close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

బీజం ఎక్కడ పడుతోంది?

నేర సంస్కృతికి పలు అంశాలు దోహదం
చిన్నప్పటి నుంచే సరిదిద్దాలంటున్న నిపుణులు

దిశ గమనం
యుద్ధంలో సత్యభామ నరకాసురుడిని సంహరించినప్పుడే ‘చెడుపై మంచి సాధించిన విజయం’గా భావిస్తూ.. ఏటా దసర పండగను ఘనంగా జరుపుకుంటున్నాం. దిశ ఘటనలోనూ ప్రజలు కోరుకున్నట్లే మృగాళ్లకు తగిన శిక్ష పడింది. అందుకే ప్రజలంతా బాధితురాలికి, ఆమె కుటుంబ సభ్యులకు న్యాయం జరిగిందంటూ సంబురాలు జరుపుకుంటున్నారు. సత్వర న్యాయం చేసిన పోలీసులకు శతకోటి వందనాలు.

- ఎక్కలదేవి పరమేశ్వర్‌, జాహ్నవి విద్యా సంస్థల ఛైర్మన్‌

 


ఈ భయం చాలా అవసరం.. తెలంగాణ పోలీస్‌కి సెల్యూట్‌. దిశకి న్యాయం జరిగింది.
- దర్శకుడు అనిల్‌ రావిపూడి, - నటుడు విశాల్‌


సరైన న్యాయమే జరిగింది.. దిశ ఆత్మకు శాంతి చేకూరాలి.
- నటుడు నందమూరి తారక రామారావు


ఈనాడు, హైదరాబాద్‌

పుట్టుకతో ఎవరూ నేరస్తులు కాదు. సమాజంలో వికృత పోకడలే ఎవరినైనా నేరాలవైపు అడుగులు వేయిస్తాయనేది నిర్వివాదాంశం. తాజా ఘటన ‘దిశ’ హత్యను పౌర సమాజం తీవ్రంగా ఖండించింది. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో నలుగురు నిందితులు మృతి చెందారు. నిందితులకు తగిన శాస్త్రి జరిగిందని అందరూ ముక్త కంఠంతో అంటున్నా.. ఇక ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే మనిషిలో పెరుగుతున్న నేర ప్రవృత్తికి కళ్లెం పడాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. మొక్కై వంగనిది.. మానై వంగునా..? అన్నట్లు చిన్న తనం నుంచి వ్యక్తిని తీర్చి దిద్దడంలో కుటుంబం, ఉపాధ్యాయులు, సమాజం ప్రముఖ పాత్ర పోషిస్తాయని పేర్కొంటున్నారు.

దారిద్య్రం, నిరక్షరాస్యత..
పేదరికం, ఆకలి, పెరిగే వాతావరణం వారిని చిన్న తనంలోనే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పురికొల్పేలా చేస్తున్నాయి. నగరంలో 2వేల వరకు మురికి వాడలున్నాయి. పొట్ట చేత పట్టుకొని ఎక్కడ నుంచో వచ్చి గుడిసెలు వేసుకొని చిన్న, చితక పనులు చేసుకునే వారే ఎక్కువ. తల్లిదండ్రుల్లో అవిద్య, అవగాహన లేమి కారణాలతో పిల్లను కూడా స్కూళ్లకు పంపడం లేదు. చదువుకు దూరంగా పెరుగుతున్న బాలల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది. బిక్షాటనతో మొదలు పెట్టి, చెత్త సేకరణ నుంచి చిరు దొంగతనాలు, చివరకు పెద్ద నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలి. అలాంటి పిల్లలను గుర్తించి పాఠశాలలకు వెళ్లేలా చూడాలి. ఖాళీగా ఉంటున్న యువతకు వృత్తిపరమైన శిక్షణ ఇప్పించి పని కల్పించడం వల్ల నేరాల వైపు అడుగులు వేయకుండా ఆపొచ్చు.

ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం..
గతంలో ఉమ్మడి కుటుంబాల వల్ల ఇంట్లో పెద్ద వారిని అందరూ గౌరవించేవారు. నగరీకరణ, పట్టణీకరణతో ఆ వ్యవస్థ ధ్వంసమైంది. భార్యభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఆ పిల్లల గురించి పట్టించుకునే వారే లేరు. తల్లిదండ్రులు ఎంత బీజీగా ఉన్నా పిల్లల కోసం సమయం కేటాయించాలని మానసిన నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలు సాధ్యం కాకపోయినా.. పండగ, శుభకార్యాలకు పిల్లలను తీసుకెళ్లి అందర్ని పరిచయం చేయాలి.

సాంకేతికత దుర్వినియోగం..
స్మార్ట్‌ఫోన్లు, అపరిమిత ఇంటర్‌నెట్‌ వినియోగం కూడా చాలామందిలో నేర ప్రవృత్తికి కారణమవుతున్నాయని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. నేరాలు ఎలా చేయాలో కూడా నెట్‌ ద్వారా తెలుసుకుంటారు. విచ్చలవిడిగా ఉన్న పోర్న్‌ సైట్లతో ఉద్రేకం పెంచుకొని నేరాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. టెక్నాలజీ వల్ల మంచి, చెడు రెండూ ఉంటాయి. దానిలో మంచిని గ్రహించి ముందుకు వెళ్లే వారు కొందరైతే.. చెడు మార్గాలను ఎంచుకునే వారే ఎక్కువే. పిల్లల ఫోన్‌ వినియోగంపై తల్లిదండ్రులు కన్నేసి ఉంచాలి.

కౌమారదశలో కౌన్సెలింగ్‌..
కౌమార దశ అనేది చాలా కీలకం. యుక్త వయసు పిల్లలకు చదువుతోపాటు గైడెన్స్‌, కౌన్సిలింగ్‌ అవసరం. ప్రతి పాఠశాలలో కౌన్సిలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పిల్లలకే కాదు.. తల్లిదండ్రులకు సైతం కౌన్సిలింగ్‌ తప్పనిసరి. టీనేజీ సమస్యలు.. తల్లిదండ్రులుగా పిల్లలను అర్థం చేసుకునే తీరును వివరించాలి. ఇతర పిల్లలతో పోలుస్తూ నిందించకూడదు. ఇక్కడే నేర ప్రవృత్తి వైపు అడుగులు వేసే ప్రమాదం ఉంటుంది. అవసరమైతే వారిని సైకాలజిస్ట్‌ వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులూ ఈ బాధ్యత తీసుకోవాలి.

ఒంటరితనం.. దూషణలు
పిల్లల్లో పెరుగుతున్న ఒంటరితనం.. ఇంటి బయటా దూషణలు వారిని నేరాల వైపు అడుగులు వేయిస్తున్నాయి. నువ్వు అందంగా లేవు.. నల్లగా ఉంటావు.. ఇలా తోటి పిల్లలు వెక్కిరించడం లాంటి సంఘటనలతో ఆత్మనూన్యతకు లోనవుతుంటారు. ఇలాంటి పిల్లలు ఇతరులతో కలవడానికి ఇష్టపడరు. ప్రతిదానికి చిరాకు పడుతూ గొడవలకు దిగుతుంటారు. ఇదే ధోరణి కొనసాగితే సులువుగా నేరాల వైపు ఆకర్షితులవుతుంటారు. ఇలాంటి వాటిని మొగ్గలోనే గుర్తించి వారిని సరిదిద్దాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ఎంతో అవసరం.


పోలీసు చర్యను అభినందిస్తున్నాం
ఎన్‌కౌంటర్‌పై కాంగ్రెస్‌ నేతల స్పందన

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై పలువురు కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. పోలీసు చర్యను సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. పోలీసులపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించిన దుండగులను మట్టుపెట్టిన సైబరాబాద్‌ పోలీసు తీరు అభినందనీయమని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఒక ప్రకనటలో తెలిపారు. మానవ మృగాలతో సమాజానికి చాలా ప్రమాదకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మద్యం విక్రయాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని, జాతీయ రహదారులపై మద్యం దుకాణాలు లేకుండా చూడాలని కోరారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం శుభ పరిణామమని, ఇది ప్రజామోదంతో జరిగిన చర్య అని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి మరో ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితులను చంపడమే బాధితురాలి ఆత్మకు నిజమైన ఆత్మశాంతి అన్నారు. సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వ్యవహరించిన తీరు భేష్‌..రాష్ట్రంలోని పోలీసులు ఈ విధంగా ముందుకు వెళ్లితే మహిళలపై దౌర్జన్యాలు ఆగిపోతాయన్నారు. ఈ ఒక్క ఘటనతో సమస్యలు పరిష్కారం కావని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు నేరెళ్ల శారద గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో అన్నారు. హాజీపూర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌ ఘటనలలో నిందితులను కూడా శిక్షించాలన్నారు. ఫిర్యాదు వస్తే స్పందించే డయల్‌ నెంబరు ఏర్పాటు చేయాలని, ఫిర్యాదుదారుతో పోలీసులు మాట్లాడే పద్ధతిలో కూడా మార్పు రావాలన్నారు.


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.