close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

సహకారం ‘రెండింతలు’

ప్రతి మండలంలో కనీసం రెండు పీఏసీఎస్‌లు

సహకార వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం దృష్టి

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

సహకార వ్యవస్థ బలోపేతంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పునర్విభజించాలని నిర్ణయించింది. ప్రతి మండలంలో రెండు సహకార సంఘాలుండనున్నాయి. ఈ మేరకు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సంఘాల సంఖ్య పెరగనుంది.

ఉమ్మడి జిల్లాలో..

2004-05లో ప్రభుత్వం సహకార సంఘాలను కుదించింది. అప్పట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 285 సంఘాలు ఉండగా వాటిని 101కి తగ్గించింది. నాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వ్యతిరేకత వచ్చింది. కొంతమంది రాజకీయ నాయకులు తమ సంఘాలు రద్దు కాకుండా చేసుకున్నారు. కొన్ని మండలాల్లో ఎవరూ పట్టించుకోలేదు. అందువల్ల ఇప్పుడు ఖమ్మం జిల్లాలో కొన్ని మండలాల్లో 10 సంఘాలు ఉండగా, మరి కొన్నింట్లో ఒక్కొక్కటి మాత్రమే ఉన్నాయి. అంతా అస్తవ్యస్తంగా జరిగింది. రాష్ట్ర విభజన, జిల్లాల పునర్విభజన జరిగిన అనంతరం ఖమ్మం జిల్లాలోని 76, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 21 సంఘాలు మిగిలాయి.

అదనంగా.. : ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఖమ్మం జిల్లాలో అదనంగా మరో అయిదు సంఘాలు పెరగనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో మొత్తం 76 సంఘాలున్నాయి. ఏన్కూరు మండలంలో గార్లవొడ్డు, కొణిజర్ల మండలం గోపవరం, కారేపల్లి మండలం కారేపల్లి, ఖమ్మం గ్రామీణ మండలం ఏదులాపురం, ఖమ్మం అర్బన్‌ మండలంలో ఆంధ్రాబ్యాంకు ఫార్మర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ఉన్నాయి. ఈ మండలంలో ఇప్పుడు అదనంగా మండలానికి ఒకటి చొప్పున పెరిగే అవకాశం ఉంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఎక్కువ ప్రయోజనం జరగనుంది. ఇప్పుడున్న సంఘాలు రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాలో మొత్తం 21 సంఘాలు మాత్రమే ఉన్నాయి. అశ్వాపురం, దమ్మపేట, చర్ల, అశ్వారావుపేట మండలాల్లో మాత్రమే రెండేసి చొప్పున ఉన్నాయి. మిగిలిన 17 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన మండలాలైన సుజాతనగర్‌, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, ఆళ్లపల్లి మండలాల్లో సంఘాల ఏర్పాటు అధికారులకు కొంత చిక్కుముడిగా ఉంది. సుజాతనగర్‌, ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి మండలాల్లో రెండేసి చొప్పున ఏర్పాటుకు ఎలాంటి సమస్య లేదు. కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మిదేవిపల్లి మండలాల్లో కొంత సమస్య ఉంది. దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఓటర్లు తక్కువగా ఉండటం. వీటిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయమై సహకార అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. భద్రాచలం మండలంలో భద్రాచలం సహకార సంఘం మాత్రమే మిగిలింది. ఈ సంఘంలోని అధిక శాతం గ్రామాలు ఏపీలో విలీనం అయ్యాయి. ఇప్పుడు ఇక్కడ కేవలం 22 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నందున ఈ మండలంలో మరో సంఘం ఏర్పాటు కావటం ఇక కష్టమేనని భావిస్తున్నారు.

కసరత్తు షురూ

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సహకార సంఘాల సంఖ్యను పెంచే ప్రక్రియ మొదలైంది. ఒకటే సంఘం ఉన్న మండలంలో అదనంగా మరొకటి ఏర్పాటుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రెండో సంఘం ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం సహకార సంఘాల సభ్యుల సంఖ్య, గ్రామాలు, రైతులకు అందుబాటులో ఉండే ప్రాంతంతోపాటు అక్కడ సాగు విస్తీర్ణం ఎంత ఉందనేదానిపై సమాచారం సేకరిస్తున్నారు. మండల మ్యాప్‌లను తెప్పించుకుని భౌగోళిక పరిస్థితులను విశ్లేషిస్తున్నారు. వచ్చే సోమవారం మరోసారి హైదరాబాద్‌లో జరిగే సమావేశంలో కొత్త సంఘాల ఏర్పాటుపై ప్రాథమిక అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా సహకార అధికారి రాజేశ్వరశాస్త్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారి మైఖేల్‌బోస్‌లు ఇప్పటికే సమాచార సేకరణలో నిమగ్నమై ఉన్నారు.

బలోపేతంపై దృష్టి

సహకార సంఘాలు కేవలం పంట రుణాలకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. రైతులందరినీ సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చుకోవటం, బంగారం తాకట్టు రుణాలను రైతులకు ఇచ్చే సదుపాయం కల్పించటం, ఎరువులు, విత్తనాల సరఫరాతో పాటు మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం ద్వారా మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. వీటితోపాటు డిపాజిట్ల సేకరణపై కూడా ఎక్కువ దృష్టి పెట్టాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.