close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

నిశీధి.. దిక్కేది?

శివారులో భయం.. భయం
వీధి దీపాల జాడేలేదు.
రాత్రి 10 దాటినా మద్యం దుకాణాలు బిజీ
ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌

రాష్ట్ర రాజధానిలో జరిగిన ‘దిశ’ ఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది.. శివారు ప్రాంతాల్లో భద్రత లేదన్న విషయం స్పష్టమవుతోంది. చిమ్మ చీకట్లు, మద్యం దుకాణాలు, పోకిరీల ఆగడాలు, వాహనాల రొదలు.. అసాంఘిక కార్యకలాపాలకు శివార్లు నెలవవుతున్నాయి. మరీ మన నగర పరిసరాలు ఎలా ఉన్నాయి..? శివారు ప్రాంతాల్లో ‘ఈనాడు- ఈటీవీ’  బుధవారం రాత్రి పరిశీలన చేపట్టింది. రాత్రి వేళ నుంచి అర్ధరాత్రి వరకు ఆయా ప్రాంతాల తీరుని గమనించగా చాలా చోట్ల పోలీసుల గస్తీ కానరాలేదు. జాతీయ రహదారితో పాటు పట్టణం చుట్టూ బాహ్యవలయదారినంతా చిమ్మచీకటే ఆవహించింది. ఆయా కాలనీలకు అనుబంధంగా ఉన్న మార్గాల్లో రాత్రి వేళ వెళ్లడమంటే సాహసం చేయాల్సిందే.. ఆకర్షణీయ నగరంలో ప్రగతి వెలుగులు విరజిమ్ముతుండగా, శివారులో మాత్రం చిమ్మచీకట్లు కమ్ముకుంటున్నాయి.

రాత్రి : 10.05
రాజీవ్‌ రహదారిపై కరీంనగర్‌ సమీపంలోని బొమ్మకల్‌ చౌరస్తా ఇది. కనీసం వీధిదీపాల వెలుతురూ లేదు. పట్టణానికి కూతవేటు దూరంలోని ఈ ప్రాంతంలో బస్సు, ఆటోలు దిగిన వారు ఊళ్లోకి వెళ్లాలంటే భయం భయంగా వెళ్లాల్సిందే..

10.20
కరీంనగర్‌-చొప్పదండి ప్రధాన రహదారిపై ఆదర్శనగర్‌లోని మద్యం దుకాణం తీరిది. నిర్ణీత సమయం దాటిన తర్వాతా యథేచ్ఛగా విక్రయాలను కొనసాగిస్తున్నారు. ‘ఈనాడు-ఈటీవీ’ ప్రతినిధులను చూడగానే హుటాహుటిన దుకాణాన్ని మూసివేశారు.

10.31
పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి నుంచి నాఖాచౌరస్తాకు వెళ్లే ప్రధాన రహదారిపైన మద్యం దుకాణాల దర్జా కనిపించింది. సమయపాలన తెలియదనేలా అమ్మకాల్ని బాహాటంగానే సాగిస్తున్నారు.

11.05
బొమ్మకల్‌ వంతెన నుంచి ఎన్టీఆర్‌ చౌరస్తా   వరకు రాజీవ్‌రహదారి పొడవునా అంధకారమే నెలకొంది. సుమారు 3.6కి.మీ   మేర వీధి దీపాలు లేవు..  లారీల నిలుపుదలతో ఇబ్బంది నెలకొంది.

11.25
ఇది మానేరు డ్యామ్‌ సమీపంలోని కట్టరాంపూర్‌ చౌరస్తా.. ఇక్కడా వెలుగుల జాడ కరవైంది.. ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి పద్మనగర్‌ చౌరస్తా వరకున్న సుమారు 3.4 కి.మీ మార్గమంతా భీతిగొలిపేలా చీకటినే అలుముకుంది.

రాత్రి : 11.45
ఇది పద్మానగర్‌ చౌరస్తా.. ఇక్కడ సెంట్రల్‌ లైటింగ్‌ వ్యవస్థ నిరుపయోగంగా ఉంది. ఇటీవల   ఏర్పాటు చేసినా ఇంకా వెలుగులకు నోచుకోకపోవడంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సుమారు 8 కాలనీల ప్రజలు అవస్థలు పడుతున్నారు.

రెండు బాహ్యవలయ రహదారులకు ఆనుకుని ఉన్న కరీంనగర్‌ నగరానికి భద్రత భయం పొంచి ఉంది. రాజీవ్‌ రహదారితో పాటు మానేరు జలాశయానికి ఆనుకుని ఉన్న బాహ్యవలయ రహదారుల్లో రాత్రి వేళ ప్రయాణం భయానకంగా మారింది. అసలే నిర్మానుష్య ప్రాంతాలతో ఉన్న ఆయా ప్రదేశాల్లో కనీసం వీధి దీపాలు లేకపోవడంతో పాటు పోలీసుల గస్తీ నామమాత్రంగా ఉండటంతో ఇబ్బంది నెలకొంది. పరిశీలన జరిపిన రెండు గంటల వ్యవధిలో కనసీం ఏ ఒక్క చోట కూడా పోలీసు పెట్రోలింగ్‌ వాహనాల జాడ కనిపించలేదు. ఆయా కాలనీల ప్రజలు ఎక్కువగా ఈ రెండు రహదారుల మీదుగానే ఇళ్లకు వెళ్తుంటారు. రాత్రి వేళల్లో మాత్రం మహిళలతో కలిసి వెళ్లడం నిజంగా సాహసమేనని చెప్పాలి. పైగా ఈ మార్గాల్లో కొన్ని చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినా కొన్ని చోట్ల వీటి సంఖ్య పెంచాల్సి ఉంది. పోలీసుల గస్తీ మరింతగా పెరిగితే భద్రతా పరంగా మార్పు కనిపించనుంది.

పట్టని నిబంధనలు..
మద్యం జోరుతో ముప్పు వాటిల్లుతుందని తెలిసినా పట్టణంలోని దుకాణాల విషయంలో పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టణం సహా శివారు ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లోని ఈ దుకాణాలను రాత్రి 10 గంటల తర్వాత కూడా నిరాటంకంగా తెరిచే ఉంచుతున్నారు. వీటి చెంతనే సిట్టింగ్‌లు ఉండటంతో ఆయా కాలనీలకు వెళ్లే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాత్రివేళ పక్కాగా నిబంధనలను పాటించకపోవడంతో కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. పట్టణంలోని జగిత్యాల రోడ్డుతోపాటు చొప్పదండి మార్గంలోని కొన్ని దుకాణాల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా మందు సీసా కావాలంటే ఇట్టే కొనుక్కోవచ్చనేలా పరిస్థితి ఉందని సమీపంలోని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో తగు చర్యలు చేపడితే ఆకతాయిలతోపాటు మందుబాబుల బెడద తగ్గే వీలుంటుంది.

అధికారులేమన్నారంటే..!
కరీంనగర్‌ పట్టణంతోపాటు శివారులోనూ గస్తీని పక్కాగా కొనసాగిస్తున్నామని కరీంనగర్‌ పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి తెలిపారు. మరీ ముఖ్యంగా రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ కొనసాగించడంతోపాటు ఆపత్కాలంలో ఎవరు డయల్‌ 100కు ఫోన్‌ చేసినా తక్షణమే స్పందిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాలపై తమ నిఘా ఉందని చెప్పారు. పట్టణంలోని మద్యం దుకాణాల సమయపాలనపైనా దృష్టి సారిస్తామన్నారు.
* కరీంనగర్‌ నగరపాలక సంస్థ కమిషనర్‌ వేణుగోపాల్‌రెడ్డి శివారు ప్రాంతాల్లో వీధి దీపాల విషయమై వివరణ ఇస్తూ బాహ్యవలయ రహదారిపై వీధి దీపాల ఏర్పాటు విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడుతామని అది జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ పరిధిలోకి వస్తే వారి దృష్టికి ఇబ్బందిని తీసుకెళ్తామన్నారు. మరోవైపు పట్టణంతోపాటు శివారు కాలనీల్లో ఎక్కడ వీధి దీపాల అవసరమున్నా తక్షణమే స్పందించి ఏర్పాటు చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.