్వ కేంద్రం ప్రారంభం నుంచి జనరల్‌ కేటగిరీ వర్గాలకు ఇసుక దొరకడం లేదు. బల్క్‌ ఆర్డర్లకు ఎక్కువగా సరఫరా చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో అందుబాటు లేకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ● ఉచిత ఇసుక విధానంలో ట్రాక్టర్‌ ఇసుక రూ. వెయ్యి నుంచి రూ. 2 వేలకు దొరికేది. ప్రస్తుతం ఇసుక ట్రాక్టర్‌ రూ. 1,875లు. కానీ దీనికి రవాణా ఛార్జీలు అదనంగా కలుస్తున్నాయి. దీంతో గృహనిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారు. వీరికి ఏడాదికి 500 టన్నుల మేర బుక్‌ చేసుకునే అవకాశం ఉంది. బల్క్‌ ఆర్డర్లకు ఎంతైనా అనుమతి తీసుకునే అవకాశముంది. దీనికి ఆయా ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అనుమతి తప్పనిసరి చేశారు.

*సూళ్లూరుపేట నియోజకవర్గంలో పెళ్లకూరు మండలంలోని పుల్లూరు దగ్గర ఇసుక నిల్వ కేంద్రం ఏర్పాటుచేశారు. ఇది చిత్తూరు- నెల్లూరు సరిహద్దుల్లో ఉంది. సూళ్లూరుపేట, దొరవారిసత్రం, తడ మండలాల వాసులకు నిల్వ కేంద్రం చాలా దూరంగా ఉంటుంది. సూళ్లూరుపేట పట్టణానికి ఇసుక తీసుకెళ్లడానికి ఇక్కడ నుంచి దాదాపు 60 కి.మీ దూరం. కి.మీ రవాణా ఛార్జీలు ఓ టన్నుకి రూ. 4.90లుగా నిర్ణయించారు. అంటే ఓ ట్రాక్టర్‌లో సుమారు ఐదు టన్నుల ఇసుక పడుతోంది. ఇలా కి.మీ రూ. 24.50 చెల్లించాల్సి ఉంటుంది. అంటే 60 కి.మీ రూ. 1,470 చెల్లించాల్సి వస్తోంది. అదే విధంగా ఇసుక ఐదు టన్నులకు రూ. 375లు లెక్కన రూ. 1,875 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఓ ట్రాక్టర్‌ ఇసుక రూ. 3,345 చెల్లించాల్సి ఉంటుంది. అయినా దొరవారిసత్రం మండలానికి రూ. 5 వేలు ఇవ్వాల్సి వస్తోంది. ఇక సూళ్లూరుపేటకు అవసరమైతే ఆరు వేలకు పైమాటే. అదే విధంగా నాయుడుపేటకు అయితే రూ. 735లు రవాణాతో కలిపి రూ. 2,610లు అవుతోంది. అయినా ఇక్కడకి కనీసం రూ. 3500 చెల్లించాల్సి వస్తోంది. ఇలా రవాణా పెద్ద భారంగా మారుతోంది.

నిల్వ కేంద్రాలు పెంచితే..

నిల్వ కేంద్రాలు పెంచడం ద్వారా ఇసుక అందుబాటులోకి వచ్చే వీలుంది. మైనింగ్‌ శాఖ ఇటీవల సర్వే కూడా చేపట్టింది. ఎక్కడెక్కడ ఇసుక నిల్వలున్నాయో గుర్తించింది. ఇక అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఇలా అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు చేస్తే చాలా వరకు రవాణా భారం తగ్గుతోంది. దీంతో ధరలు అదుపులోకి వచ్చే వీలుంటుంది. ఇసుక అందుబాటులో ఉంటుంది. సామాన్యులకు ఇసుక లభిస్తోంది. నాయుడుపేట, తడ పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలకు ఎక్కువగా ఇక్కడ బుకింగ్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణ కేటగిరీలకు ఇంకా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.

 

 

 

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.