close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

కుర్రోళ్లు మారాలి!

తాత్కాలిక సుఖం కోసం ప్రాణాలు బలి
కుటుంబాల కంట కన్నీరు నింపిన నిందితులు

దిశ గమనం

షాద్‌నగర్‌ బృందం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో మనుషులమని మరిచిపోయారు.. మానవత్వాన్ని తమ క్షణకాల సుఖానికి తాకట్టు పెట్టారు.. చివరి దశలో హత్యకు పూనుకున్నారు. దారుణంగా ఓ యువతిని అగ్నికి ఆహుతి చేశారు. దీని పర్యవసానం వారం వ్యవధిలోనే ఆ నలుగురు విగతజీవులై మిగిలారు. వ్యవసం ఓ వైపు .. వాంఛలు మరోవైపు.. వీరిని నేరాలవైపు పురికొల్పాయి... ఫలితంగా వీరి నుదుట పోలీసులు మరణ శాసనం లిఖించారు. శుక్రవారం పోలీసుల ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో నిందితులు తమ జీవితాన్ని తామే ముగించుకున్న వైనమిది.

తెగింపు.. ముగింపు

వారంతా కష్టజీవులు.. లారీలలో డ్రైవర్లుగా, క్లీనర్లుగా పనిచేస్తున్నారు.. వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకుంటూ సరదాగా తమ జీవితాన్ని గడపొచ్చు. కానీ చేతికందిన డబ్బులతో విచ్ఛలవిడిగా తాగుతూ మద్యానికి బానిసలయ్యారు. తమకు ఓ కుటుంబం ఉందని, భార్య, తల్లిదండ్రులు తమ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తమ మీద ఉందని వీరు గుర్తించి ఉంటే ఇంతటి దారుణానికి పాల్పడి ఉండేవారు కాదు. సాయం పేరుతో ఓ ఆడపిల్లకు వలవేయడం, తర్వాత అత్యాచారం చేయడం ఆపై దారుణ మారణకాండకు పూను కోవడం ఒకటి వెంట ఒకటి జరిగాయి. అమ్మాయిని కాల్చివేస్తే ఎవరూ గుర్తుపట్టరన్న పిచ్చినమ్మకంతో ఆమెను అగ్నికి ఆహుతి చేశారు. కానీ ఈ సంఘటనతో జనసమూహం అగ్నిగోళంగా మారింది. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ గర్జించింది. పోలీసులకు కూడా ఇదే సరైన నిర్ణయం అనిపించిందో ఏమో జనం అనుకున్నదే చేశారు. ఫలితం ఎక్కడ దిశను పొట్టన పెట్టుకున్నారో అక్కడే నలుగురు అంతమయ్యారు. తమను నమ్ముకున్న కుటుంబాలను అగాధంలో ముంచి వారివారి వంశాలకు తీరని మచ్చని మిగిల్చి దిక్కులేని చావు చచ్చారు. ఇది వారి కుటుంబాల్లో ఎంత కన్నీరు నింపుతుందో ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఈ దిశగా అడుగులు వేసేవారు కాదేమో.

మార్పు రావాలి

సామాజిక మాధ్యమాలను పరిశీలించినా, మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూస్తున్నా యువతలో నేర ప్రవృత్తి నానాటికి పెరుగుతున్నది సత్యం. దిశ హత్యోదంతాన్ని తీసుకున్న హత్యానంతరం సామాజిక మాధ్యమాల్లో కొందరు యువకులు ఆమె గురించి రాసిన తప్పుడు రాతలను చూసినా, ఇంత ఘోరమైన సంఘటన వేడిచల్లారక ముందే పలుచోట్ల ఆడపిల్లలపై జరిగిన దాడులు, వేధింపులు, అత్యాచారాలు, హత్యోందాలను చూసినా యువతలో నేర ప్రవృత్తి ఎంతగా పెరుగుతుందో స్పష్టమవుతుంది. అయితే రోజురోజుకు చట్టాలు కఠినతరమవుతున్నాయి. జనాల్లో చైతన్యం కనిపిస్తోంది. దిశ హత్య తర్వాత నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని మూకుమ్మడిగా చేసిన డిమాండ్లను చూసినా ఎన్‌కౌంటర్‌ తర్వాత జనాల నుంచి పోలీసులకు మద్ధతుగా వచ్చిన స్పందనను చూసినా ఎలాంటి మార్పులు వస్తున్నాయో స్పష్టమవుతుంది.


ఆ కుటుంబానికి సత్వర న్యాయం జరిగింది
- ప్రభాకర్‌రావు, ఛైర్మన్‌, రావూస్‌ విద్యాసంస్థలు

దిశ కుటుంబానికి సత్వర న్యాయం జరిగింది. కూతురిని కోల్పోవడం ఆ కుటుంబానికి తీరని లోటనైనప్పటికీ.. నిందితుల ఎన్‌కౌంటర్‌తో కొంత న్యాయం జరిగింది. అదే సమయంలో సమాజంలో విలువలు పెంపొందించేందుకు కూడా సరైన కృషి జరగాలి. ఇటువంటి ఉదంతాలు పునరావృతం కాకుండా చట్టాలలో మార్పు తీసుకురావాలి.   తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి వచ్చినప్పుడే  మహిళలు, బాలికలు, యువతులకు సరైన రక్షణ లభించినట్లవుతుంది.


ఇది కొత్త మలుపు..  ఇదే మేలు కొలుపు
నిందితుల కాల్చివేతపై జనం మనోగతం
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన నేపథ్యంలో అక్కడికి చేరిన జనం తమ అభిప్రాయాల్లో మూకుమ్మడిగా ఈ సంఘటనను అభినందించారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
న్యూస్‌టుడే, షాద్‌నగర్‌ బృందం


ఇలాంటి శిక్షలు అవసరమే
- ఎండీ. సలీమొద్దీన్‌, వ్యాపారి, షాద్‌నగర్‌

నేరప్రవుత్తి నేటి యువతలో విపరీతంగా పెరిగిపోతుంది. ఆడపిల్లలంటే కనీస మర్యాద కరవైంది. ఆడపిల్లలపై ఇలా అత్యంత దారుణంగా వ్యవహరించే వ్యక్తుల విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం సరైంది. యువతలో మార్పు రావాలంటే ఇలాంటి శిక్షలు అమలు చేయడమే సరైన నిర్ణయం.


చట్టాలు సవరించాలి
- రజనీకులకర్ణి,  రచయిత, హైదరాబాద్‌

దిశ సంఘటన విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం సరైందే. కానీ ఎప్పుడో ఒకసారి ఇలా స్పందించడం కాకుండా ఆడపిల్లల విషయంలో నేరం జరిగినప్పుడల్లా ఇలాగే స్పందించాలి. ఆడపిల్లల పట్ల నేరాలకు పాల్పడితే శిక్షలు ఇలా కఠినంగా ఉంటాయని నేరస్థులకు తెలిసేలా చేయగలిగితేనే భవిష్యత్‌లో ఆడపిల్లలపై దాడులు తగ్గుతాయి.


స్వాగతిస్తున్నాం.: నరేందర్‌, వ్యాపారి, షాద్‌నగర్‌

ఎన్‌కౌంటర్‌ విషయంలో పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఆడపిల్లలను గౌరవించుకోవాల్సిన మన దేశంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం. ఇలాంటి శిక్షలు అమలు చేయడం ద్వారా కొంతైనా ఆడపిల్లలపై దాడులు తగ్గుతాయన్న నమ్మకం ఉంది. సీపీ సజ్జనార్‌కు, తెలంగాణ పోలీసులకు అభినందనలు.


ఇకనైనా స్పందించాలి
- ఫాతిమా, సామాజిక కార్యకర్త, హైదరాబాద్‌

దిశకు జరిగిన అన్యాయం సామాన్యమైనది కాదు. ఈ విషయంలో పోలీసులు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. కానీ సంఘటనలు జరిగిన తర్వాత ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కన్నా అసలు సంఘటనలే జరగకుండా పోలీసులు అప్రమత్తం కావాలి. దిల్లీ స్థాయిలో మహిళా రక్షణ దిశగా చట్టాల తీరుతెన్ను మారాలి.


భయపడాలి: ఎండీ. సలీం, ఉద్యోగి, షాద్‌నగర్‌

మన కుటుంబాల్లో కూడా ఆడపిల్లలు ఉన్నారనే సంగతి మరిచిపోయి నీచాతి నీచంగా ఆడపిల్లలను హతమార్చే ఇలాంటి వ్యక్తులకు ఇది సరైన శిక్ష. ఇక ముందు కూడా పోలీసులు ఇలాగే వ్యవహరించాలి. పోలీసుల పేరు చెబితేనే నేరస్థులు భయపడేలా చట్టంలో మార్పులు రావాలి. అప్పుడే ఆడపిల్లలకు పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుంది.


తొలి నుంచి..:  లక్ష్మణ్‌కుమార్‌, యువసత్తాయూత్‌ అధ్యక్షుడు, షాద్‌నగర్‌

నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలని మేము తొలిరోజు నుంచే డిమాండ్‌ చేస్తున్నాం. ఇప్పటికీ పోలీసులు నిర్ణయం తీసుకోవడం మాకు సంతోషాన్ని కల్గిస్తుంది. వారు చేసింది ఏమాత్రం తప్పుకాదు. దిశకు నూటికి నూరుశాతం న్యాయం జరిగిందని భావిస్తున్నాను.


చట్టాలను మార్చాలి..
దిశ సంఘటనపై ప్రముఖుల అభిప్రాయాలు

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: పాతకాలపు చట్టాలి మారాలి.. న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయాలి.. తప్పు చేసిన వారిలో పేద, ధనిక అని తేడా లేకుండా అందరికీ ఒకేరకమైన శిక్షను అమలుచేయాలి.. వేసే శిక్షను త్వరితగతిన వేయాలి.. ఇదే విధానం దేశమంతా రావాలి.. ఇప్పుడు చాలా మంది ప్రముఖులు ఇవే అభిప్రాయాలను వ్యక్త పరుస్తున్నారు. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన దిశ సంఘటనపై పలువురు ప్రముఖులు ఏమంటున్నారంటే..

వ్యవస్థ తీరులో మార్పు రావాలి.
పి. చొక్కారావు, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆల్‌ ఇండియా కన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ది బ్లైండ్‌

వ్యవస్థ తీరులో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే న్యాయం ఆలస్యమవుతుందో ప్రజలు ఇలాంటి తీర్పులనే కోరుకుంటారు. ఈ తీర్పును వంద శాతం సమర్థిస్తున్నాను. ఎవరైనా మనల్ని కొడితే తిరిగి కొట్టాలని నమ్ముతాను. చట్టం, న్యాయం అంటే అది ఆలస్యమవుతుంది. పారిపోయేందుకు ప్రయత్నించిన నలుగురిని పోలీసులు హతమార్చడం దిశకు నిజమైన నివాళిగా భావిస్తున్నాను. నిందితులను కాల్చిన ఆ తుపాకిని మొక్కాలని ఉంది. కఠినమైన, త్వరితగతిన న్యాయం చేసే చట్టాలను అందుబాటులోకి తీసుకురావాలి.


ఈ నిర్ణయాన్ని దేశమంతా అనుసరించాలి
దానం నాగేందర్‌, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే

నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చినా ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. నిర్భయ కేసులో నిందితులు జైలులో ఉన్నారు. వారికి ఎలాంటి శిక్ష పడలేదు. ఇలా ఉంటే నేరం చేసిన వారికి భయం ఎక్కడ ఉంటుంది. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు పెట్టినా ఫలితం ఉండదు. నేరానికి తగిన శిక్ష వెంటనే పడాలి. దిశ సంఘటనలో ఇదే జరిగిందని భావిస్తున్నాను. నేరస్థులకు తగిన శిక్ష పడింది.


తప్పు చేస్తే శిక్ష తప్పదని మరోసారి రుజువైంది
ఎం.హేమలత, ప్రిన్సిపల్‌, శ్రీ విద్యాంజలి ఉన్నత పాఠశాల

తప్పు చేస్తే శిక్ష తప్పదని మరోసారి దిశ హత్యాచార కేసులో నిరూపితమైంది. న్యాయం జరగాలన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో నిందితుల ఎన్‌కౌంటర్‌ కొంత ఊరటనిచ్చింది. సత్వర న్యాయాన్ని, ఆ కుటుంబానికి,దిశ ఆత్మకు శాంతిని చేకూర్చిందని చెప్పొచ్చు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు కూడా అవసరమని భావించాల్సిన తరుణం ఇదే.


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.