close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

జలం... ఇక పుష్కలం!

కాళేశ్వరంతో తాగునీటికి పూర్తి భరోసా
పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

నగరంలో ఏ మూలకు నీళ్లు అవసరమైనా తీసుకునే విధంగా బాహ్య వలయ రహదారి (ఓఆర్‌ఆర్‌) చుట్టూ భారీ పైపులైన్‌ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే 43 కిలోమీటర్ల మేర కొంతవరకు ఏర్పాటుచేశాం. రెండోవిడత కింద మరికొంత భాగంలో రింగ్‌మెయిన్‌ నిర్మాణానికి రూ.280 కోట్లు కేటాయిస్తున్నాం.. అని మంత్రి తెలిపారు.

ఈనాడు, హైదరాబాద్‌

దేశంలో ఎక్కడా లేనివిధంగా నాణ్యమైన మంచినీటిని సరఫరా చేసి నగర ప్రజల దాహార్తిని తీర్చుతున్నట్లు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కొండపోచమ్మ, కేశవాపూర్‌ రిజర్వాయర్లు పూర్తి చేస్తే నగరంలో తాగునీటికి ఎలాంటి ఢోకా ఉండదన్నారు. గురువారం బుద్ధభవన్‌లో జలమండలి ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఆదాయం పెంపుతోపాటు లెక్కలోకి రాని నీళ్లు, సీవరేజ్‌ మాస్టర్‌ ప్లాన్‌, మంచినీటి సరఫరా.. ఇలా అన్నింటిపై చర్చించారు. సుదూరం నుంచి నీటిని తెచ్చి శుద్ధి చేసి ప్రజలకు అందిస్తున్నామని, వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఓఆర్‌ఆర్‌ను ఆనుకొని నిర్మించే పైపులైన్‌ వల్ల ఐటీ కారిడార్‌తోపాటు ఆయా ప్రాంతాలకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరుగుతుందన్నారు. బోర్డు ఆదాయం పెంచుకొని బలోపేతం కావడానికి నూతన సంస్కరణలు అవసరమన్నారు. జలమండలి చేపట్టిన వాణిజ్య కనెక్షన్ల గుర్తింపు, ఇంటింటా సర్వేల ద్వారా అక్రమ నల్లాల లెక్క వంటి చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అధికారులను అభినందించారు. అవసరమైతే మరిన్ని బృందాలను రంగంలోకి దించి అక్రమ కనెక్షన్లను ఏరివేయాలని సూచించారు. అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు మురుగు నీటి వ్యవస్థను జీహెచ్‌ఎంసీ నుంచి జలమండలికి అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. మార్చి నెల  తర్వాత సీవరేజ్‌ వ్యవస్థ నిర్వహణ మొత్తం జలమండలే చేపడుతుందని.. హోటళ్లు ఇతర వాణిజ్య సంస్థలు సిల్ట్‌ ఛాంబర్లు నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఛార్జీల నుంచి రూ.7 కోట్లపైగా ఆదాయం
అక్రమ నల్లా కనెక్షన్లను వీడీఎస్‌ పథకం ద్వారా క్రమబద్ధీకరించే అంశంపై ప్రజల్లో అవగాహన పెంచాలని జలమండలి ఎండీ దానకిషోర్‌ కోరారు. 2020 మార్చి చివరి నాటికి ఆదాయం పెంచుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  రానున్న రోజుల్లో అవుటర్‌ రింగ్‌ రోడ్డు వరకు నల్లా కనెక్షన్లతో సంబంధిత భవనం ఫొటో అనుసంధానం చేస్తామన్నారు. సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్లు ఎం.ఎల్లాస్వామి, డి.శ్రీధర్‌బాబు, ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ అజ్మీరా కృష్ణ, పి.రవి, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ వాసుదేవనాయుడు, టెక్నికల్‌ డైరెక్టర్‌ వి.ఎల్‌.ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.