close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

మేడారం

పౌర సమాజం.. దిశా నిర్దేశం

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ ఘటనపైదేశవ్యాప్తంగా స్పందన

- ఈనాడు, హైదరాబాద్‌

తోటివారికి ఏం జరిగినా పట్టించుకునే స్థితిలో సమాజం లేదని అపవాదు మూటగట్టుకుంటున్న తరుణంలో ‘దిశ’ ఘటన అందర్నీ కలిచివేసింది. గత నవంబరు 27న హైదరాబాద్‌ శివారు చటాన్‌పల్లి వద్ద యువ పశువైద్యురాలు ‘దిశ’ హత్యాచార ఉదంతంపై పౌర సమాజం ముక్త కంఠంతో స్పందించింది. హైదరాబాద్‌లో మొదలైన నిరసనలు దిల్లీ దాకా చేరాయి. నిర్భయ ఉదంతం తర్వాత మహిళల భద్రతకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వ్యక్తమైన ఘటన ఇది. పోలీసులు, ప్రభుత్వం జవాబివ్వాల్సిన పరిస్థితులు తెచ్చారు. శుక్రవారం నాటి పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు నిందితులు హతం కావడంతో దేశవ్యాప్తంగా జనం తమ మనోభిప్రాయాలను వెల్లడించారు.

కలచివేసిన ‘దిశ’ హత్యాచార ఉదంతం

షాద్‌నగర్‌లో గత వారం జరిగిన దిశ ఘటనపై సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధుల వరకు అందరూ గళమెత్తారు. వారం రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. అమ్మాయిలకు సమాజంలో కరవైన భద్రత, వ్యవస్థలోని లోపాలను ఎండగట్టారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారనే సమాచారంతో ప్రజలు పెద్ద ఎత్తున షాద్‌నగర్‌ ఠాణాకు చేరుకున్నారు. అక్కడి నుంచి జైలుకు నిందితులను తరలించే క్రమంలో తమకు అప్పగించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నిందితులు ఉన్న వాహనంపై రాళ్లు రువ్వారు. వ్యానులో పడుకోబెట్టి.. అతికష్టం మీద నిందితులను జైలుకు తరలించారు. వెంటనే శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ హైదరాబాద్‌ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ప్రజలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, రాజకీయపక్షాలు, ఐటీ ఉద్యోగుల వరకు ర్యాలీలు నిర్వహించారు. విద్యార్థి సంఘాలవారు చర్లపల్లి జైలు వద్ద బైఠాయించారు. పలు పాఠశాలల, కళాశాల విద్యార్థులు రోడ్లు మీదకు వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. ఔత్సాహిక బైసైకిల్‌ రైడర్లు ర్యాలీ నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్‌మెంట్లలోని మహిళలు, పిల్లలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. వైద్యులు అన్నిచోట్ల నిరసనలు తెలిపారు. ఈ తరహాలో ఇటీవల ఒక ఘటనపై స్పందించడం ఇదే మొదటిసారి. కేంద్ర హోంమంత్రి, గవర్నర్‌, రాష్ట్ర మంత్రి, పార్టీల నాయకులు, సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామనే భరోసా ఇచ్చారు. పార్లమెంట్‌ను దిశ ఉదంతం కుదిపేసింది.

సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: శుక్రవారం ఉదయం నుంచి సోషల్‌మీడియా వేదికగా పోలీసు చర్యపై ప్రజలు అనుకూలంగా, వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అత్యధికులు దిశకు న్యాయం జరిగిందని సంతోషం వ్యక్తం చేయగా, పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శిక్షలు అమలు చేయడం మంచిది కాదన్నారు. ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వేదికగా చర్చలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్‌ పోలీసులను కీర్తిస్తూ సందేశాలు వెల్లువెత్తాయి. కొందరు ప్రజాసామ్యవాదులు, సామాజిక, పౌరహక్కుల కార్యకర్తలు చట్టప్రకారం ముందుకెళ్లాల్సిందన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని మహిళలు కొందరు న్యాయం జరిగిందంటూ కార్టూన్లను పెట్టారు.

‘ఆలస్యమైనా సరైన చర్య’

దేశంలో ఆడపిల్లలకు భద్రత కల్పించాలంటే సౌదీలో మాదిరి బహిరంగ శిక్షలు అమలు చేసేలా చట్టాలు చేయాలని కొందరు యువకులు డిమాండ్‌ చేశారు. అసోం, రాజస్థాన్‌, యూపీ తదితర రాష్ట్రాల్లోని అత్యాచార కేసులను తక్షణం హైదరాబాద్‌కు బదిలీ చేయాలని పేర్కొన్నారు. పోలీసులు ఆలస్యంగా స్పందించినా సరైన న్యాయం జరిగిందన్నారు. తెలంగాణ పోలీసులు ధర్మరక్షకులుగా నిలిచారంటూ కొందరు కీర్తించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని కొందరు పేర్కొనగా... ఘోరమైన నేరంతో పోల్చితే పెద్ద తప్పుకాదన్నారు.

‘ఖాఫ్‌ పంచాయతీగా మార్చేశారు’

పోలీసులు ప్రజాస్వామ్య దేశాన్ని ఖాఫ్‌ పంచాయతీగా మార్చారని విమర్శలు వచ్చాయి. ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు నమోదు వరకు నిర్లక్ష్యంగా వారు వ్యవహరించారన్నారు. కొందరు న్యాయవ్యవస్థల్లోని లోపాలను లేవనెత్తారు. ఎన్‌కౌంటర్‌పై కొందరు సైనికాధికారులు, పోలీసులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థపై నమ్మకంతో సంయమనం పాటించాల్సి ఉందన్నారు. రేపిస్టులను ఎవరూ సమర్థించడం లేదని విచారణ, శిక్ష చట్టప్రకారం జరగాలన్నారు. పాకిస్థాన్‌కు చెందిన అజ్మల్‌ కసబ్‌కు చట్టప్రకారం శిక్షలు వేసినపుడు... ఇక్కడి పౌరుల విషయంలో అలాగే ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు.

దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో నగర పోలీస్‌..

ఈనాడు డిజిటల్‌, ఈనాడు హైదరాబాద్‌

శుక్రవారం ఉదయం దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ అనంతరం ట్విట్టర్‌లో తొలి ఐదు స్థానాల్లో ఇదే అంశం కొనసాగుతోంది. సాహో సజ్జనార్‌, జస్టిస్‌ ఫర్‌ దిశ, సెల్యూట్‌ టు నగర పోలీస్‌.. హ్యాష్‌ట్యాగ్‌లు ఎక్కువగా ట్రెండ్‌ అవుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ దేశవ్యాప్తంగా నెటిజన్లు స్పందిస్తున్నారు.

సీపీకి సలామ్‌..

ఘటన జరిగిన రోజు నుంచి నెటిజన్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ను ఎన్‌కౌంటర్‌ కోసం అభ్యర్థిస్తున్నారు.గతంలో వరంగల్‌లో యాసిడ్‌ దాడి నిందితులనూ పోలీస్‌ ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వరంగల్‌ జిల్లా ఎస్పీగా సజ్జనార్‌ ఉన్నారు. ఇప్పుడు దిశ నిందితులను నిజంగానే ఎన్‌కౌంటర్‌ చేయడంతో నెటిజన్లు తమ ఖాతా డీపీలు, స్టేటస్‌లలో సజ్జనార్‌ ఫొటోను పెట్టారు. ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

సర్వత్రా స్వాగతమే..

‘ఈ ఎన్‌కౌంటర్‌తో సమాజంలో కీచకుల దాడికి బలైన వారికి సత్వర న్యాయం చేస్తారన్న భరోసా ఇచ్చారు’ అంటూ ఓ మహిళ స్పందించింది. మరో నెటిజన్‌ ‘రియల్‌ లైఫ్‌ సింగం’ అంటూ సజ్జనార్‌ను ప్రశంసించారు. ‘నేరస్థులకు ఎన్‌కౌంటర్‌ ద్వారా గుణపాఠం చెప్పే పోలీస్‌ అధికారి తెలంగాణ పోలీస్‌ శాఖలో ఉన్నందుకు గర్వపడుతున్నా’మంటూ మరికొంత మంది ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

షేర్‌చాట్‌లో చిట్‌చాట్‌..

ఉదయం 7.45 నుంచి తమ యాప్‌లో వినియోగదారులు ఎన్‌కౌంటర్‌ గురించి చర్చించుకోవడం ప్రారంభించారని షేర్‌చాట్‌ శుక్రవారం ప్రకటించింది. సాయంత్రం 5 వరకు కొనసాగిన సందేశాల ప్రవాహాన్ని పరిశీలిస్తే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన 1.7లక్షల మంది సొంతంగా సందేశాలను సృష్టించారు. అవి 5లక్షల మందికిపైగా చేరాయి. వాట్సాప్‌, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా జనంలోకి వ్యాపించాయి. 15 భాషల్లో పోలీసులకు మద్దతు, ప్రశంసలు లభించినట్లు వెల్లడించింది.

దిశ దశ

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా శిక్షిస్తే బాగుండేది

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ అందరికీ సంతోషంగా ఉండవచ్ఛు కానీ ఇదే పరిష్కారం కాదనిపిస్తోంది. దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడి ఉంటే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండేది. ఎన్‌కౌంటర్‌ అయినవాళ్లు పేద కుటుంబాలకు చెందినవారు. అలాగని నేను సమర్థించడం లేదు. ప్రత్యూష, నిర్భయ కేసుల్లోని నిందితులకు ఇలాంటి శిక్ష ఎందుకు పడలేదు. ఇప్పటికీ ఎందరో మృగాళ్లు బయటే తిరుగుతున్నారు. దిశ విషయంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టి నిందితులకు ఉరిశిక్షో.. యావజ్జీవ శిక్షో.. వేస్తే బాగుండేది.

- ఝాన్సీ, నటి, వ్యాఖ్యాత్రి

ప్రజలకు అవగాహన కల్పించాలి

ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గతంలో నేను ఫిక్కీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు పోలీసు శాఖతో కలిసి ఒక యాప్‌ను రూపొందించాం. మహిళలు, యువతులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అలాగే పోలీసు శాఖ రూపొందించిన హాక్‌ఐ యాప్‌ను వాడుకోవచ్ఛు నిందితులకు సరైన శిక్ష పడిందని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఏది మంచో.. ఏది చెడో చెప్పాలి. నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలి. మహిళలపై దాడుల, అత్యాచారాల ఘటనల్లో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చేయాలి.

- పింకీరెడ్డి, ఫిక్కీ మాజీ ఛైర్‌పర్సన్‌

తప్పునకు తగిన శిక్ష పడింది

చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ పోలీసులు మంచి పని చేశారు. సమాజంలో చెడు చేయాలనుకొనేవారికి ఇది ఒక హెచ్చరికగా నిలుస్తుంది. ఇలాంటి శిక్షల వల్ల తప్పు చేయాలని ఆలోచన వచ్చే వారిలోనూ భయం కలుగుతుంది. మహిళల విషయంలో జరిగే దాడులకు చట్టాల్లో చాలా మార్పులు తీసుకురావాలి. దిశ సంఘటనలో తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం మహిళలపై జరిగిన మిగిలిన సంఘటనల్లోనూ తీసుకోవాలి. ఇటీవల కాలంలో సురక్షితం కాని దేశాల జాబితాలోకి భారత్‌ వెళ్తుంది.

- నిధి అగర్వాల్‌, సినీనటి

చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది

ట్టాలను మార్చాల్సిన అవసరం కనిపిస్తుంది. దిశ ఘటన తరువాత ఇది మరింత స్పష్టమవుతోంది. దిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో చూస్తే దాదాపు ఏడేళ్లుగా కేసు కొనసాగుతోంది. ఆ నిందితులు ఇప్పుడు క్షమాభిక్ష కోరుతున్నారు. ప్రభుత్వాలు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటుచేయాలి. అప్పుడే న్యాయవ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. దిశ సంఘటనలో నలుగురే ఉన్నారా.. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది చూడాలి. అయితే లారీ డ్రైవర్ల విషయంలోనే కాకుండా పెద్ద తలకాయల విషయంలోనూ ఇలానే వ్యవహరించాలి.

- సదా, సినీనటి

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.