close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

చిట్టి బుర్రలు.. గట్టి ఆవిష్కరణలు

జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆకట్టుకున్న ప్రయోగాలు

న్యూస్‌టుడే, జ్యోతినగర్‌: విజ్ఞానంతోనే దేశాభివృద్ధి సాధ్యం. చిట్టి మెదళ్ల నుంచే అంకురించే ఆలోచనలే అద్భుత ప్రదర్శనలకు ఆలవాలమవుతాయని విద్యార్థులు చూపిస్తున్నారు. మస్తిష్క మథనంతో అంతర్జాలం, చంద్రయాన్‌, కొత్త తరహా పంటలు, వినూత్న ఆవిష్కరణలు చిట్టి బుర్రల తలుపులు తెరిచాయి. రామగుండం ఎన్టీపీసీలో శుక్రవారం ప్రారంభమైన జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నవతరాన్ని ప్రతిబింబిస్తోంది. అందరి దృష్టిని ఆకర్శిస్తూనే కొత్తదనానికి బాటలు వేసేలా ప్రదర్శనలు కనిపించాయి. శనివారం కూడా ఈ ప్రదర్శన కొనసాగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆవిష్కరణల్లో పలు అంశాలు ఆకట్టుకున్నాయి. వాటి సమాహారమే ఇది.

పొలానికి నీళ్లు పెట్టండిలా..
విద్యార్థి: శ్యామల పుష్ప, 9వ తరగతి
గైడ్‌ టీచర్‌: జక్కం శ్రీనివాస్‌
పాఠశాల: పోతారం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల(ముత్తారం)
పరికరాలు: ఒక పాత చరవాణి, సౌండ్‌ సెన్సార్‌, మోటారు
ప్రాధాన్యం-పని చేసే విధానం: పాత చరవాణికి రింగ్‌ చేయగానే వైబ్రేట్‌ ఆన్‌ అయి మోటారు పనిచేస్తుంది. ఈ ప్రయోగానికి రూ.500 వరకు మాత్రమే ఖర్చవుతుంది.
లక్ష్యం: ఇంట్లో ఉండి పంటకు నీళ్లు పట్టడానికి, అవసరం తీరాక చరవాణికి రింగ్‌ చేస్తే ఆఫ్‌ అయ్యేలా దీన్ని రూపొందించారు. ఈ పరికరంతో నీటి వృథాను అరికట్టవచ్చు. మనిషి లేకున్నా దూరంగా ఉండి నీళ్లు పట్టవచ్చు.

కోతులను పారదోలుదాం రండి
విద్యార్థి: రాజకృష్ణ(9వ తరగతి)
గైడ్‌ టీచర్‌: సురేష్‌
పాఠశాల: ఎగ్లాస్‌పూర్‌ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల(మంథని)
పరికరాలు: ఒక లైటర్‌, కార్బన్‌ కార్బేట్‌ ముక్కలు, వంట గ్యాస్‌కు ఉపయోగించే లైటర్‌
ప్రాధాన్యం-పని చేసే విధానం: ఒక గన్నులాంటి అట్ట పెట్టెలో లైటర్‌ను అమర్చాలి. అంతకుముందు కార్బన్‌ కార్బైట్‌ ముక్కను ఉంచి నీటిని చల్లితే ఎస్టలిన్‌ విడుదలవుతుంది. ముందుగా అమర్చుకున్న లైటర్‌ను కొడితే దానిలో వచ్చే మెరుపు రవ్వతో పేలుడు శబ్ధం వస్తుంది.
లక్ష్యం: రైతులు కోతుల బారి నుంచి పంటలను రక్షించుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ భారీ శబ్ధంతో కోతులు దూరంగా పారిపోతాయి.

సెన్సార్లతో నీటి ఆదా
విద్యార్థులు: జి.సౌశీల్య, ఎస్‌.అనిత(9వ తరగతి)
గైడ్‌ టీచర్‌: జగదీశ్వర్‌రెడ్డి
పాఠశాల: జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, రాగినేడు(పెద్దపల్లి)
పరికరాలు: ఐ.ఆర్‌. సెన్సార్‌ పరికరం, ఆర్డినో మైక్రో కంట్రోలర్‌, మాయిశ్చర్‌ సెన్సార్‌, వైబ్రేషన్‌ సెన్సార్‌, 12 వోల్టుల రిలే
ప్రాధాన్యం-పని చేసే విధానం: సెన్సార్‌ పరికరాలను మరుగుదొడ్డి ద్వారానికి అమర్చాలి. మాయిశ్చర్‌ సెన్సార్‌, వైబ్రేషన్‌ సెన్సార్‌ను మరుగుదొడ్డి లోపల నీళ్లు వచ్చే కుండీకి అమర్చాలి. ద్వారం తీయగానే మాయిశ్చర్‌, వైబ్రేషన్‌ సెన్సార్లు పని చేయడం ప్రారంభిస్తాయి. తగిన పాళ్లలో నీరు మరుగుదొడ్డిలోకి వెళ్లగానే అవి ఆగిపోతాయి. అవసరమైనంత నీటిని మాత్రమే మరుగుదొడ్డికి వాడుకునేలా అమర్చుకుంటే నీటి ఆదా ఏర్పడుతుంది. నీళ్లు వాడకుంటే మైక్రో కంట్రోలర్‌ మోగుతుంది.
లక్ష్యం: తగిన పాళ్లలో నీళ్లు ఉపయోగించటానికి, నీటి ఆదాకు ఈ పరికరం ఉపయోగపడుతుంది.

మట్టి లేకుండా వ్యవసాయం
విద్యార్థి: శివశ్రీవర్ధన్‌(9వ తరగతి)
గైడ్‌ టీచర్‌: కౌండిన్య
పాఠశాల: వాణీ సెకండరీ పాఠశాల(సెంటినరీకాలనీ)
పరికరాలు: పైపులు, ఎల్‌బోలు, టి-బెండ్లు, విత్తనాలు, కంకర, లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌, గ్రీన్‌ పరదా, గ్లాస్‌లు
ప్రాధాన్యం-పని చేసే విధానం: ఇంట్లో పడవేసిన తడి చెత్తను మొదట కుళ్లిపోయేలా చేయాలి. దీంతో లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌గా మారుతుంది. దీన్ని పైపుల మధ్యలో రంధ్రాల్లో గ్లాస్‌లు అమర్చాలి. విత్తనాలు వేసి కంకర పోసి లిక్విడ్‌ ఫెర్టిలైజర్‌ను కలపాలి. వాటిపై సూర్యరశ్మి ప్రసరించేలా గ్రీన్‌ పరదా కట్టాలి. దీంతో రెండు రోజుల్లో మొలకెత్తుతాయి. ఈ విధానం ఇజ్రాయిల్‌లో అవలంభిస్తున్నారు. ఇది మట్టి లేకుండా వ్యవసాయం చేసే పద్ధతి.
లక్ష్యం: మట్టి లేకుండా వ్యవసాయం చేయవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో కూడుకుంది.

హైడ్రాలిక్‌ బ్రిడ్జి విధానం
విద్యార్థి: సీహెచ్‌.లోకేష్‌
గైడ్‌ టీచర్‌: తిరుపతి
పాఠశాల: జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల-ఎన్టీపీసీ
పరికరాలు: కార్డుబోర్డు ముక్కలు, అగ్గిపుల్లలు, తెల్ల పేపర్లు, ఫెవికాల్‌, రెండు సిరంజీలు
ప్రాధాన్యం-పని చేసే విధానం: కార్డు బోర్డు ముక్కలతో బ్రిడ్జి నమూనాను తయారు చేశాం. అగ్గిపుల్లలు వంతెన గోడలు, వంతెన రహదారిని రెండుగా చీల్చాలి. సిరంజీలతో ఒత్తిడి తెస్తే రహదారులు పైకి లేస్తాయి. ఒత్తిడి తగ్గిస్తే రహదారి మామూలు స్థితికి వస్తుంది.
లక్ష్యం: ఎక్కువ ఎత్తు ఉన్న ఓడలు, పడవలు, స్టీమర్లు వెళ్లడానికి వంతెనలు అడ్డుగా వస్తాయి. వంతెనలను హైడ్రాలిక్‌ పద్ధతిలో తయారు చేస్తే భవిష్యత్తు రవాణా మెరుగుపడుతుంది.

పొగ శోషక యంత్రం
విద్యార్థి: ఎం.అభిరామ్‌, 10వ తరగతి
గైడ్‌ టీచర్‌: కె.సుజాత
పాఠశాల: ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సుల్తానాబాద్‌
పరికరాలు: 9 వోల్టుల డీసీ బ్యాటరీలు రెండు, 2 చిన్న ఫ్యాన్‌ రెక్కలు, 2 మోటార్లు, పైపు ముక్కలు, కత్తిరించిన సీసా, పొడవైన పైపు, అట్టపెట్టె
ప్రాధాన్యం-పని చేసే విధానం: ఒక అట్టపెట్టె లోపల డీసీ బ్యాటరీలకు 2 ఫ్యాన్‌ రెక్కలు అమర్చిన 2 మోటార్లు అమర్చాలి. ఒక వైపు కత్తిరించిన సీసాను అతికించి దానికి పొడవైన పైపు బిగించాలి. మరోవైపు రంధ్రాల ద్వారా పైపు మొక్కలు బిగించాలి. రంధ్రాల పైపు మొక్కల దిశను వంట గది వైపు ఉంచి మోటార్లు లోపలి గాలిని బయటకు పంపేలా అమర్చాలి.
లక్ష్యం: వంట గదిలోని వ్యర్థ వాయువులు, పొగలు బయటకు పంపవచ్చు. తక్కువ ఖర్చుతో ఇది సాధ్యమవుతుంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.