close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

కన్నపేగు భయపడుతోంది..!

మహానగరంలో తల్లిదండ్రులపై దిశ ఘటన ప్రభావం
ఆడపిల్లలను ఒంటరిగా పంపేందుకు వెనుకంజ

ఇతర ప్రాంతం నుంచి ఇరవైఏళ్ల యువతి నగరంలోని ఓ ఇంట్లో పనిమనిషిగా కుదిరింది. రెండుమూడ్రోజుల క్రితం పనిలో చేరేందుకు వచ్చిన ఆ యువతికి సదరు కుటుంబసభ్యులు రెండు నెలల జీతం చేతికిచ్చి.. నీకు రక్షణ కల్పించే పరిస్థితిలో మేము లేమంటూ ఆమెను భద్రంగా సొంతూరు చేర్చారు. ఓ ప్రభుత్వ ఉద్యోగికి ఎదురైన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు.

ఈనాడు, హైదరాబాద్‌

కళాశాలకు వెళ్లిన కుమార్తె ఇల్లు చేరే వరకూ తల్లి మనసు తల్లడిల్లుతోంది. ఉద్యోగం చేసే బిడ్డ క్షేమంగా తిరిగిరావాలంటూ తండ్రి గుండె పరితపిస్తోంది. ఇంటికి రావటం కాస్త ఆలస్యమైనా ఆందోళన చెందాల్సిన దుస్థితి ఏర్పడింది. దిశపై జరిగిన దారుణఘటన కన్నవారిని కలవరపాటుకు గురిచేస్తోంది. ఎటువైపు నుంచి ఏ ప్రమాదం పొంచివుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్నిచోట్ల ఉద్యోగాలు చేసే యువతులను స్వయంగా తండ్రి/సోదరులు కార్యాలయాలకు చేర్చే బాధ్యతలు తీసుకున్నారు. సున్నితమైన తల్లిదండ్రులు అయితే దూరప్రాంతాల్లోని కూతుళ్లను ఇంటికి రప్పిస్తున్నారు. అమీర్‌పేట్‌లోని ఓ వసతిగృహంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగం నిమిత్తం శిక్షణ పొందుతున్న నలుగురు విద్యార్థినులు రెండ్రోజుల క్రితం వసతి గృహం ఖాళీ చేసి సొంతూరు చేరినట్టు సమాచారం. వసతిగృహ నిర్వాహకులు మాత్రం గ్రామంలో ఏదో కార్యక్రమం ఉండటం వల్ల వెళ్లారని చెప్పటం విశేషం. దిశ వంటి దారుణమైన ఘటనలు ఆడపిల్లలు, తల్లిదండ్రులను కొద్దిమేర భయాందోళనకు గురిచేస్తుందనేది వాస్తవమేనని మనస్తత్వనిపుణులు తెలిపారు.

మెహిదీపట్నం నుంచి గచ్చిబౌలి వరకూ ఒంటరిగా ఉద్యోగానికి వెళ్లే కూమార్తెను నాలుగు రోజులుగా తండ్రే ఆమెను కార్యాలయం వద్ద వదిలేస్తున్నాడు. రాత్రి సమయంలో కాస్త ఇబ్బంది అనిపించినా తానే స్వయంగా వెళ్లి తీసుకొస్తున్నాడు. ఏడాదిన్నరగా కార్పొరేట్‌ సంస్థలో పనిచేస్తున్న కుమార్తె పెళ్లిని కొద్దికాలం నుంచి వాయిదా వేసిన ఆ తండ్రి ఇప్పుడు వరుడు వెతుకులాటను వేగవంతం చేశాడని ఆయన బంధువులు తెలిపారు.

అశ్లీల దృశ్యాల ప్రభావంతోనే
మహిళలు/యువతులను వేధించే ఆకతాయిలను షీ టీమ్స్‌ పట్టుకున్నాక వారికి భరోసా కేంద్రంలో కౌన్సెలింగ్‌ ఇస్తారు. వీరిలో 70 శాతం 18 ఏళ్లలోపు వారే ఉంటున్నారు. పసితనంలోనే అలవడిన చెడు అలవాట్లు.. చేతిలో స్మార్ట్‌ఫోన్లలో ప్రత్యక్షమయ్యే అశ్లీలదృశ్యాలు.. యుక్తవయసులోనే నేరస్థులను తయారు చేస్తున్నాయంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఉచితంగా వైఫై అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని పిల్లల్లో అధికశాతం చదువు మధ్యలో మానేసినవారు, బాలకార్మికులే ఉంటున్నట్టు ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో గుర్తించారు. అశ్లీల దృశ్యాలు(పోర్న్‌సైట్స్‌) ప్రభావం పిల్లల మనసుల్లో దురాలోచనలకు కారణమవుతోంది. పిల్లల్లో లైంగిక ఆలోచనలపై పుణెలో ఓ అధ్యయనం ప్రారంభించారు. యూరోపియన్‌ సైకాలజిస్టుల సహకారంతో ఓ ఆసుపత్రిలో దీనిపై పరిశోధనలు ప్రారంభించారు. సుమారు 205 మంది పిల్లల్లో లైంగిక ఆలోచనలు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. వారికి కౌన్సెలింగ్‌, వైద్యచికిత్స ఇప్పించటం ద్వారా సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని డాక్టర్‌ శైలజ విస్సంశెట్టి వివరించారు.

భయం వీడాలి.. ధైర్యంగా సాగాలి
దిశపై జరిగిన దారుణం యావత్‌ సమాజాన్ని కదిలించింది. ఢిల్లీ నిర్భయ ఘటన తరువాత కొత్తచట్టాలు తెచ్చినా ఆగడాలను నిలువరించకలేకపోవటాన్ని తీవ్రంగా భావిస్తోంది. ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడే మానవమృగాలను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేపట్టడం దీనిలో భాగమే అంటున్నారు సామాజికవేత్త డాక్టర్‌ మమతా రఘువీర్‌. ఇది కేవలం బావోద్వేగపరమైన అంశంగా మిగలకుండా శాశ్వతపరిష్కారం కోసం ప్రజల నుంచి వస్తున్న స్పందన మార్పు కోరుకుంటున్నారనేందుకు నిదర్శనమని ఆమె చెప్పారు. కీలకమైన సమయంలో తల్లిదండ్రులు ఇచ్చే ధైర్యం.. ఆపదవేళ అందించే భరోసా కొండంత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తాయంటున్నారు. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లల చదువులను మధ్యలో ఆపేయటం, అందుబాటులో ఉన్న సంబంధం చూసి పెళ్లి చేయటంతో భారం దింపుకుందామని కూడా కొందరు తల్లిదండ్రులు భావిస్తున్నారంటూ ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు తెలిపారు. గతేడాది మహానగరంలో సుమారు 160కు పైగా బాల్యవివాహాలను అధికారులు ఆపగలిగారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.