close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

అందని సహకారం

ఊసేలేని పీఏసీసీఎస్‌ల ఎన్నికలు
జిల్లాలో నూతన సంఘాల ఏర్పాటుకు చర్యలు
జగిత్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే

వ్యవసాయాధారితమైన జగిత్యాల జిల్లాలో రైతులకు సేవలందించేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు విశేషపాత్ర పోషిస్తుంటాయి. కానీ ఈ సంఘాల నిర్వహణను ప్రభుత్వం అంతగా పట్టించుకోకపోవటం కర్షకుల సేవలకు విఘాతంగా పరిణమిస్తోంది. ఓవైపు సంఘాలకు రిబేటును విడుదల చేయకపోగా  మరోవైపు వాయిదావేస్తూ వస్తున్న ఎన్నికలను కనీసం ఈ సారైనా జరుపుతారా అనేది సందేహంగా మారింది.

రాష్ట్రంలో జిల్లాలు, మండలాలు, గ్రామాలను విభజించగా సహకార సంఘాలకు మాత్రం ఎన్నికలను జరపక పాత పరిధుల్లోనే కొనసాగిస్తుండటం పాలనను కుంటుపడేలా చేసింది. జిల్లా కేంద్ర బ్యాంకు కరీంనగర్‌లో ఉండగా జగిత్యాల జిల్లాలోనూ మండలాలు, గ్రామాల పరిధిలు మారటంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు పాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సాధారణంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు డైరెక్టర్లను ఎన్నుకున్న తదుపరి డైరెక్టర్లు ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. సంఘాల ఛైర్మన్లు డీసీసీబీలో సభ్యులుగా, అధ్యక్షునిగా, డీసీఎంఎస్‌ సభ్యులుగా, అధ్యక్షునిగా ఎన్నికవుతారు. తదుపరి మార్క్‌ఫెడ్‌ తదితర రాష్ట్రస్థాయి పదవులను కూడా వీరినుంచే భర్తీచేస్తారు. కానీ ప్రత్యేకరాష్ట్రం, ప్రత్యేక జిల్లాలు ఏర్పడినప్పట్నుంచి వీటికి ఎన్నికలను జరపలేదు.

2013లో సహకార  సంఘాలకు ఎన్నికలను జరిపారు. తదుపరి జగిత్యాల జిల్లాలోని 51 సంఘాల పదవీకాలాన్ని ఇప్పటివరకు ఆరు మాసాల చొప్పున నాలుగుసార్లు పొడిగిస్తూ వస్తున్నారు. పొడిగించిన సంఘాల పదవీకాలం 2020 ఫిబ్రవరి 1, 2, 4 తేదీలతో ముగుస్తుంది. దీనికిగాను గడువుకు ముందుగానే ఎన్నికలను పూర్తిచేసి నూతన పాలకమండలిని ఎన్నుకుంటే గడువుకు పదవీ బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ కనీసం రెండు మాసాలు కొనసాగుతుంది. కానీ ఇప్పటివరకు సహకార ఎన్నికలపై ప్రభుత్వంనుంచి ఎలాంటి స్పందన లేకపోగా ప్రస్తుత పాలకమండళ్లను కొనసాగిస్తారా లేక పర్సన్‌ ఇన్‌ఛార్జిలను నియమిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

* జిల్లాలో సాలీనా రూ. 610 కోట్లకు పైబడిన లావాదేవీలు, 79 వేలమంది సభ్యులతో రైతులకు విభిన్న సేవలందిస్తున్న సంఘాల పాలకమండళ్లకు ఎన్నికల నిర్వహణతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. జిల్లాలో 51 సహకార సంఘాలుండగా ఇందులో 50 సంఘాలు కరీంనగర్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలో ఉండగా సారంగాపూర్‌ మండలం కోనాపూర్‌ సింగిల్‌విండో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆర్థిక వనరుల నేపథ్యంగా కార్యకలాపాలు సాగిస్తోంది. అన్నిసంఘాల్లో కలిపి 79 వేలమంది సభ్యులుండగా ఇందులో 49 వేలమంది ఓటర్లుంటారు. గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు కేడీసీసీ పరిధిలోనే సంఘాలన్నీ ఉండగా జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణతో కేడీసీసీ పరిధిలోని సంఘాలు ఏడు జిల్లాలకు వెళ్లాయి. డీసీసీబ్యాంకు కరీంనగర్‌లో ఉన్నా ప్రస్తుత జిల్లాల వారీగానే సంఘాలను విభజించి కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. దీంతో ఎన్నికలను కేడీసీసీ పరిధిలోనే జరపాలని నిర్ణయించి 2018 డిసెంబరులో ఉత్తర్వులను జారీచేసినా ఎన్నికలను జరపలేదు. 2019 జనవరిలో ఎన్నికలను జరపాలని నిర్ణయించి ఓటరు జాబితాలను సిద్దంచేసి బ్యాలెట్‌ పత్రాలు, పెట్టెలను సమకూర్చినా వరుస ఎన్నికలతో వాయిదావేశారు. ప్రస్తుతం నూతన జిల్లాలు మండలాల పరిధిలో ఎన్నికలను జరపాలని రైతులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కోరుతున్నారు.

* జగిత్యాల జిల్లాలో ఇప్పటికే 51 సహకార సంఘాలుండగా విభజనతో కొన్ని మండలాల్లో సంఘాలకు ప్రాతినిథ్యం తగ్గింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని జగిత్యాల రూరల్‌ మండలం జాబితాపూర్‌, చల్‌గల్‌, బుగ్గారం, మద్దునూరు గ్రామాల్లో సంఘాలను ఏర్పాటు చేసే అవకాశముందని అధికారులు గుర్తించారు. ఇందుకు ప్రతిపాధనలను పంపగా అనుమతి రావాల్సిఉంది. అనుమతి వస్తే 55 సంఘాలకు ఎన్నికలను జరిపే వీలుంటుంది. సహకార నిబంధనల ప్రకారం నిర్ధేశిత గడువుకు ముందు సభ్యులై ఉన్నవారికే సహకార ఎన్నికల్లో ఓటుహక్కు లభిస్తుంది. రుణాలను తీసుకున్నపుడు చెల్లించే రూ. 10తో సంఘాల్లో సభ్యత్వం ఉన్నాకూడా వీరికి ఓటుఅర్హత లేకపోగా రూ. 333 చెల్లించి సభ్యత్వం పొందినవారికి మాత్రమే ఓటువేసే అర్హత ఉంటుంది. సంఘాలద్వారా రైతులకు పంటరుణాల పంపిణీతో పాటుగా విత్తనాలు, ఎరువుల విక్రయం, పెట్రోలుపంపు, వాహన రుణాలు, బంగారం రుణాలు, పురుగుమందుల విక్రయం తదితర సేవలను అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో సంఘాలను బలోపేతం చేస్తే గ్రామీణులకు సేవలు మరింతగా విస్తరిస్తాయి. నూతన సహకార విధానం ప్రకారం సంఘాల ద్వారానే సేంద్రీయ సాగును ప్రోత్సహించటం, బిందుసేద్య పరికరాలను ఇవ్వటం, ఉపాధిహామీ పథకంలో నారునుపెంచి మొక్కల పంపిణీ చేపట్టడం, విత్తనశుద్ధి కేంద్రాల ఏర్పాటు, భూసార పరీక్షా కేంద్రాల ఏర్పాటు, వ్యవసాయ, ఉద్యాన శాఖల రాయితీ పథకాలను సింగిల్‌విండోల ద్వారానే అమలు చేయటం, జీవన ఎరువుల తయారీ కేంద్రాల ఏర్పాటు తదితరాలు ప్రభుత్వ ఉద్దేశ్యంగా ఉండగా ఇవన్నీ అమలైతే సంఘాలు మరింతగా శక్తివంతమవుతాయి. ఐతే రైతులకు విశేష సేవలందుతున్నా నాలుగు సంవత్సరాలుగా జిల్లాలోని సంఘాలకు రూ. 55 కోట్ల వరకు రిబేటును విడుదల చేయకపోవటం, రైతులకు ఇవ్వాల్సిన రీఎంబర్స్‌మెంట్‌ వడ్డీని ఇవ్వనందున సంఘాలు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను జరపటం, నూతన సహకార విధానం అమలుతో పాటుగా బకాయిగల రిబేటును విడుదల చేయాల్సిఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.