close

శనివారం, జనవరి 18, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

వైరల్‌ వ్యాధులు.. ఆయుర్వేద చిట్కాలు!

వేధిస్తున్న జలుబు, దగ్గు, జ్వరం తదితర సమస్యలు
యాంటీబయోటిక్స్‌ వాడకంతో ఇతర అనారోగ్యాల ముప్పు
వంటింటి దినుసులతోనే ఉపశమనం పొందండిలా..
ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, వెంగళ్‌రావునగర్‌


రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నగరంలో రెండు రోజులుగా వాతావరణం మబ్బు పట్టి ఉంటోంది. వైరల్‌ సమస్యలు విజృంభిస్తున్నాయి. జలుబు, గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, తలనొప్పి లాంటి సమస్యలు అందరినీ బాధిస్తున్నాయి. చాలా మంది మందుల దుకాణాల్లో యాంటిబయోటిక్స్‌ మాత్రలు తెచ్చుకొని వేసుకుంటున్నారు. అయినా కొన్ని సమస్యలు తగ్గడంలేదు. యాంటీబయోటిక్స్‌ విచ్చలవిడి వాడకం వ్యాధి నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని, మొండి వ్యాధులను ఆహ్వానించినట్లవుతుందని, వైద్యుల సూచనలతోనే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ కాలంలో వచ్చే వైరల్‌ సమస్యలకు ఆయుర్వేదంలో మంచి చిట్కాలున్నాయని ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉమాశ్రీనివాస్‌ తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో, ఇంట్లోని వస్తువులతోనే తయారు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే తప్పకుండా ఉపశమనం లభిస్తుందన్నారు. అప్పటికీ తగ్గకపోతే వైద్యులను సంప్రదించాలంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణుల విషయంలో అజాగ్రత్తగా ఉండవద్దని హెచ్చరిస్తున్నారు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.



గొంతు జీరపోవడం..

చలి కాలంలో గొంతు జీర పోవడం సర్వసాధారణం. కప్పు నీళ్లలో కొంచెం పసుపు, ఉప్పు, తులసి ఆకులు అయిదు వేసి వేడి చేయాలి. గోరు వెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని వడగట్టి పుక్కిలించాలి. ఉదయం, సాయంత్రం మూడు రోజులపాటు ఇలా చేస్తే గొంతులో నొప్పి, జీర దూరమవుతాయి.


చర్మం పగుళ్లు..

చలి వాతావరణంలో చర్మ సౌందర్యం కాపాడుకోవడం పెద్ద సవాలే. గాల్లో తేమ తగ్గడంతో చర్మం పొడిబారుతుంది. దురద పుడుతుంది. భరించలేక గోకుతుంటారు. చర్మంపై పుండ్లు పడతాయి. మధుమేహ రోగుల్లో ఇవి తగ్గవు. రోజు ఆవ నూనెతో శరీరానికి మర్దన చేసుకోవాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉంటుంది.


వాంతులు...

కొందరికి అజీర్తితో వాంతులు అవుతుంటాయి. ఐదారు యాలకులు, దాల్చిన చెక్క, నాగ కేశరాలు, నల్ల జీలకర్ర కలిపి చూర్ణం చేసుకొని చెంచా వంతున తేనెతో కలిపి రెండు పూటలా తీసుకుంటే వాంతులు తగ్గిపోతాయి. విరేచనాలతో కూడిన వాంతులు ఎక్కువ సార్లయితే మాత్రం వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించాలి.


జలుబుతో కూడిన దగ్గు..

అయిదు తులసి ఆకులు, రెండు లవంగాలు కలిపి చిన్న ముద్దగా చేసి మింగాలి. ఇలా 3-4 రోజులు చేస్తే దగ్గు తగ్గి ఉపశమనం లభిస్తుంది. అడ్డసరం ఆకుల రసంలో చిటికెడు పసుపు కలిపి ఉదయం, సాయంత్రం తీసుకున్నా జలుబు, దగ్గు తగ్గుతాయి. తులసి ఆకుల రసం, మిరియాల పొడి, చిటికెడు పసుపు చూర్ణాలను వేడి పాలలో వేసి ఉదయం, సాయంత్రం తీసుకుంటే ఉపశమనం పొందొచ్చు.


దంత, చిగుళ్ల సమస్యలు

చలి వాతావరణంలో చిగుళ్లు, దంత ఇబ్బందులు సరేసరి. చిగుళ్ల నుంచి తరచూ రక్తం కారుతుంటుంది. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ(త్రిఫల) చూర్ణం చేయాలి. వేడి నీటితో కలిపి కషాయం చేసుకోవాలి. ఉదయం, సాయంత్రం నోట్లో వేసి 5 నిమిషాల పాటు పట్టి ఉంచాలి. ఇలా 3-4 రోజులు చేయడంతో దంత, చిగురు సమస్యల నుంచి బయట పడవచ్చు.


కళ్లెతో కూడిన దగ్గు

చాలామంది నిత్యం కళ్లెతో కూడిన దగ్గుతో బాధపడుతుంటారు. అయిదు అడ్డసరం ఆకులు, అయిదు తులసి ఆకులు, 5 మిరియాలు ముద్దగా నూరి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా అయిదు రోజులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


గొంతునొప్పి, గరగర

వాము చూర్ణం, అల్లం రసం, అయిదు తులసి ఆకులు కలిపి మరిగించాలి. ఆ కషాయాన్ని రెండు పూటలా 2-3 రోజులపాటు తీసుకోవాలి. గొంతులో నొప్పి, గరగర తగ్గుముఖం పడతాయి.


మలబద్ధకం..

శీతాకాలంలో చాలా మందిలో మలబద్ధక సమస్య కన్పిస్తుంది. పీచు లేని ఆహారం తీసుకోవడం, మసాలాల ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ ఇబ్బంది తలెత్తుతుంటుంది. శొంఠి, సోంపు, సోనాముఖి, కరక్కాయ, సైంధవ లవణం సమపాళ్లలో తీసుకొని చూర్ణం చేయాలి. రాత్రి పడుకునే ముందు కప్పుడు గోరువెచ్చని నీటిలో చెంచాడు కలుపుకొని తీసుకుంటే మలబద్ధకం సమస్యను నివారించవచ్చు.


జలుబు, జ్వరం, తలనొప్పి..

చలి వాతావరణం పడక చాలా మంది జలుబు, జ్వరం, తలనొప్పిలతో బాధపడుతుంటారు. గ్లాసుడు పాలలో చెంచాడు మిరియాల పొడి, శొంఠి చూర్ణం కలిపి రెండు పూటలా 2-3 మూడు రోజులు తీసుకోవాలి. క్రమేపీ జ్వరం, జలుబు తగ్గుముఖం పడతాయి. ఇక తలనొప్పి నివారణకు శొంఠిని గంధంలా అరగదీసి నుదురుకు ఇరువైపులా కణతల వద్ద రాయాలి. ఉపశమనం లభిస్తుంది.


శరీర ఉష్ణోగ్రత పెంచడానికి..

ఉదయం, సాయంత్రం వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల శరీర ఉష్ణోగ్రతల్లోనూ తేడా వస్తుంది. వెచ్చటి దుస్తులు కప్పుకొంటారు. చిటికెడు పిప్పళ్ల చూర్ణం కప్పు వేడి నీళ్లలో వేసి టీ మాదిరిగా ఉదయం, సాయంత్రం తీసుకుంటే చలి వాతావరణం నుంచి ఊరట లభిస్తుంది. ముఖ్యంగా వృద్ధులకు ఎంతో మేలు చేస్తుంది.


ముక్కు దిబ్బడ, శ్వాసకు ఇబ్బంది

ఈ కాలంలో చాలామంది ముక్కు దిబ్బడ సమస్యతో బాధపడుతుంటారు. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది. నిద్ర రాదు. గురక సమస్య ఉత్పన్నమవుతుంది. ఒక చిన్న కప్పు వామును వేయించుకోవాలి. పరిశుభ్రమైన గుడ్డలో దాన్ని కట్టి వాసన పీలుస్తుంటే ఈ సమస్య తగ్గుతుంది. శ్వాసనాళాల్లో ఇబ్బందులు తొలగిపోతాయి. 2-3 రోజులు ఇలా చేయాలి.


నీళ్ల విరేచనాలు

అజీర్తి కారణంగా తరచూ పిల్లలు, పెద్దల్లో నీళ్ల విరేచనాలు అవుతుంటాయి. నీరసపడి పోతుంటారు. ఇందుకు భీమసేని కర్పూరం, శొంఠి, అయిదు యాలకులు, జాజికాయ, నల్ల జీలకర్ర కొంత తీసుకొని చూర్ణం చేయాలి. చెంచా చొప్పున తేనెతో రెండు పూటలా తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి.


చుండ్రు..

ఈ వాతావరణంలో కాలంలో చాలా మందిని తలలో చుండ్రు వేధిస్తుంటుంది. కప్పుడు గసగసాలను చూర్ణం చేయాలి. పెరుగుతో కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కుంకుడుకాయ రసం, గోరువెచ్చని నీటితో తలంటుకోవాలి. చుండ్రు పోవడంతో పాటు జుత్తు ఒత్తుగా తయారై నిగనిగలాడుతుంది.


అజీర్తి

చలికాలంలో చాలా మందిని అజీర్తి సమస్య వేధిస్తుంది. మసాలా, నూనెలతో కూడిన ఆహారం తినడంతో ఈ సమస్య ఏర్పడుతుంది. జీలకర్ర, సోంపు, వాము సమ భాగాలుగా తీసుకొని పొడి చేసి వేడి నీళ్లలో కలిపి కషాయం తయారుచేసుకోవాలి. అరకప్పు చొప్పున ఉదయం, సాయంత్రం తాగితే అజీర్తి, గ్యాస్‌ సమస్యలు లాంటివి పోతాయి.


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.