close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

మేడారం

మార్పులు.. చేర్పులు

పునర్విభజన అభ్యంతరాలపై కసరత్తు
ఓటర్ల సంఖ్య సరిచేసేందుకు చర్యలు
న్యూస్‌టుడే, కార్పొరేషన్‌

డివిజన్ల పునర్విభజనలో మరోసారి మార్పులు, చేర్పులు చోటు చేసుకోనున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ మరోసారి చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆ దిశగా చర్యలు చేపట్టారు. డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలు స్వీకరిస్తుండటంతో భారీ సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఎన్నికలు ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. నగరంలోని 50 డివిజన్ల నుంచి 60 డివిజన్లకు పెంచడంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు సన్నద్ధమవుతున్నారు. తమకు అనుకూలంగా ఉన్న డివిజన్లపై గురిపెట్టిన వారంతా పునర్విభజనతో డివిజన్ల సంఖ్య, స్వరూపం, ఓటర్లు మారిపోవడంతో మాజీ పాలకవర్గ సభ్యులతో పాటు కొత్తగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపుతున్న వారు సైతం ఆసక్తిగా ఓటర్లు ఏ డివిజన్‌ అనుకూలంగా ఉన్నారనే విషయాన్ని పరిశీలిస్తున్నారు. ఏ డివిజన్‌లోకి ఏ ఓటర్లు వస్తారనే విషయాలపై ఇప్పటికీ స్పష్టత లేకపోగా, ప్రస్తుతమున్న డివిజన్‌లలో ఓటర్ల సంఖ్య మారనుందనే ప్రచారం జరుగుతుంది.

ఓటర్ల సంఖ్య సరి చేసేందుకు చర్యలు : ఓ వైపు డివిజన్ల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి అభ్యంతరాల స్వీకరణ చేస్తుండగా మరోవైపు డివిజన్ల వారీగా ఓటర్ల సంఖ్యను సరి చేసేందుకు రెవెన్యూ విభాగం సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ మేరకు 60 డివిజన్ల నుంచి ఓటర్ల జాబితాలు తీసుకొని ప్రస్తుతమున్న డివిజన్ల ఓటర్ల ఆధారంగా ఎక్కువ, తక్కువ ఏ మేర ఉందనే విషయాలను పరిశీలిస్తున్నారు. గతంలో కనిష్ఠం, గరిష్ఠం 10 శాతానికి మించకూడదని భావించగా, కోర్టు ఆదేశాల మేరకు దానిని 5 శాతం మించకూడదని పేర్కొనడంతో ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. దీంతో ఒక్కో డివిజన్‌లో సుమారు 200 మంది ఓటర్లు అటూఇటూ కానున్నట్లు తెలుస్తోంది.

పెరుగుతున్న అభ్యంతరాలు : డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాల సంఖ్య పెరుగుతున్నాయి. మొదటి రోజు 12 రాగా, రెండో రోజు 13 వచ్చాయి.. వీటిలో అధికంగా ఓటర్లు మారారని, ఒక డివిజన్‌ నుంచి మరో డివిజన్‌కు సంబంధం లేకుండా ఓటర్లను చేర్చారనే ఫిర్యాదులు వస్తున్నాయి. డివిజన్‌ స్వరూపాన్ని చూడకుండా పునర్విభజన చేయడంపైనే ఎక్కువ సంఖ్యలో అభ్యంతరాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఒక సామాజిక వర్గం ఓటర్లను, మరో సామాజిక వర్గం ఉన్న వైపు ఎలా కలుపుతారని ఆయా ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అభ్యంతరాలకు ఈ నెల 9 వరకు అవకాశం ఉండటంతో డివిజన్లు, ఓటర్లపై అభ్యంతరాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

ఆశావహుల్లో ఆందోళన : డివిజన్ల పునర్విభజన, ఓటర్ల సంఖ్య ఇప్పటికే మారిపోవడంతో ఆశావహుల్లో ఆందోళన నెలకొంటోంది. ఏ డివిజన్‌ ఏ వైపు ఉంటుందనే విషయం తెలుసుకోవడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరోవైపు పాత డివిజన్ల పరిధిలో ఇన్నాళ్లు పలు సామాజిక కార్యక్రమాలు చేయగా, ప్రస్తుతం ఆ డివిజన్ల స్వరూపం, ఓటర్లు పూర్తిగా మారిపోయాయి. కొత్తగా డివిజన్ల సంఖ్య రావడం, వందల సంఖ్యలో ఓటర్లు తారుమారు కావడంతో బేరీజు వేసుకోవడం సమస్యగా మారుతుందని అంటున్నారు. కొన్ని డివిజన్‌లలో డివిజన్‌ సంఖ్య మారగా ఓటర్లు పక్కాగా ఉన్నారని, ఆ ప్రాంతవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేవని అంటున్నారు. అయితే అభ్యంతరాలతో మరోసారి కొంతమేర సరిహద్దులు, ఓటర్లు మారే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి విలీన గ్రామాలు కలపడంతో డివిజన్ల పునర్విభజన జరిగి నగర స్వరూపం పూర్తిగా మారింది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.