close

బుధవారం, జనవరి 29, 2020

ప్రధానాంశాలు

మేడారం

సాగుకు అడ్డుకాలం

ఆందోళనలో రైతులు 

రబీకి సాగు నీరందేదెలా..?

జిల్లాలో రబీ సాగు పనులు ప్రారంభమయ్యాయి. ఈ యేడు వర్షాలు సమృద్ధిగా కురవడంతో శ్రీరాంసాగర్‌ జలాశయంతో పాటు చెరువులు నిండాయి. ప్రస్తుతం సాగు విస్తీర్ణం పెరిగే ఆస్కారం ఉంది. అయితే పంటలకు సాగు నీరందించే కాలువలు, ఉపకాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోయి మూసుకుపోయాయి. కొన్ని చోట్ల తూముల షట్టర్లు పనిచేయడం లేదు. మరికొన్ని చోట్ల శిథిలావస్థకు చేరాయి. అధికారులు సత్వరమే స్పందించి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.

100 ఎకరాలకు నీరందదు

కమ్మర్‌పల్లి: ముప్కాల్‌ మండలం రెంజర్ల వద్ద డీ-4 కాల్వ నుంచి ఏర్పాటైన లక్ష్మి ఉప కాల్వ ఉంది. ఈ కాల్వ నుంచి 100 ఎకరాలకు నీరందేది. నాలుగేళ్లుగా ఉప కాల్వలోకి నీరు రావడం లేదు. రెంజర్లలో వంతెన కింద పైపులు పగిలిపోయి నీరు ముందుకు సాగడం లేదు. నీరు లేక ఉప కాల్వ పిచ్చిమొక్కలతో నిండిపోయింది.

అధ్వానంగా సాగు కాల్వలు

నవీపేట: పై చిత్రంలో కనిపిస్తున్నది నవీపేటలోని నిజాంసాగర్‌ డీ-50 ప్రధాన కాల్వ. ఆయకట్టు 15,866 ఎకరాలు ఉంది. రబీలో 14 వేల ఎకరాల్లో వరి, 300 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయనున్నారు. ప్రధాన కాల్వ 30 కి.మీ, ఉప కాల్వలు 60 కి.మీ పొడవున విస్తరించి ఉన్నాయి. సగానికి పైగా ప్రధాన, ఉప కాల్వలు పొదలు, పూడికతో నిండిపోయాయి. మూడేళ్లుగా మరమ్మతుల జాడే లేదు.

పిచ్చిమొక్కలు తొలగవు.. నీరు పారదు

మెండోరా: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ప్రధాన కాల్వల్లో ఒకటైన లక్ష్మి కాల్వ డిస్ట్రిబ్యూటరీ డీ-2 కాల్వలో పిచ్చి మొక్కలు పెరిగి అధ్వానంగా తయారయ్యాయి. కాల్వలో నీరు దిగువకు సరిగా పారడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ కాల్వ బుస్సాపూర్‌ మీదుగా దూద్‌గాం, సోన్‌పేట్‌ గ్రామాలకు వెళ్తోంది. ప్రతిసారి దూద్‌గాం గ్రామస్థులే ఈ కాల్వలో పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు.

500 ఎకరాలు ప్రశ్నార్థకం

మాక్లూర్‌: బోర్గాం(కె) సమీపంలోని సాగర్‌ 69-డిస్ట్రిబ్యూటరీ కాల్వ ఇది. దట్టమైన ముళ్ల పొదలతో నిండిపోయింది. దీనికితోడు గైడ్‌వాల్వులు, కల్వర్టులు సరిగ్గా లేవు. 500 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది.

పూడిక తీయక.. నీరందక..

ఎడపల్లి: అంబం ఆయకట్టు రైతాంగానికి డీ-46 కాల్వ ద్వారా సాగునీరు సక్రమంగా అందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పూడిక పెరగడంతో నీరు చివరి ఆయకట్టుకు చేరడం లేదు. సిమెంటు ఉప కాలువను నిర్మిస్తే ఆయకట్టు చివరివరకు నీరు అందే అవకాశం ఉంది. 100 ఎకరాలకు పైగా సాగునీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరమ్మతులు కరవు

బాల్కొండ: శ్రీరాంసాగర్‌ జలాశయం నుంచి లక్ష్మి కాల్వ డీ-3 ఎత్తిపోతల ద్వారా బోదేపల్లి ఎత్తిపోతల కింద 1120 ఎకరాలు, డీ-3 వేంపల్లి ఎత్తిపోతల నుంచి మండలంలో మరో రెండు వేల ఎకరాల వరకు ఆయకట్టు ఉంది. కాని కాల్వకు గత కొన్నేళ్లుగా మరమ్మతులు చేయించడం లేదు. దీంతో కాల్వలో పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు మొలిచాయి. కాల్వ కనిపించకుండా పొదలు ఉన్నాయి. నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి.

నిర్లక్ష్యం వృక్షాలుగా మారాయి

మాక్లూర్‌ గ్రామీణం: మాక్లూర్‌ మండలంలోని నిజాంసాగర్‌ కాల్వ కింద ఉన్న డిస్ట్రిబ్యూటరీ 74,75,76,78 కాల్వలు పిచ్చి మొక్కలతో పూర్తిగా నిండిపోయి కనిపించని దుస్థితి ఏర్పడింది. కాల్వల్లో వృక్షాలు పెరిగి అధ్వాన స్థితికి చేరాయి. ప్రధాన కాల్వ నుంచి ఉప కాల్వలకు వెళ్లేందుకు ఉన్న గేట్లు తెరుచుకోక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రబీ సీజన్లో తొమ్మిది వేలకు పైగా ఎకరాలకు సాగు నీరందించే కాల్వలు ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగు వేలకు కూడా సాగు నీరందించని దుస్థితి నెలకొంది.

లక్ష్మి కాల్వ

ముప్కాల్‌ మండలం కొత్తపల్లి శివారులో కాల్వ పూర్తిగా దెబ్బతింది. పొదలు పెరిగి తూములు, షెట్టర్లు మూసుకుపోయాయి.

వేంపల్లి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన మూడు గేట్లలో ఒకటి పనిచేయడం లేదు. నీటి విడుదల సమయంలో డీ-4, డీ-3 డిస్ట్రిబ్యూటరీల పరిధిలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

శెట్టిపల్లి చెరువుకు తరలించే మార్గంలో సిమెంటు లైనింగ్‌ లేకపోవడంతో నీరంతా వృథాగా వెళ్తోంది.

వేంపల్లి ఎత్తిపోతల నుంచి నవాబ్‌ ఎత్తిపోతలకు.. అక్కడి నుంచి గ్రామాల చెరువులు నింపేందుకు కాల్వలు నిర్మించాల్సి ఉండగా మూడు గ్రామాల్లో పనులు సా..గుతున్నాయి.


అలీసాగర్‌

నవీపేటలో ఉపకాల్వలు పిచ్చిమొక్కలు పెరిగి నీరు పారే పరిస్థితి కనిపించడం లేదు.

రెంజల్‌లో షట్టర్లు బిగించలేదు. కొందరు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసుకుంటే దిగువకు నీరు రాని పరిస్థితి ఉంటోంది.


గుత్ప

డీ-74 నుంచి డీ-78 వరకు గేట్లు సరిగా లేవు. కాల్వలు కూరుకుపోయి ఉన్నాయి.

జక్రాన్‌పల్లి గుత్ప విస్తరణ పనుల్లో జాప్యం నెలకొంది.

నందిపేట మండలంలో ఉప కాల్వలు రూపు లేకుండా పోయాయి. పొదలు పెరిగి తూములు కనిపించడం లేదు.

ఆర్మూర్‌లోని ప్రధాన కాల్వల్లో చెట్లు పెరిగాయి. ఉప కాల్వలను అసలు గుర్తించే పరిస్థితి లేదు.

వేల్పూరు మండలానికి అరకొరగానే నీరు సరఫరా అవుతోంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.