close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

ఆటోనగర్‌ గడ్డ ‘దిశ’ ఘటనలకు అడ్డా

కరవైన పోలీసుల నిఘా
రెచ్చిపోతున్న ట్రక్కు డ్రైవర్లు
మహిళలపై దారుణాలకు పాల్పడుతున్న వైనం

శంషాబాద్‌ గ్రామీణ, న్యూస్‌టుడే: నగరంలోని ఘాన్సిమియాగూడ రెవెన్యూ పరిధిలో ఉన్న ఆటోనగర్‌ అక్రమాలకు అడ్డాగా మారింది. దేశం నలుమూలల నుంచి లోడుతో వచ్చిన లారీ డ్రైవర్లు ఇక్కడే రోజుల తరబడి బస చేస్తుంటారు. ఈ క్రమంలో ట్రక్కుల్లో ఉన్న సరకును తస్కరించి కల్తీ చేయడం వంటి మోసాలకు పాల్పడుతుంటారు. ఏం చక్కా మద్యం సేవించడం.. జూదాలాడటం.. చోరీల బాట పట్టడం ఇదే ఇక్కడ అడుగుపెట్టిన వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు చేసే పని. ఇక్కడ ఇన్ని అక్రమాలు జరుగుతున్నా పోలీసులు, సంబంధిత అధికారులు పట్టించుకోరన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వెలుగులోకి రాని దిశలెందరో..
గత మార్చి 19న గుర్తు తెలియని ఓ మహిళ(25)పై ఇదే ప్రాంతంలో కిరాతకులు సామూహిక అత్యాచారం చేసి పెట్రోల్‌ పోసి సజీవ దహనం చేశారు. తొమ్మిది నెలలు గడుస్తున్నా ఈ ‘దిశ’ ఎవరో పోలీసులు నేటికి తేల్చలేక పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అప్పటికే మృతదేహం అస్థిపంజరంలా మారింది. దీంతో వైద్యులు అక్కడే పోస్టుమార్టం చేసి పూడ్చిపెట్టారు. ఇలాంటి ఘటనలు ఇక్కడ వరుసగా చోటు చేసుకుంటున్నా సరే వెలుగులోకి రానివి చాలానే ఉన్నాయని అనడానికి ఈ ఘటనే నిదర్శనం. ఈ క్రమంలో యువ వైద్యురాలిపై రద్దీ ఉన్న తొండుపల్లి ప్లాజా వద్దే రాత్రి 9.30గంటలకు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారడంతో పోలీసులు సవాలుగా తీసుకుని కిరాతకులను కోర్టుకు అప్పజెప్పారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ట్రక్కు పార్కింగ్‌ అడ్డాలను తొలగించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

దర్జాగా గంజాయి, గుట్కా దందా
ఆటోనగర్‌లో ట్రక్కు పార్కింగ్‌ మాటున గంజాయి, గుట్కా సరఫరా అక్రమ దందా యథేచ్ఛగా సాగుతోంది. స్థానిక పోలీసులు మిన్నకుండి ఉండటంతో స్పెషల్‌ ఆపరేషన్‌ టీం పోలీసులు అడపాదడపా చేస్తున్న ఆకస్మిక తనిఖీల్లో గంజాయి, గుట్కా అక్రమ దందాతో పాటు పేకాట స్థావరాల గుట్టు రట్టవుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన వందల మంది చోదకులు రోజుల తరబడి ఆటోనగర్‌లో తిష్ట వేస్తున్నారు. ఈ క్రమంలో జూదం ఆడుతూ నష్టం పోయిన కొంత మంది చోదకులు దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇటీవలే తొండుపల్లి అమ్మవారి ఆలయంలో పూజల కోసం వస్తున్న ఇద్దరు మహిళలను ఓ చోదకుడు బెదిరించి బంగారు గొలుసు(పుస్తెల తాడు)ను లాక్కెళ్లాడు. వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పటికీ పోలీసులు నిందితుడిని పట్టుకోలేక పోయారు.

కానరాని సీసీ కెమెరాలు
గండిగూడ ఆటోనగర్‌లో తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ, బిహార్‌, రాజస్థాన్‌, హర్యానాతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ట్రక్కులు వారం రోజుల పాటు సరుకు లోడింగ్‌, అన్‌లోడింగ్‌ కోసం ఇక్కడ నిలుపుతున్నారు. అయితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన ఆటోనగర్‌లో సీసీ కెమెరాలు లేనేలేవు. బిగించేలా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మరో దిశ ఘటన చోసుకోక ముందే ఆటోనగర్‌లో అడుగడుగునా సీసీ కెమెరాలు బిగించి నిఘా నీడలోకి తేవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.

30 ఎకరాలకు విస్తరించిన ఆటోనగర్‌
హైదరాబాద్‌-బెంగళూర్‌ జాతీయ రహదారికి ఆనుకుని తొండుపల్లి- ఘాన్సిమియాగూడ రెవెన్యూ పరిధిలో జీఓ 111  నిబంధనలకు విరుద్ధంగా 13 ఎకరాల్లో రియల్‌ వ్యాపారులు అక్రమంగా లేఅవుట్లు నిర్మించారు. బెంగళూర్‌ జాతీయ రహదారికి ఆనుకుని ఉండటం, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు అతి దగ్గర ఉండటంతో కొంత మంది ట్రక్కు రవాణా సంస్థల యజమానులు కలిసి ఈ లేఅవుట్‌లో స్థలాలు ఖరీదు చేసి శంషాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు గండిగూడ ఆటోనగర్‌లో ట్రక్కు పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ దందా లాభాసాటిగా ఉండటంతో నేడు 30ఎకరాల విస్తీర్ణంలో ఆటోనగర్‌ విస్తరించింది. తాజాగా ఆటోనగర్‌కు ఆనుకుని ఇష్టారాజ్యంగా అక్రమ లేఅవుట్లు వెలుస్తూనే ఉన్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు అమ్యమ్యాలకు అలవాటు అటు వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. నిర్మాణాలు పూర్తికాగానే పంచాయతీ అధికారులు ఇంటి సంఖ్యలను కేటాయిస్తుండడంతో తాజాగా ఆటోనగర్‌లో వాణిజ్య సముదాయాల భారీ నిర్మాణాలు పట్టుగొడుగుల్లా వెలుస్తున్నాయి.

లేఅవుట్లు, నిర్మాణాలకు అనుమతులు లేవు
ఆటోనగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు, భారీ నిర్మాణాలు వెలుస్తున్న మాట వాస్తవమే. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్న యజమానులకు గతంలో నోటీసులు జారీ చేస్తున్నాం. ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. ఆటోనగర్‌ అక్రమాలపై మరోసారి కొరడా ఝళిపిస్తామని హెచ్చరించారు

- శ్రీకాంత్‌గౌడ్‌, ఘాన్సిమియాగూడ గ్రామ పంచాయతీ కార్యదర్శి

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.