close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

పోలీసులకు.. దిశా నిర్దేశం

 పటిష్ఠ చర్యలు చేపడతాం
మహిళలు సురక్షితంగా గమ్యస్థానాలు చేరేలా చర్యలు
‘ఈనాడు’తో హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌
ఈనాడు, హైదరాబాద్‌

 రాజధాని నగరంలో జరిగిన ‘దిశ’ హత్యోదంతం అందరినీ కలచివేసింది.  వేల మంది పోలీసులు.. వందలమంది గస్తీ సిబ్బంది.. సమాచార సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా గుర్తించలేకపోయాం. ఈ సంఘటన ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. ఆమెను తలచుకొని ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్న మమ్మల్ని నిందితులు దెబ్బతీసినా మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఈ దారుణం తర్వాత మమ్మల్ని మేం పరీక్షించుకున్నాం.. లోపాలను సవరించేందుకు, అంతర్గత వనరులను పెంపొందించుకునేందుకు ఏం చేయాలనేది నిర్ణయం తీసుకున్నాం. అని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.అంజనీకుమార్‌ ‘ఈనాడు’తో పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించామని సీపీ అన్నారు. బల్దియా, విద్యుత్తు, ఇతర శాఖల సమన్వయంతో కొన్ని పనులు చేపట్టనున్నామని.. మహిళలు, యువతులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేలా చర్యలు ఉంటాయని తెలిపారు.

3వేల ప్రాంతాల్లో చీకట్లు
హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో రాత్రివేళ నేరాలు జరిగేందుకు ప్రధాన కారణం ప్రజలు, పోలీసుల దృష్టి కొన్ని ప్రాంతాల్లో లేకపోవడమే. మహిళలపై  దాడులు, అత్యాచారాలకు ప్రేరణ కల్పించే ప్రాంతాలున్నాయి. ఇలాంటివి నగరంలో 3వేలు ఉన్నాయని గుర్తించాం. అక్కడ యుద్ధ ప్రాతిపదికన విద్యుద్దీపాలు ఏర్పాటు చేయనున్నాం. నగరంలో శిథిల భవనాలు 12వేలు ఉన్నాయి. వీటి పరిసర ప్రాంతాల్లో ఆకతాయిలు, కొందరు విద్యార్థులు, యువకులు మద్యం తాగుతున్నారు. అర్ధరాత్రి దాటేంత వరకూ అక్కడే గడిపి వెళుతున్నారు. కొందరు ప్రమాదాలు చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లే క్రమంలో గొడవపడుతున్నారు. ఇంకొందరు యువతులను అక్కడికి తీసుకువస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని గస్తీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ప్రతి చిన్న ఘటనను నేర దృష్టి కోణంలో చూడాలని సిబ్బందికి వివరించనున్నాం. పాతబస్తీ, నగరంలోని ప్రధాన ప్రాంతాలు, శివార్లలో ఉంటున్న యువతులు, మహిళలు రాత్రివేళల్లో వారి గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకునేందుకు ప్రజా రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడేలా ఆర్టీసీ అధికారులతో చర్యలు చేపట్టనున్నాం.

చెడును మొగ్గదశలోనే తుంచేలా.. చిన్నారులు, మహిళలు, యువతులపై అత్యాచారాలు, లైంగికదాడులు జరుగుతున్నాయంటే అందుకు ప్రధాన కారణం దుర్మార్గపు, చెడు ఆలోచనలే. అటువంటి ఆలోచనలను మొగ్గలోనే తుంచేసేందుకు కార్యాచరణను అమలు చేయనున్నాం. పాఠశాల, ఇల్లు, ఇంటి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు, పరిస్థితులు విద్యార్థులు, కౌమారుల్లో చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. చెడు ఘటనల ప్రభావాన్ని తగ్గించాలంటే ప్రజలు, సమాజం చొరవ చూపాలి. తొలుత మేం క్షేత్రస్థాయిలో ప్రజలందరితో పరిచయాలున్న కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించాం. ‘‘నేరం జరిగిన తర్వాత పోలీసులు వస్తారు.. జరగక ముందున్న పరిస్థితులు మీరు తెలుసుకుని మీ స్థాయిలో పరిష్కరించండి.. మాకు సమాచారం ఇవ్వండి’’ అని చెప్పాం.

పైశాచిక ప్రవృత్తితోనే... కొందరు యువకులు, విద్యార్థులు, వ్యక్తుల్లో పైశాచిక ప్రవృత్తి కారణంగానే సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. చరవాణిలో ఒక్క మీట ద్వారా అశ్లీల వీడియోలు, అసభ్య చేష్టలను చూస్తున్నారు. ఎక్కువగా చెడువైపు ఆకర్షితులవుతున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రధాన సంఘటనను ఒక దుర్మార్గుడు గ్రాఫిక్‌ ద్వారా చిత్రీకరించి అంతర్జాలంలో ఉంచితే.. 30 నిమిషాల్లోనే 50వేల మంది చూశారు.

ప్రతి పౌరుడు పోలీసే.. హైదరాబాద్‌లో నివసిస్తున్న ప్రతి మహిళ, యువతి, చిన్నారి భయపడకుండా వారి పనులు చేసుకుంటూ చిరునవ్వుతో జీవించాలంటే ప్రతి పౌరుడూ ఒక పోలీస్‌ అవ్వాలి. అలానే ప్రతి పోలీస్‌ ఒక పౌరుడిలా ఆలోచించాలి. కళ్లముందు ఏ చిన్న సంఘటన జరిగినా ఇరుపక్షాలూ స్పందించి సమాచారాన్ని అందరికీ పంచాలి.  నగరంలో 1.53లక్షల ఆటోలుంటే 74వేల ఆటోలను ‘మై ఆటో సేఫ్‌’ అన్న నినాదంతో సురక్షితంగా ప్రయాణం చేసేలా చర్యలు చేపట్టాం. ఒకటి, రెండు నెలల్లో మిగిలిన ఆటోలనూ రక్షణ ఛత్రంలోకి తీసుకువస్తున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.