close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

వెబ్ ప్రత్యేకం

నత్తలా ఆర్థిక గణన

కుటుంబాల ఆర్థిక, సామాజిక స్థితిగతులు

పూర్తిస్థాయి వివరాలు సేకరించని వైనం

ఇంటింటికీ వెళ్లని ఎన్యూమరేటర్లు, సిబ్బంది

నెలాఖరుకు ముగియనున్న సర్వే ప్రక్రియ

 

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: జిల్లాలో కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఏమిటి? ఎంత మంది వ్యాపారాల ద్వారా ఆర్జిస్తున్నారు? సంఘటిత, అసంఘటిత రంగంలో ఉపాధి , ఆదాయం ఎంత? తదితర వివరాల సేకరణకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. 7వ ఆర్థిక గణన సర్వేను అక్టోబరు నుంచి జిల్లాలో ప్రారంభించారు. ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. సర్వే ఈ నెలాఖరుతో ముగియనుంది. అయినా పూర్తిస్థాయిలో సర్వే జరగడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించడంతోపాటు ఏర్పాటు చేసిన సిబ్బంది ‘గడప తొక్కని’ పరిస్థితి కనిపిస్తోంది.

*మొత్తం విస్తీర్ణం 13,076 స్వ్కేర్‌ కి.మీ

*మొత్తం రెవెన్యూ గ్రామాలు 1201

*హౌస్‌ హోల్డ్స్‌(2011 సెన్సస్‌ ప్రకారం) (లక్షల్లో) 7.78

*మొత్తం జనాభా (లక్షల్లో) 29.64

*పురుషులు (లక్షల్లో) 14.93

*స్త్రీలు (లక్షల్లో) 14.71

*0-6 ఏళ్ల వయసు గల వారు 3.04 (లక్షల్లో)

*అక్షరాస్యత శాతం  68.90

*అక్షరాస్యులు 18.32 (లక్షల్లో) జిల్లాలో మొత్తం వర్కర్లు: 13.15లక్షలు. వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు, ఇతర వర్కర్లు 10.76లక్షలు, రోడ్డుమార్జిన్‌ వర్కర్లు 2.38లక్షలు.

*వ్యాపారులు : 2.70లక్షలు (చిన్న, మధ్య, పెద్ద తరహా వ్యాపారులు, చిరు వ్యాపారులు) 

ఆర్థిక గణన అంటే..

ప్రధానంగా వివిధ రంగాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సంఘటిత రంగాల నుంచి వచ్చే ఆదాయానికి లెక్క ఉంటుంది. దీని ద్వారా గణాంకాలు సరిచేయడం సులభమే. కానీ అసంఘటిత రంగం నుంచి వచ్చే ఆదాయం లెక్కించడం కష్టం. ఉదాహరణకు పాల ద్వారా వస్తున్న ఆదాయం ఎంత అనేది లెక్క తేలదు. ప్రతి ఐదేళ్లకు ఒకసారి దేశ వ్యాప్తంగా ఆర్థిక గణాంకాల సర్వే చేస్తారు. దీని ద్వారా కుటుంబాలు, వారి సామాజిక ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 7వ ఆర్థిక గణన సర్వే జరుగుతోంది. ఆర్థిక గణాంకశాఖ, జాతీయ శాంపిల్‌ సర్వే, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ ఈ-గవర్నెన్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఈ జర్వే జరుగుతోంది. ఈసారి దీని ప్రత్యేకత ఏంటంటే మొబైల్‌ అప్లికేషన్‌లో జీపీఎస్‌ ద్వారా జియోటాగింగ్‌ చేయడం, టైం స్టాపింగ్‌, యాప్‌ లెవల్‌ డేటా ధ్రువీకరణ, వెబ్‌ అప్లికేషన్‌ ద్వారా సర్వే చేయడం.

సర్వే తీరు ఇలా

అన్ని మండలాలు, గ్రామాల్లోని ప్రతి ఇంటికీ ఎన్యూమరేటర్‌ వెళ్తారు. ఆ కుటుంబం వివరాలు సేకరిస్తారు. ఉద్యోగం, ఉపాధి, ఇతర ఆదాయ మార్గాలను నమోదు చేస్తారు. దీన్ని వర్గీకరణ చేస్తారు. 22 మార్గాల ఆదాయ వివరాలను నమోదు చేసుకుంటారు. ఇతరులను 23వ వర్గంగా పరిగణిస్తారు. అనంతరం నివేదికలు తయారు చేస్తారు. కంప్యూటర్‌లో ఉన్న ఫారాల్లో నమోదు చేస్తారు. అసంఘటిత రంగంలో హోల్‌సేల్‌, రిటైల్‌ వ్యాపారాలను కూడా నమోదు చేస్తారు. ఇదీ సంపూర్ణంగా సర్వే చేయాల్సిన తీరు. అయితే.. జిల్లాలో మాత్రం ఈ సర్వే బాధ్యతలు చూస్తున్న సంస్థ ఎన్యూమరేటర్లు, ఇతర ప్రైవేటు సిబ్బందిని ఏర్పాటు చేసి ఇంటింటి సర్వే చేయాలని గ్రామాలవారీగా జాబితాలను వారి చేతుల్లో పెట్టి లక్ష్యాలను నిర్థేశించారు. ఈ ప్రక్రియ ప్రారంభమై రెండు నెలలైంది. నేటికీ సగ భాగం కూడా సర్వే పూర్తికాలేదని ప్రణాళిక శాఖకు చెందిన ఓ ముఖ్య అధికారి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. సమయం మరో 25 రోజులు మాత్రమే ఉంది. ఈ సర్వే పురోగతిపై జిల్లా అధికారులు దృష్టిపెట్టకపోవడం చర్చనీయాంశమైంది. క్షేత్రస్థాయిలో ఈ గణనపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో ఉపాధ్యాయులు, ఇతరులతో ఈ సర్వే చేయించేవారు. అప్పట్లో సర్వే పక్కాగా జరిగేది. వాస్తవ వివరాలు ప్రభుత్వానికి చేరేవి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయ వనరులు, ఆయా ప్రభుత్వాలు జిల్లాలకు కేటాయించాల్సిన బడ్జెట్‌ తదితర అంశాలను పరిగణలోకి తీసుకునేవారు.

వేగవంతం చేసేలా చర్యలు

ఆర్థిక గణన సర్వేను ప్రభుత్వం సీఎస్‌సీ సంస్థలకు అప్పగించింది. వారే సిబ్బందిని ఏర్పాటుచేసుకొని సర్వే చేస్తున్నారు. ఈ సర్వే ఎలా జరుగుతుంది, ఇతర విషయాలపై త్వరలోనే సమావేశం ఏర్పాటుచేసి తగు ఆదేశాలు జారీ చేస్తాం. సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరించేందుకు ఆస్కారం ఉండకూడదు. పక్కాగా చేయాల్సిందే. గడువు ముగిసేందుకు సమయం తక్కువ ఉందికనుక వేగవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటాం. - ఎం.వి. శేషగిరిబాబు, జిల్లా కలెక్టర్‌

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.