close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

సంచలనం సృష్టించాయ్‌... విచారణ కొన‘సాగు’తోంది..

దిశ గమనం
ఆగ్రహం.. ఆవేశం.. ఉన్మాదం... కిరాతకంగా ఎదుటివారిని చంపడం....  లైంగికదాడులు చేయడం... కిరోసిన్‌ పోసి నిప్పటించడం... కన్నకూతురని చూడకుండా కొబ్బరిబొండాం కత్తితో దాడి చేయడం... కొద్ది నెలల క్రితం నగరంలో సంచలనం సృష్టించిన ఘటనలు... పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసినా కేసుల విచారణ ఇంకా కొనసాగుతోనే ఉంది. ‘దిశ’ హత్యాచారం కేసులో ‘సత్వర’ న్యాయం జరిగినట్టే... తమకూ న్యాయం జరిగుంటే తమ పిల్లలు సంతోషించేవారని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈనాడు,హైదరాబాద్‌, న్యూస్‌టుడే, ఉస్మానియా. యూనివర్సిటీ, లాలాపేట, అమీర్‌పేట, మాదాపూర్‌

ఉరే సరి...
తన కూతురుని చంపిన ప్రేమోన్మాదికి ఉరే సరి అని ఇంటర్‌ విద్యార్థిని అనూష తండ్రి హరిప్రకాష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. 2018 ఆగస్టు 7న ఓయూ ఆర్ట్స్‌ కళాశాల రైల్వేస్టేషన్‌ దగ్గరలోని పాడుబడ్డ బిల్డింగ్‌లో తన ప్రేమను అంగీకరించలేదని అనూష(16)ను ఆరెపల్లి వెంకటేశ్‌(19) బ్లేడుతో గొంతు కోసి హత్య చేశాడు. వెంకటేష్‌ను ఘటనా స్థలంలోనే పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఏడాది దాటినా.. ప్రేమోన్మాది వెంకటేష్‌కు శిక్ష పడలేదు. దుర్మార్గుడికి మరణశిక్ష అమలు చేసిన నాడే మా అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది. మాకు కొంత ఉరట లభిస్తుంది. ఎప్పుడు తీర్పు వస్తుందని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం. ఇలాంటి కేసులలో సత్వర న్యాయం అదించాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో  మరో నెలరోజుల్లో తుదితీర్పు వచ్చే అవకాశం ఉందని ఓయూ ఎస్‌ఐ నర్సింగ్‌రావు తెలిపారు.

జైల్లో చిప్పకూడు తింటున్నారు...
ఆరేళ్ల క్రితం మాదాపూర్‌లోని ఓ మాల్‌లో షాపింగ్‌ పూర్తి చేసుకొని హాస్టల్‌కు వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డుపై వేచిఉంది 22ఏళ్ల మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు(పేరు అభయగా మార్చిన పోలీసులు). అటుగా వచ్చిన కారు ఆమె వద్దకు వచ్చి ఆగింది. కారులో ఉన్న డ్రైవర్‌.. ఎక్కడి వెళ్లాలంటూ ఆమెను ప్రశ్నించడంతో గౌలిదొడ్డిలోని హాస్టల్‌కు వెళ్లాలని ఆమె చెప్పింది. రూ.40 ఇస్తే దింపేస్తానంటూ నమ్మించడంతో క్యాబ్‌ అనుకొని అతని మాటలు నమ్మి ఆమె కారు ఎక్కింది. కారు డ్రైవర్‌తోపాటు అతని స్నేహితుడు సైతం కారులో ఉండగా అతను తోటి ప్రయాణికుడిగా భావించింది. గౌలిదొడ్డికి వెళ్లే మార్గంలో ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్దకు రాగానే డ్రైవర్‌ కారును దారిమళ్లించాడు. దీంతో అనుమానం వచ్చిన ఆమె ఇటు ఎక్కడికి తీసుకెళ్తున్నావంటూ ప్రశ్నించగా తాను దారి తప్పానని, యూటర్న్‌ తీసుకొని వెనక్కి తీసుకెళ్తానంటూ మాయమాటలు చెప్పాడు. అనంతరం కొద్ది దూరం ముందుకెళ్లిన తర్వాత.. అనుమానం వచ్చిన ఆమె గట్టిగా కేకలు వేయడంతో కారులో ఉన్న ఇద్దరు ఆమె ఫోన్‌ లాక్కొని అరవకుండా దాడి చేశారు. నిర్జన ప్రదేశంలో కారును పార్క్‌ చేసి డ్రైవర్‌తోపాటు అతని స్నేహితుడు ఆమెపై అత్యాచారం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని పరిశోధన ప్రారంభించారు. పీజేఆర్‌నగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ వి.సతీష్‌(30), అతని స్నేహితుడు ఎన్‌.వెంకటేశ్వర్లు(28)లను అరెస్ట్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఆరు నెలల పాటు సాగిన విచారణ అనంతరం నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితులు ప్రసుత్తం చర్లపల్లి కేంద్ర కారాగారంలో జైలుశిక్ష అనుభవిస్తున్నారు.


ప్రేమ జంటపై...

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి తండ్రి కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసిన సంచలన ఘటన కేసు ఏడాదైనా ఇంకా తేలనేలేదు. ఎర్రగడ్డ ప్రేమ్‌నగర్‌కు చెందిన సందీప్‌(21), బోరబండ రాజ్‌నగర్‌కు చెందిన మాధవి(20)లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మాధవి తండ్రి మనోహరచారి వీరి ప్రేమను వ్యతిరేకించాడు. 2018 సెప్టెంబరు 19న స్కూటీపై వెళుతున్న కూతురు మాధవి, సందీప్‌లపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేశాడు. మాధవి మెడ, దవడ పూర్తిగా తెగిపోవడంతోపాటు ఎడమ చేయి మణికట్టు నుంచి తెగిపోయింది. వెళ్లి పంజాగుట్ట పోలీసులకు లొంగిపోయాడు. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ప్రస్తుతం అత్తింట్లోనే ఉంటున్న మాధవి బ్యాంకు పరీక్షల కోసం సిద్ధమవుతోంది.


దుర్మార్గుడు మా కళ్లముందే తిరుగుతున్నాడు..
‘‘నా పేరు సావిత్రి, మేము లాలాపేటలో నివాసముంటున్నాం. మా కూతురు సంధ్యారాణిపై 2017 డిసెంబరు 21న ప్రేమోన్మాది కార్తీక్‌ చేతిలో కిరోసిన్‌ దాడికి గురై చికిత్స పొందుతూ మరుసటి రోజు చనిపోయింది. అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. కానీ అతడు ఇప్పుడు మా కళ్ల ముందే తిరుగుతున్నాడు. నా బిడ్డే దూరమైంది. తను ఉన్నప్పుడు మా కుటుంబాన్ని తానే పోషించేది. మగ పిల్లలు ఉన్నా ఆరోగ్య సమస్యలతో ఉన్నారు. తను పోయిన నాటి నుంచి మా పరిస్థితి దారుణమైంది. పరిసర ప్రాంతాల్లో ఉండలేక మా ఇల్లు ఖాళీ చేశాం. కిరోసిన్‌ దాడిలో తీవ్రంగా గాయపడి నా బిడ్డ అనుభవించిన నరకం ఇప్పటికి నా కళ్ల ముందు కనిపిస్తోంది. దాన్ని గుర్తుకు చేసుకుంటే చాలా బాధ కలుగుతోంది. కారణమైన వాడు నెల, రెండు నెలల్లో జైలు నుంచి బయటకు వచ్చాడు. కుటుంబ సభ్యులతోనే ఉంటున్నాడు. నా బిడ్డను మాత్రం మాకు కాకుండా దూరం చేశాడు. రెండేళ్లు అవుతున్నా అతనికి శిక్ష పడలేదు. మహిళలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలి.’’

నగరంలో ఎన్‌కౌంటర్లు..
ఈనాడు-హైదరాబాద్‌: ‘దిశ’ హత్యోదంతం.. నిందితులు ఎన్‌కౌంటర్‌.. కేవలం పదిరోజుల్లో వ్యవధిలోనే జరిగాయి. గతంలోనూ నగరంలో ఇలాంటి సంచలన ఘటనలు చోటుచేసుకున్నాయి. పదకొండేళ్ల క్రితం మాఫియా డాన్‌ చోటా రాజన్‌ అనుచరుడు అజీజ్‌ రెడ్డి అలియాస్‌ కాకులవరపు వెంకట్‌ రెడ్డిని హైదరాబాద్‌ పోలీసులు పట్టుకునేందుకు యత్నించారు. జూబ్లీహిల్స్‌లో అతడు ఓ ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకొని వెళ్లగా.. బయటకు వచ్చిన అజీజ్‌రెడ్డి.. తప్పించుకునే క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. ఎదురు కాల్పుల్లో అతడు హతమయ్యాడు. మాఫియా డాన్‌ చోటారాజన్‌ అనుచరుడిగా నగరంలోని ప్రముఖులను బెదిరించి డబ్బులు వసూలు, విదేశాల నుంచి అక్రమంగా ఆయుధాలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తుండేవాడు. ఇతడిపై రెండు హత్యకేసులతో సహా మొత్తం 21 కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

గొలుసు దొంగ శివ...
ఇరవై ఏడేళ్ల వయసులోనే వందల సంఖ్యలో దొంగతనాలు, గొలుసులను తస్కరించిన కడలూరి శివ అలియాస్‌ శివ అనే చెయిన్‌ స్నాచర్‌ పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణించాడు. ఈ సంఘటన ఐదున్నరేళ్ల క్రితం చోటుచేసుకుంది. హైదరాబాద్‌, ఉమ్మడి మెదక్‌ జిల్లాల్లో పలు దొంగతనాలు చేసిన శివ పోలీసులను తప్పించుకొనే క్రమంలో నార్సింగిలో తానుంటున్న ఇంటి నుంచి బయటకు వచ్చాడు. పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. శంషాబాద్‌ వైపు పరుగెత్తాడు. శంషాబాద్‌ సమీపంలో పోలీసులు చుట్టుముట్టడంతో భయపడి తనవద్దనున్న రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. పోలీసులకు గాయాలవడంతో ఆత్మరక్షణ నిమిత్తం వారు జరిపిన ఎదురు కాల్పుల్లో శివ మృతి చెందాడు. ఇతడిపై 700కు పైగా గొలుసు దొంగతనాల కేసులున్నాయని పోలీసు అధికారులు అప్పట్లో వెల్లడించారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా.. రూ.30లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సామగ్రి, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


అదే దూరం.. అంతే సమయం..!
రెండు ఘటనలు 400 మీటర్ల దూరంలోనే..

ఈనాడు, హైదరాబాద్‌:  సామూహిక అత్యాచారానికి పాల్పడి అత్యంత కిరాతకంగా యువ వైద్యురాలు దిశను 30 నుంచి 40 నిమిషాల్లో చంపేశారా నిందితులు... ఆ కీచకులే శుక్రవారం షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లిలో ఉదయం 5.45 గంటల నుంచి 6.15 గంటల మధ్యలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు. యాదృచ్ఛికంగానే జరిగినప్పటికీ 30 నిమిషాల్లోనే ఈ కిరాతకుల కథ ముగియడం గమనార్హం.

* ఈ నెల 27న తొండుపల్లి ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ దగ్గర పక్కా ప్రణాళికతో నలుగురు నిందితులు స్కూటీని తీసుకునేందుకు రాత్రి 9 గంటల తర్వాత అక్కడికొచ్చిన దిశను అపహరించి లారీని అడ్డుగా పెట్టి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ముక్కు, నోరు మూసి అత్యంత పాశవికంగా హత్య చేసి మృతదేహాన్ని లారీలోకి ఎక్కించారు. 30 నుంచి 40 నిమిషాల స్వల్ప కాలంలోనే ఇదంతా చేశారంటూ ఈ నెల 29న నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ వెల్లడించారు. శుక్రవారం ఉదయం 5.45 గంటల నుంచి 6.15 గంటల వరకు జరిగిన ఘటనలో నలుగురు నిందితులు మృతి చెందడం గమనార్హం.

* ఆర్జీఐఏ ఠాణా పరిధి కిషన్‌గూడ ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ ప్రారంభం వరకు ఉంటుంది. ఆ పక్కనే సుమారు 400మీటర్ల దూరంలో దిశ హత్యోదంతం చోటుచేసుకున్న తొండుపల్లి జంక్షన్‌ శంషాబాద్‌ గ్రామీణ పోలీస్టేషన్‌ పరిధిలోకి వస్తోంది. మా పరిధిలోకి రాదంటూ రెండు పోలీస్టేషన్లలో సిబ్బంది తమ ఫిర్యాదు తీసుకోలేదంటూ దిశ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ 400 మీటర్ల దూరాన్ని పక్కన పెట్టి ఎవరో ఒకరు అప్రమత్తమై ఉంటే కనీసం దిశ ప్రాణాలైనా దక్కేవంటూ వాపోయారు. అయితే.. దిశ మృతదేహాన్ని కాల్చిన ఘటనాస్థలి నుంచి 400 మీటర్ల దూరంలోనే నిందితులు ఎదురుకాల్పుల్లో మృతి చెందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


 

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.