close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

ఆ రెండు ప్రదేశాలు.. దిశ మూగరోదనకు సాక్ష్యాలు

తొండుపల్లి వద్ద ఖాళీ స్థలం చదును
పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసి నిఘా
దిశను కాల్చేసిన ప్రాంతంలో పూలతో నివాళి

దిశ గమనం
తొండుపల్లి ప్లాజా వద్ద నిర్జన ప్రదేశం..
చటాన్‌పల్లి వంతెన కింద ప్రాంతం..
దిశను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి.. దహనం చేసిన ప్రదేశాలివి..
ఓ ఘోరానికి సజీవసాక్ష్యంగా నిలిచి.. మౌనంగా రోదిస్తున్నాయి. దిశ హత్యకేసు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాల్లో పరిస్థితులు  కీలకంగా మారాయి.

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, శంషాబాద్‌ గ్రామీణం

దిశ ఘటనకు ముందు తొండుపల్లి ఔటర్‌ టోల్‌ ప్లాజా ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేది. ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లాట్‌కు చుట్టూ ప్రహరీ నిర్మించారు. కొంతకాలం కిందట ఈ స్థలం చుట్టూ ఉన్న గోడ కొంతమేర కూలిపోయింది. ఇక్కడి నుంచి ఖాళీ ప్రదేశంలోకి ప్రవేశించి కొందరు ఇష్టారాజ్యంగా ప్రవర్తిసుండేవారు. సమీపంలోనే కల్లు దుకాణం ఉండటంతో.. కొందరు ట్రక్కు డ్రైవర్లు వాహనాలను అక్కడే నిలిపి ఖాళీప్రదేశంలో మద్యం తాగుతూ రెచ్చిపోతుండేవారు. హిజ్రాలు తిష్ఠవేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు. స్థానికులు లేదా ఈ ప్రదేశం గురించి తెలిసిన వారు చీకటి పడిన తర్వాత అటుగా వెళ్లేందుకు జంకేవారు. అక్కడి పరిస్థితుల గురించి తెలియని దిశ.. గత నెల 27న తన ద్విచక్రవాహనాన్ని అక్కడే ఉంచింది. ఈ నేపథ్యంలో నలుగురు కిరాతకుల చేతుల్లో అత్యంత దారుణంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన తర్వాత ఉలిక్కిపడిన సైబరాబాద్‌ పోలీసులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. సగం కూలిన ప్రహరీని పూర్తిగా కూల్చివేశారు. ఆ ప్రాంతాన్ని చదును చేసి పని చేయని సీసీ కెమెరాల స్థానంలో కొత్తవి బిగించారు. తొండుపల్లి టోల్‌ ప్లాజా ప్రాంతాన్ని నిఘా నీడలోకి తీసుకొచ్చారు. పోలీసు పికెట్‌ ఏర్పాటు చేసి అక్కడ వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

వంతెన కింద నిర్మానుష్య ప్రదేశం
దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేశాక.. తొండుపల్లి ప్లాజా నుంచి 28 కి.మీల దూరంలో ఉన్న షాద్‌నగర్‌ శివారులోని చటాన్‌పల్లి వంతెన కింద దహనం చేశారు. ఇది పూర్తిగా నిర్మానుష్యంగా ఉండే ప్రదేశం. చటాన్‌పల్లి, షాద్‌నగర్‌, ఇతర ప్రాంతాల వారు పొలాలకు వెళ్లేందుకు ఈ మార్గాన్ని వినియోగిస్తుంటారు. సాయంత్రమైతే చాలు ఈ ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా మారి.. చిమ్మచీకట్లు కమ్ముకొని భయానకంగా ఉంటుంది.

చిత్రపటం ఉంచి నివాళులు..
ఘటన జరిగిన తర్వాత తొండుపల్లి ప్లాజా పక్కన బహిరంగ ప్రదేశంలో కొందరు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. దిశ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి సంతాపం తెలియజేస్తున్నారు. నిత్యం అటుగా వెళ్లే వారు.. ఆ ప్రదేశంపై చర్చించుకుంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చటాన్‌పల్లి వంతెన కింద యువతిని దహనం చేసిన ప్రదేశంలో రెండు రోజులుగా కొందరు పూలు చల్లి నివాళులర్పిస్తున్నారు.


ఒక్కో శవానికి ఒక్కొక్కరు..!

షాద్‌నగర్‌ పట్టణం: దిశ హత్యోదంతంలో నిందితుల శవ పరీక్షలను మొదటి రోజే పూర్తి చేసేలా పోలీసులు ప్రత్యేక కార్యాచరణను రూపొందించి అమలు చేశారు. ఘటనాస్థలిలో కీలకమైన శవ పంచనామాను మధ్యాహ్నం 2 గంటల వరకు పూర్తి చేశారు. సాధారణంగా ఒక్కోమృతదేహానికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటే సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఈ లెక్కన చూస్తే ఒక్కరే చేస్తే 8 గంటలకు పైగా పట్టే అవకాశముంది. శవ పరీక్షలను సాయంత్రం 5 గంటలలోపే చేయాల్సి ఉండటం, ఆలస్యమైతే మరో రోజు నిరీక్షించాల్సి వస్తుంది. ఆలోపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేందుకు అవకాశాలుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే షాద్‌నగర్‌ ఆర్డీఓ కృష్టను అప్రమత్తం చేసి వాస్తవ పరిస్థితిని వివరించారు. ఆయన షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన తహసీల్దార్లను ఘటనాస్థలికి పంపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మహ్మద్‌ ఆరిఫ్‌ ఫరూఖ్‌నగర్‌ తహసీల్దార్‌ పాండునాయక్‌, శివకు నందిగామ తహసీల్దార్‌ హైదర్‌అలీ, నవీన్‌కు కొందుర్గు శ్రీకాంత్‌రెడ్డి, చెన్నకేశవులుకు చౌదరగూడ రాములు సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు.


పచ్చటి పొలాల్లో తూటాల మోత!

ఈనాడు, హైదరాబాద్‌: చుట్టూ పచ్చటి పొలాలు. ఏడాది పొడవునా పండే పంటలు. భూమిని నమ్ముకుని బతికే ఎన్నో కుటుంబాలు. నిత్యం ఆ మార్గంలో వెళ్లే వాహనాల రణగొణధ్వనులు.. అక్కడి పొలాల్లో పనిచేసే రైతులకు సర్వసాధారణం. అటువంటి ప్రశాంతమైన ప్రదేశంలో తూటాల శబ్దం ఉలిక్కిపాటుకు గురిచేసింది. షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి పంట పొలాల్లో దిశ కేసులో నిందితులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఇవేమీ తెలియని సమీపంలోని చటాన్‌పల్లి రైతులు, కూలీలు పొలాలకు బయల్దేరారు. అప్పటికే అక్కడకు పెద్దఎత్తున చేరిన జనం. చక్కర్లు కొడుతున్న పోలీసు వాహనాలు. ఉరుకులు పరుగులు పెడుతున్న పోలీసు అధికారులు. తుపాకులు చేతబట్టి పహారా కాస్తున్న పోలీసు బలగాలు. చాలా సమయం వరకూ ఏం జరిగిందో అర్థంకాని అయోమయం నెలకొంది. ఆ మార్గంలో వచ్చే వాహనాలను నిలిపివేశారు. కొందరు రైతులను పొలాల్లోకి వెళ్లకుండా మధ్యలోనే పక్కకు మళ్లించారు. అప్పటికీ కానీ అసలు సంగతి తెలియలేదు. నిత్యం ప్రశాంతంగా ఉండే పొలాల్లో జరిగిన ఎదురుకాల్పుల విషయం అప్పటికి కానీ తెలియలేదు. టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం అందుకున్న చుట్టుపక్కల ప్రజలు, హైదరాబాద్‌, రంగారెడ్డి తదితర ప్రాంతాలకు చెందిన యువకులు భారీగా అక్కడకు చేరారు. దిశపై హత్యాచారానికి పాల్పడిన నిందితులు పోలీసుల చేతిలో హతమైనట్టు తెలుసుకుని హర్షాతిరేకం వ్యక్తం చేశారు.


ఎన్‌కౌంటర్‌ వార్త చూసి సంతోషించా
- డాక్టర్‌ ఎం.ఆశారాణి, పశువైద్యురాలు, ప్రజ్ఞాపూర్‌, సిద్దిపేట జిల్లా

మా ఇద్దరిదీ ఒకే బ్యాచ్‌. దిశ చాలా మంచి అమ్మాయి. తనపని తాను చేసుకోవడం మినహా ఇతరుల గురించి పెద్దగా పట్టించుకోదు. ఎవరికైనా కష్టం ఉంటేమాత్రం సహాయం చేసేది. దిశను హత్యచేసిన తీరు తీవ్రంగా కలచివేసింది. కారకులను కఠినంగా శిక్షించాలని అందరిలాగే నేనూ కోరుకున్నాను. ఎన్‌కౌంటర్‌ అయ్యారనే వార్త వినగానే ఎంతో సంతోషించాను.


దిశ కుటుంబానికి ఉపశమనం
- ఎండీ డాక్టర్‌ జిషాన్‌అలీ, పశు వైద్యులు, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌

ప్రస్తుతం ఆమె పనిచేసే సమీప మండలంలోనే పనిచేస్తున్నా. దిశను అత్యంత కిరాతకంగా హత్యచేయడం దారుణం. వారి కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం. అలాంటి కష్టం ఎవరికీ రాకూడదని ప్రార్థిస్తున్నా. అయితే పోలీసులు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం వారి కుటుంబానికి కాస్త ఉపశమనం కలిగిందని భావిస్తున్నా. ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడరు.


ప్రజల పోరాటానికి ఫలితం దక్కింది
- కె.శ్రీధర్‌, రాష్ట్ర అధ్యక్షులు, వెటర్నరీ గ్రాడ్యుయేట్్స అసోసియేషన్‌

మాతో పాటు చదువుకున్న అమ్మాయికి ఇలాంటి దుస్థితి రావడం తీవ్ర ఆవేదనకు గురయ్యాం. ఆమె హత్య వెలుగు చూసినప్పటి నుంచి రాజేంద్రనగర్‌ వెటర్నరీ, ఉద్యాన, వ్యవసాయ విద్యార్థులంతా కలిసికట్టుగా పోరాటం చేశాం. దిశను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని దేశవ్యాప్తంగా విద్యార్థులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం ద్వారా ప్రజల పోరాటం ఫలించింది.


దిశ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి
- ఎం.సురేశ్‌, బీవీఎస్సీ, చివరి సంవత్సరం

దిశకు న్యాయం జరిగిందని భావిస్తున్నా. అయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడే ఏదో రకంగా చర్యలు తీసుకొని తాత్కాలికంగా ఉపశమనం కలిగించడం సరికాదు. రాష్ట్రంలో ఎంతోమంది మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారు. అలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం సరైన చట్టాలను రూపొందించాలి. దిశకు జరిగిన అన్యాయం భవిష్యత్తులో మరే ఆడపిల్లకు జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.


మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.