close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

ఆర్టీసీలో కలవరం

సంతకాల ‘తీరు’తో ఉద్యోగుల గడబిడ
ఎవరికీ ఇబ్బంది ఉండదంటున్న అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: కుషాయిగూడ, రాణిగంజ్‌, న్యూస్‌టుడే: సమ్మె ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటతో ఆర్టీసీ ఉద్యోగులు తిరిగి విధుల్లోకి చేరారు. ‘మీ యోగక్షేమాలను నేను చూసుకుంటాను.మీరు ప్రగతి చక్రాన్ని పరుగులు పెట్టించండి’ అని ఆయన ఇచ్చిన పిలుపుతో ఉత్సాహంగా విధులు నిర్వహిస్తున్నవారిని.. డిపోల్లో పలు నోటీసులు, సంతకాల సేకరణలు కలవరపెడుతున్నాయి. ఉద్యోగులంతా వారికి కేటాయించిన విధులకు సమయపాలన పాటించి హాజరవ్వాలని, ఆలస్యం అయితే డ్యూటీ వేయబోమని, అనుమతి లేకుండా సెలవు పెడితే మరుసటి రోజు కూడా విధులు అప్పజెప్పం అనీ పలు నోటీసులు అతికించడంపై ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో ‘కార్మిక సంఘాల గుర్తింపు కోసం జరిగే ఎన్నికలు కనీసం రెండు సంవత్సరాలపాటు నిర్వహించవద్దని కోరుకుంటున్నాం. మా సమస్యల సామరస్య పరిష్కారం కోసం వెల్ఫేర్‌ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకుంటున్నాం. దీని ద్వారా మా సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని మాకు నమ్మకం ఉంది’ అంటూ కార్మిక శాఖ కమిషనర్‌కు రాసిన లేఖపై ఉద్యోగులు సంతకాలు పెట్టాలంటుండటం ఇప్పుడు ఆర్టీసీ డిపోల్లో చర్చనీయాంశంగా మారింది. సంతకాలు పెడితే పరిస్థితి ఏంటి, లేకుంటే ఎలా ఉంటుందనే సందేహంలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు.

మేలే అంటున్నా..
‘అనవసరంగా ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు. కార్మిక శాఖ కమిషనర్‌కు ఇచ్చిన లేఖలో ఉన్న అంశంపై ఆందోళన చెందాల్సిన పని లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయానా ఆర్టీసీని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే అనేక వరాలు ప్రకటించారు. అందులో ఉద్యోగుల సంక్షేమం కూడా ఉంది’ అంటూ డిపో మేనేజర్లు చెబుతున్నారు. క్రమశిక్షణతో ఉద్యోగం చేసుకునేవారికి ఇబ్బంది ఉండదంటున్నారు. కార్మిక సంఘాలకు ఎన్నికలు రెండేళ్లు వాయిదా వేస్తారు. డిపో స్థాయిలో ఉద్యోగుల సంక్షేమ కమిటీ ఉంటుంది. ఇందులో ఇద్దరు సభ్యులుంటారు. డిపోలో ఉన్న ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని విషయాలూ చూసుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళనా చెందాల్సిన పని లేదని అంటున్నారు. బలవంతం ఏమీ లేదని, వారి సమ్మతి మేరకు సంతకాలు చేయవచ్చునని చెబుతున్నారు. కార్మిక సంఘాల నేతలు లేనిపోని అపోహలు కల్పించి ఉద్యోగుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారంటున్నారు.

‘డీఎంలు ఒత్తిడి తెస్తున్నారు’
గురువారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన దరఖాస్తుల సంతకాల సేకరణపై ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం అందజేసిన దరఖాస్తుల్లో సంతకాలను చేయాలని డిపో అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు ఐకాస నేతలు ‘ఈనాడు’తో వాపోయారు. సంతకాలు చేయని పక్షంలో విధులకు అనుమతించబోమని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై డీఎంల వివరణ కోరగా- యాజమాన్యం ఆదేశాల ప్రకారమే దరఖాస్తులపై సంతకాలు చేయాలని సూచించినట్లు తెలిపారు. కార్మికులపై ఒత్తిడి చేయడం లేదంటున్నారు. సంతకాలు చేయటం, చేయకపోవటం వారి ఇష్టమంటున్నారు.

సంక్షేమ సంఘాలకు వ్యతిరేకంగా..: ఆర్టీసీ అధికారుల హెచ్చరికలు, సూచనలు ఒకలా ఉంటే.. కార్మిక సంఘాల నాయకులు డిపోల్లో సంక్షేమ సంఘాల ఏర్పాటును నిరసిస్తూ సంతకాల సేకరణను చేపడుతున్నారు. ఇలా సంతకాలు చేసిన లేఖలను కార్మికశాఖ కమిషనర్‌కు అందజేయడానికి సిద్ధమవుతున్నారు. కార్మికులపై ఒత్తిడి చేసి- గుర్తింపు సంఘం ఎన్నికల జోలికి వెళ్లం, డిపో స్థాయిలో వేసిన కమిటీలకు అనుకూలం అనే విధంగా లేఖలు రాయించి వాటిపై సంతకాలు తీసుకోవడానికి ఆర్టీసీ అధికారులు ఒత్తిడి చేస్తున్నారంటున్నారు. అదే కార్మిక శాఖ కమిషనర్‌కు ఫిర్యాదులు చేస్తున్నారు. సంక్షేమ సంఘం (వెల్ఫేర్‌ కౌన్సిల్‌) మాకు వద్దు, మేమంతా కార్మిక సంఘాలతోనే ఉంటాం అంటూ గుర్తింపు సంఘానికి ఎన్నికలు వెంటనే జరిపించాలని కోరుతూ రూపొందించిన లేఖను అందజేయడానికి సిద్ధమవుతున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.