close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

‘ఉల్లి’క్కిపాటు

హోల్‌సేల్‌ మార్కెట్లో క్వింటా ధర రూ.15వేలు
ఈజిప్టు నుంచి ఉల్లి రాక కోసం ఎదురుచూపులు
ఈనాడు - హైదరాబాద్‌, అక్బర్‌బాగ్‌ - న్యూస్‌టుడే:

చలికాలం వినియోగదారులకు ‘ఉల్లి’పోటు తగులుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ ఉల్లి మంటపెడుతోంది. కేజీ ఉల్లి ధర రూ. 40 దగ్గర అందర్నీ కలవరపెట్టి.. ఇప్పుడు ఏకంగా కన్నీరు పెట్టిస్తోంది. రోజుకో రూ. 10 చొప్పున పెరిగి.. చివరి రోజు ఏకంగా రూ. 50కి పెరిగి కిలో ఉల్లి హోల్‌సేల్‌ మార్కెట్‌లోనే రూ. 150కి చేరువైంది. అయితే ఇది నంబర్‌వన్‌ రకం ఉల్లి.. కేవలం 50 నుంచి 100 కేజీల వరకూ వచ్చిన పాత ఉల్లిధర అని మార్కెటింగ్‌ శాఖ అదనపు సంచాలకులు రవికుమార్‌ తెలిపారు. రెండో రకం ఉల్లి రూ. 40 నుంచి 80 వరకూ హోల్‌సేల్‌ మార్కెట్లో గురువారం అమ్మకాలు జరిగాయని చెప్పారు.

నిన్న మొన్నటి వరకు ఉల్లి కిలో రూ.100 అంటేనే వినియోగదారులు హడలెత్తిపోయారు. గురువారం మలక్‌పేట మార్కెట్‌లో ఉల్లిధరలు సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. మహారాష్ట్ర నుంచి దిగుమతి అయిన మేలురకం ఉల్లి ధర ఏకంగా రూ.150 పలికింది. నిత్యం 100కు పైగా లారీల్లో భారీగా దిగుమతి అయ్యే ఉల్లి ఇటీవల దిగుమతి క్రమంగా క్షీణిస్తూవచ్చింది. గురువారం మార్కెట్‌కు కేవల 30 లారీలలో 6,302 బస్తాలలో 3,150 క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వచ్చాయి. మహారాష్ట్ర నుంచి 20 లారీలు, కర్ణాటక నుంచి 4, మహబూబ్‌నగర్‌ నుంచి 2, మెదక్‌ నుంచి 1, కర్నూలు నుంచి 3 లారీలు మాత్రమే మార్కెట్‌కు వచ్చాయి. ఇంత తక్కువ స్థాయిలో దిగుమతి కావడంతో ధర అమాంతంగా పెరిగిపోయింది. నాలుగు రోజుల నుంచి దిగుమతి గరిష్ఠంగా పడిపోవడంతో ఉల్లి ధరకు రెక్కలు వచ్చాయని మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. దీంతో మేలిరకం ఉల్లి ధర గురువారం ఏకంగా క్వింటాకు రూ.15 వేలు పలికింది.

నెలరోజుల వ్యవధిలో..
గత ఏడాది డిసెంబర్‌లో ఉల్లి ధర రూ.30గా ఉంది. ఈ ఏడాది నవంబరులో మలక్‌పేట హోల్‌సేల్‌ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.50 ఉండగా.. ఈ ఏడాది డిసెంబరు 5వ తేదీన మేలురకం ఉల్లి కిలో రూ.150 పలికింది. దీంతో వినియోగదారులు ‘ఉల్లి’క్కి పడ్డారు.నగరంలోని ఆనియన్‌ ట్రేడర్స్‌ నుంచి కొనుగోలు చేసి ఈ ఉల్లినే కిలో రూ. 40 చొప్పున రైతు బజార్లలో ఒక్కరికి ఒక కిలో చొప్పున అమ్ముతున్నామని రవికుమార్‌ చెప్పారు. మార్కెట్‌కు వచ్చే ఉల్లిని మూడు రకాలుగా వర్గీకరిస్తారు. అందులో మొదటి రకం క్వింటాల్‌ ఉల్లి ధర రూ.11,000 వేల నుంచి రూ.15,000 వేల వరకు, మధ్య రకం ఉల్లిధర రూ.8000 నుంచి రూ.10,000 వరకు, తర్వాతి రకం రూ.3000 నుంచి రూ.7,000ల వరకు పలుకుతున్నాయి.

భారీగా తగ్గిన ఉల్లి రాక..
మలక్‌పేట మహబూబ్‌మాన్షన్‌ మార్కెట్‌కు గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఉల్లి దిగుబడి గణనీయంగా తగ్గింది. హైదరాబాద్‌ నగరానికి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి దిగుమతి అవుతుంది. గత సంవత్సరం ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య కాలంలో మలక్‌పేట మార్కెట్‌కు సుమారు 18 లక్షల క్వింటాళ్లు దిగుమతి కాగా, అదే కాలానికి ఈ సంవత్సరంలో వచ్చింది సుమారు 16.50 లక్షల క్వింటాళ్లు. లక్షన్నర క్వింటాళ్ల దిగుమతి తగ్గటంతో దాని ప్రభావంతో ధరలు పెరిగాయంటున్నారు.

ఈజిప్టు నుంచి ఉల్లిని తెప్పిస్తున్నాం:
లక్ష్మీబాయి, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ సంచాలకులు
ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో ధరలను నియంత్రించడానికి ఇప్పటికే ఉల్లి హోల్‌సేల్‌ ట్రేడర్స్‌ నుంచి నేరుగా మార్కెటింగ్‌ శాఖ కొని.. వాటిని రైతు బజార్లలో కిలో రూ.40 చొప్పున అమ్ముతున్నాం. ఆధార్‌ కార్డు నంబరును రాసుకుని ఒక్కొక్కరికీ కిలో చొప్పున ఇస్తున్నాం. ప్రస్తుతానికి నగరంలోని రైతు బజార్లలోనే అమ్ముతున్నాం. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లకు విస్తరిస్తాం. అలాగే ఈజిప్టు నుంచి 500ల మెట్రిక్‌ టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. ఈ సరకు డిసెంబరు 10లోపు నగరానికి వంద మెట్రిక్‌ టన్నులు చేరుకుంటుంది. తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు పంపిస్తాం. రైతుబజార్లతో పాటు.. వివిధ మార్కెట్లలో వీటిని వినియోగదారులకు అందేలా అమ్మకాలు చేపడతాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.