close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

దిశ దశ

మగ పిల్లలకు విలువల్ని బోధించాలి

గాంధీజీ కోరుకున్నట్లు అర్ధరాత్రి ఆడపిల్లలు ఒంటరిగా బయటకు వెళ్లగలిగిన నాడే నిజమైన స్వాతంత్య్రం వస్తుందో లేదోగానీ ఈరోజుల్లో పగటిపూట కూడా తిరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఆరోజు రాత్రి దిశ పరిస్థితి గురించి తలుచుకుంటనే ఒళ్లు జలదరించేది. ఆ మృగాళ్లను ఎన్‌కౌంటర్‌ చేసిన విషయం తెలిసిన తరువాత కాస్త నెమ్మదనిపిస్తోంది. తల్లిదండ్రులు తమ మగపిల్లలకు మంచి విలువల్ని బోధించాలి. ఏ ఆడదాన్ని చూసినా తల్లిని, చెల్లిని చూడాలని బోధిస్తే బాగుంటుంది. అమ్మాయిలు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

- డా.శోభానాయుడు, నాట్యగురువుస్వీయరక్షణ విద్యలో భాగం కావాలి

ప్రజాస్వామ్య దేశంలో అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఒక కళాకారిణిగా ప్రపంచమంతా తిరిగినా మన హైదరాబాద్‌కు వచ్చినప్పుడు కలిగే అనుభూతి వర్ణించలేనిది. అలాంటి నగరంలో దిశ వంటి ఘటనలు జరగడం దారుణం. పోలీసులు చేసింది తప్పు అని అనలేం కానీ.. దిశకు న్యాయం జరిగిందని మాత్రం నమ్ముతున్నా. అమ్మాయిలకు వారి ఆత్మరక్షణకు అవసరమైన మెలకువల్ని నేర్పించాలి. స్వీయరక్షణ అనేది విద్యావిధానంలో భాగం కావాలి.

- రాజేశ్వరి సాయినాథ్‌, నాట్యగురువు
 

 


మృగాళ్లకు తగిన శాస్తి

దిశ అత్యాచారం, సజీవ దహనం కేసులో నిందితులకు తగిన శాస్తి జరిగింది. ఘటన జరిగిన తొమ్మిది రోజుల్లోనే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడం వల్ల దిశ ఆత్మకు శాంతి చేకూరిందని భావిస్తున్నా. పోలీసులు తమ తప్పును సరిదిద్దుకున్నారు. పోలీసుల చర్యతో ఆకతాయిల గుండెల్లో భయం పుట్టాలి. ఆమె కుటుంబానికి తీరని అన్యాయం జరిగింది. దిశలాంటి దుర్ఘటనలు జరగకుండా ఫిర్యాదులు వచ్చిన వెంటనే పోలీసులు స్పందించాలి. ఆడపిల్లలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి.

- డాక్టర్‌ స్వప్న, పశు వైద్యాధికారిణి, నవాబుపేట

 


కుమిలిపోయేలా శిక్షలు ఉండాలి

దిశ నిందితులకు ఎన్‌కౌంటర్‌ సరైన శిక్ష అయినప్పటికీ ఈ ఘోరానికి పాల్పడిన వారికి చాలా సులువైన మరణం లభించింది. ఈ తరహా ఘటనల్లో నిందితులకు జీవితాంతం కుమిలిపోయేలా శిక్ష పడాలి. అప్పుడే ఇలాంటి ఘాతుకాలకు పాల్పడేందుకు ఎవరూ సాహసం చేయరు. రాష్ట్రంలో మద్యం విక్రయాలను కట్టడి చేయాల్సిన అవసరముంది. మద్యం మత్తులో ఏం చేస్తున్నారో తెలియక కామంతో కళ్లు మూసుకుపోయి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులకు ఈ శిక్ష పడటాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.

- ప్రొ.రోజారాణి, ప్రిన్సిపల్‌, కోఠి మహిళా కళాశాల

 


తప్పు చేయాలనుకునేవారికి ఇది హెచ్చరిక

తప్పు చేయాలనుకునేవారికి ఈ ఎన్‌కౌంటర్‌ ఒక హెచ్చరికలాంటిది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఈ కేసులో అందరూ కఠిన శిక్ష కోరుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. ప్రతిఒక్కరూ సంతోషిస్తున్న సమయం ఇది. తప్పు చేయాలంటే భయపడేలా ఈ ఎన్‌కౌంటర్‌ ఉంది. నిజంగా దిశ కేసులో సత్వర న్యాయం జరిగింది. ప్రజాభీష్టం మేరకు వ్యవహరించడం ప్రభుత్వ ధర్మం. ఆ ధర్మాన్ని పాటించారు. మహిళల భద్రత, రక్షణ విషయంలో మరింత పగడ్బందీ చర్యలు, అప్రమత్తత అవసరం.

వి.మమత, జడ్సీ, కూకట్‌పల్లి జోన్‌

 


ఆడపిల్లల నమ్మకాన్ని గెలిచిన పోలీసులు

పాశ్చాత్య దేశాల్లో ఆడపిల్లలు ఏ భయం లేకుండా ఒంటరిగా తమ ఉద్యోగాలు, వ్యాపార బాధ్యతల్ని ముగించుకొని అర్ధరాత్రి వేళల్లోనూ సురక్షితంగా ఇంటికి చేరుకుంటారు. కారణం పాశ్చాత్య, అరబ్‌ దేశాల్లో చట్టాలు కఠినంగా ఉండటమే. కానీ మన దేశంలో ఉదయం గడప దాటిన అమ్మాయి తిరిగి ఇంటికి చేరుకునేంత వరకు తల్లిదండ్రులకు దడే. మన దగ్గర కూడా కఠిన చట్టాలున్నా అమలులోనే లోపాలున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌తో పోలీసులు ఆడపిల్లల నమ్మకాన్ని గెలిచారు. ఆనందంగా అనిపించింది.

- రెడ్డి శ్యామల, తెలుగువర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి

 


శిక్షలు కఠినంగా ఉండాలి

ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు పోలీసులు, న్యాయవ్యవస్థల ద్వారా న్యాయం జరుగుతుందనే అనుకుంటారు. కానీ లోపభూయిష్టమైన చట్టాల కారణంగా అది జరగడం లేదు. ఒక్కో కోర్టులో ఒక్కో రకం తీర్పుతో నిందితులు తప్పించుకుంటున్నారు. కిందిస్థాయి కోర్టులు తీర్పు ఇస్తే ఉన్నతస్థాయి కోర్టుకు వెళ్లే అవకాశం ఉండకూడదు. మహిళలపై జరిగే దాడులకు కఠిన శిక్షలు విధించాలి. నిర్భయ కేసు తర్వాత ఆ చట్టం వచ్చినా ఇంకా ఎందరో మహిళలపై ఎన్నో దాడులు జరిగాయి. మన చట్టాలు ఎలా ఉన్నాయో ఇక్కడే అర్థమవుతోంది.

- గుండ్రాతి శారదాగౌడ్‌, న్యాయవాది

 


చట్ట ప్రకారం వెళ్తే బాగుండేది

సమాజంలో జరుగుతున్న అకృత్యాలకు ఎన్‌కౌంటర్లు పరిష్కారం కాదు. వీటివల్లే పూర్తిగా మార్పు వస్తుందని అనుకోకూడదు. సమాజంలో స్త్రీలపై జరుగుతున్న హింసను అరికట్టే దిశగా కచ్చితమైన మార్పు రావాలి. స్పష్టమైన పరివర్తన తీసుకురాగలిగితేనే ఇలాంటి దారుణాలు ఆగుతాయి. చిన్ననాటి నుంచి విలువలు పెంచేలా ఉండాలి. స్త్రీలపై గౌరవభావం పెంచే దిశగా అవగాహన తీసుకురావాలి. దిశ ఘటన విషయంలో చట్టప్రకారం వెళితే బాగుండేది. పోలీసులు వేగంగా ఆధారాలు సేకరించి న్యాయస్థానంలో సమర్పిస్తే శిక్ష విధించేవారు.

- కె.సత్యవతి, భూమిక విమెన్స్‌ కలెక్టివ్‌ అధ్యక్షురాలు

 


నా ఆలోచనా ధోరణి మార్చుకున్నా

ఇలాంటి పెద్ద శిక్షలకు నేను వ్యతిరేకం. కానీ కొంతకాలంగా నా ఆలోచనా ధోరణిని మార్చుకున్నాను. అత్యాచారం చేసినోళ్లకు మరణశిక్షే సరైనది. మహిళలకు ఇంత గౌరవం ఇచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారికి, పోలీసు అధికారులకు కృతజ్ఞతలు.

ఆ బుల్లెట్లను దాచుకోవాలనుంది.. ఆ తుపాకులకు దండం పెట్టాలనుంది.. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలనుంది.. నలుగురు చచ్చారనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈరోజే నీ ఆత్మ దేవుడిని చేరింది చెల్లెమ్మా.

- నటులు లక్ష్మీ మంచు, మంచు మనోజ్‌

 


దిశ ఆత్మకు శాంతి చేకూరింది

మొయినాబాద్‌, న్యూస్‌టుడే: సమాజంలో మానవ మృగాలను సంచరించకుండా నిలువరించే చట్టాలు లేనప్పుడు ఎన్‌కౌంటర్‌ చేయడమే సరైన నిర్ణయం. పోలీసులు నిందితులను 24 గంటల్లో పట్టుకోవడం అభినందనీయం. ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నాం. దిశ ఆత్మకు శాంతి చేకూరాలని, నిందితులకు శిక్ష పడాలంటూ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని 20 నిమిషాలపాటు మూసేసి దర్శనాలను ఆపేసి న్యాయం చేయాలంటూ వేంకటేశ్వరస్వామిని వేడుకున్నాం.

- చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌

 


హ్యాట్సాఫ్‌ సజ్జనార్‌

దిశను అతి కిరాతకంగా హత్య చేసిన నిందితులు పోలీసు కాల్పుల్లో చనిపోయారంటే దానిని ఎన్‌కౌంటర్‌ అని ఎలా అంటాం? ఆడపిల్లలకు పోలీసులు మేమున్నామనే భరోసా ఇచ్చారనుకోవాలి. ఇకపై ఎవరైనా తప్పు చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. దిశ విషయంలోనే కాకుండా ఇతర విషయాల్లోనూ వెంటనే స్పందించి దోషులకు తగిన శిక్ష విధిస్తే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. ఈ ఎన్‌కౌంటర్‌పై ఎక్కడా వ్యతిరేకత రావడం లేదంటే ప్రజలు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

- ఆచార్య భట్టు రమేశ్‌, తెలుగువర్సిటీ రిజిస్ట్రార్‌

 


తెలంగాణ ప్రభుత్వానికి నా అభినందనలు

సెల్యూట్‌.. తెలంగాణ పోలీస్‌ శాఖకి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరే నిజమైన హీరోలు. నేనెప్పుడూ ఒకటే నమ్ముతాను.. మనకి కష్టమొచ్చినా, కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు. నువ్వే దిక్కు.. రక్షించాలని దేవుడిని మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే.
మా సినిమా ట్రైలర్లు, టీజర్లకు లైకులు కొట్టకున్నా పర్లేదు. కానీ ఈ ఎన్‌కౌంటర్‌ వార్త మాత్రం ట్రెండింగ్‌ చేయండి.. ఇలా జరిగింది అని చాటింపు వేయండి.

- సినీ దర్శకులు పూరీ జగన్నాథ్‌, హరీశ్‌ శంకర్‌

 


ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా శిక్షిస్తే బాగుండేది

‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌ అందరికీ సంతోషంగా ఉండవచ్చు. కానీ ఇదే పరిష్కారం కాదనిపిస్తోంది. దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడి ఉంటే ప్రజలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండేది. ఎన్‌కౌంటర్‌ అయినవాళ్లు పేద కుటుంబాలకు చెందినవారు. అలాగని నేను సమర్థించడం లేదు. ప్రత్యూష, నిర్భయ కేసుల్లోని నిందితులకు ఇలాంటి శిక్ష ఎందుకు పడలేదు. ఇప్పటికీ ఎందరో మృగాళ్లు బయటే తిరుగుతున్నారు. దిశ విషయంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ చేపట్టి నిందితులకు ఉరిశిక్షో.. యావజ్జీవ శిక్షో.. వేస్తే బాగుండేది.

- ఝాన్సీ, నటి, వ్యాఖ్యాత

 


ప్రజలకు అవగాహన కల్పించాలి

ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. గతంలో నేను ఫిక్కీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు పోలీసు శాఖతో కలిసి ఒక యాప్‌ను రూపొందించాం. మహిళలు, యువతులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అలాగే పోలీసు శాఖ రూపొందించిన హాక్‌ఐ యాప్‌ను వాడుకోవచ్చు. నిందితులకు సరైన శిక్ష పడిందని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఏది మంచో.. ఏది చెడో చెప్పాలి. నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం ఉండాలి. మహిళలపై దాడుల, అత్యాచారాల ఘటనల్లో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చేయాలి.

- పింకీరెడ్డి, ఫిక్కీ మాజీ ఛైర్‌పర్సన్‌

 


తప్పునకు తగిన శిక్ష పడింది

చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ పోలీసులు మంచి పని చేశారు. సమాజంలో చెడు చేయాలనుకొనేవారికి ఇది ఒక హెచ్చరికగా నిలుస్తుంది. ఇలాంటి శిక్షల వల్ల తప్పు చేయాలని ఆలోచన వచ్చే వారిలోనూ భయం కలుగుతుంది. మహిళల విషయంలో జరిగే దాడులకు చట్టాల్లో చాలా మార్పులు తీసుకురావాలి. దిశ సంఘటనలో తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం మహిళలపై జరిగిన మిగిలిన సంఘటనల్లోనూ తీసుకోవాలి. ఇటీవల కాలంలో సురక్షితం కాని దేశాల జాబితాలోకి భారత్‌ వెళ్తుంది.

- నిధి అగర్వాల్‌, సినీనటి

 


చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది

చట్టాలను మార్చాల్సిన అవసరం కనిపిస్తుంది. దిశ ఘటన తరువాత ఇది మరింత స్పష్టమవుతోంది. దిల్లీలో జరిగిన నిర్భయ ఘటనలో చూస్తే దాదాపు ఏడేళ్లుగా కేసు కొనసాగుతోంది. ఆ నిందితులు ఇప్పుడు క్షమాభిక్ష కోరుతున్నారు. ప్రభుత్వాలు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటుచేయాలి. అప్పుడే న్యాయవ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. దిశ సంఘటనలో నలుగురే ఉన్నారా.. ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది చూడాలి. అయితే లారీ డ్రైవర్ల విషయంలోనే కాకుండా పెద్ద తలకాయల విషయంలోనూ ఇలానే వ్యవహరించాలి.

- సదా, సినీనటి

 


సరైన నిర్ణయం తీసుకున్నారు..

సజ్జనార్‌ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌కౌంటర్‌ ఎలా జరిగిందని ఆలోచన చేయడంకన్నా న్యాయం జరిగిందా లేదా అనేదే చూడాలి. తల్లిదండ్రులు కూడా పదిహేనేళ్ల తరువాత పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారో గమనించాలి. దిశ ఘటనలో జరిగిన ఎన్‌కౌంటర్‌తో ప్రజలు సంతోషంగా ఉన్నారు. దిశపై జరిగిన దాడి తరువాత దేశం అంతా అట్టుడుకిపోయింది. పోలీసులు సకాలంలో స్పందించలేదు. పరిధుల గోలతో కాలాయాపన చేశారనే చెడ్డపేరూ వచ్చింది. ఈ ఒక్క ఎన్‌కౌంటర్‌తో అవన్నీ తుడుచుకుపోయాయి.

- డా.బి.వి.పట్టాభిరామ్‌, మనస్తత్వ నిపుణులు

 


ఎన్‌కౌంటర్‌ అవసరమని అందరూ భావించారు

దిశ హత్యాచార ఘటనలో నిందితులకు ఎన్‌కౌంటర్‌ ఒక్కటే సరైన శిక్షగా అందరూ భావించారు. తక్కువ సమయంలోనే ఇది జరగడం నిజంగా ఆనందాన్ని ఇచ్చింది. ఇదే ఆ కుటుంబానికి తగిన న్యాయం. క్రూరంగా వ్యవహరించిన నిందితులకు ఇదే సరైన శిక్ష. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన రక్షణ చర్యలు, కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దిశ హత్యాచారం ఎంత బాధను కలిగించిందో అలా మరొకరు చేస్తే భయపడేలా చట్టాలు ఉండాలి. అప్పుడే నేరాలు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

ఎ.గోవర్థన్‌, రెక్టార్‌, జేఎన్‌టీయూ

 


శిక్ష సరైన ప్రాయశ్చిత్తం కావాలి

దిశపై అత్యాచారం జరిగిందంటే ప్రతిఒక్కరూ స్పందించారు. అయితే ఇలాంటి ఘటనల్లో శిక్షలు కఠినంగానే ఉండాలి కానీ అవి వారిలో మార్పు కలిగించేలా ఉండాలి. తన తప్పుని గుర్తించి పరివర్తన చెందేలా చేయాలి. సమాజంలో కూడా మార్పు రావాలి. చట్టబద్ధంగా శిక్షలు విధించాలి. ఎన్‌కౌంటర్‌లాంటి శిక్షలతో మార్పు రాదు. తల్లులు అమ్మాయిలను సాధికారత దిశగా పెంచుతున్నారు కానీ అబ్బాయిలను సరైన దిశలో పెంచట్లేదు. చిన్నతనం నుంచే అబ్బాయిల్లో ఆధిక్యతా భావన తొలగించాలి.

- ప్రొఫెసర్‌ మనోజ

 


సమాజంలో మార్పు రావాలి

తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం మంచిదే. అయితే ఈ ఒక్క ఎన్‌కౌంటర్‌తో జనంలో మార్పు వస్తుందనుకోవడం తప్పే. ముందు సమాజంలో మార్పు రావాలి. స్త్రీలను ఓ విలాస వస్తువుగా కాకుండా విలువగా చూడండి. ఇలాంటివి జరిగిన తర్వాత వారిని ఎన్‌కౌంటర్‌ చేయడం కాదు స్త్రీలను దిగజార్చి చూపించే సినిమాలు, ప్రచారాలను ఎన్‌కౌంటర్‌ చేయండి. ఇలాంటివాటి వల్లే యువత వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. విచ్చలవిడిగా పెరిగిపోయిన మద్య విక్రయాలూ ఇందుకు కారణమే.

- ఎస్‌ఎల్‌ పద్మ, మహిళా ఉద్యమ నేత

 


సెల్‌లో బందీ

ఎన్‌కౌంటర్‌ మృతుల శరీరాలను ఆటోల్లో తరలిస్తుండగా సెల్‌ఫోన్లలో బందిస్తున్న స్థానికులు

నిలిచిన ట్రాఫిక్‌
హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారిపై ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతంలో స్తంభించిన ట్రాఫిక్‌


చట్టాలను పటిష్ఠం చేయాలి

దిశ హత్యాచారానికి కారకులైన వారి ఎన్‌కౌంటర్‌తో నిందితులకు సరైన శిక్ష పడింది. వారి కుటుంబానికి న్యాయం జరిగింది. చట్టంలోని లొసుగుల వల్లే అత్యాచారాల వంటి దుశ్చర్యలు పెరుగుతున్నాయి. చట్టాలను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరముంది. ఇలాంటి ఘటనలు ఇంకా నిత్యం జరుగుతూనే ఉన్నాయి. అన్నింటి విషయంలో పోలీసులు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి.

- భరద్వాజ్‌, ఎంబీబీఎస్‌ విద్యార్థి, ఉస్మానియా వైద్య కళాశాల

 


తల్లిదండ్రులు దృష్టి సారించాలి

దిశను అతి కిరాతకంగా హతమార్చిన నిందితులకు సరైన శిక్ష పడింది. కానీ.. సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళనకరం. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీసులతోపాటు సమాజంపైన కూడా ఉంది. తమ పిల్లల మనస్తత్వం, నడవడికపై తల్లిదండ్రులు ఎప్పటికప్పడు దృష్టి సారించాలి. వారి స్నేహాలను కూడా గమనిస్తుండాలి.

- డా.రాజ్యలక్ష్మి, సూపరింటెండెంట్‌, సుల్తాన్‌బజార్‌ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి

 


నలుదిశలా హర్షం

కదిలిన కలాలు
పోలీసు ఎన్‌కౌంటర్‌ను హర్షిస్తూ ఎల్‌బీ నగర్‌లో నినాదాలు చేస్తున్న తెలంగాణ జర్నలిస్టులు


ఉత్కంఠ
పోలీసు ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రాంతాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద లారీపై నుంచి ఆసక్తిగా చూస్తున్న డ్రైవర్లు


మౌనసాక్షి
నాడు దిశపై సామూహిక హత్యాచారానికి మౌనసాక్షిగా నిలిచిన తొండుపల్లి టోల్‌గేట్‌ ప్రాంతం


నినదించిన గళాలు
పోలీసుల ఎదురు కాల్పులు జరిగిన చటాన్‌పల్లి బ్రిడ్జి ప్రాంతంలో పోలీసులకు అనుకూలంగా నినదిస్తున్న స్థానికులు


నేరం చేసి తప్పించుకోలేరు

* నేరం చేసి తప్పించుకొని ఎంతదూరం పారిపోగలవు? తెలంగాణ పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు.
* దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి కలిగింది. సరైన న్యాయం జరిగింది.
* హైదరాబాద్‌ పోలీసులు గొప్ప పని చేశారు.. మీకు సెల్యూట్‌.

- సినీ కథానాయికలు.. రకుల్‌ ప్రీత్‌సింగ్‌, రష్మిక
- బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌

 

 


అందరూ జయహో అనండి

హత్యాచార నిందితులను కాల్చి చంపినందుకు తెలంగాణ పోలీసులకు అభినందనలు. సెల్యూట్‌. ఇకపై ఇలాంటివి చేయాలంటే ప్రతిఒక్కరూ భయపడాలి. నాతో కలిసి పోలీసులకు అందరూ జయహో అనండి.
* దిశకు సరైన న్యాయం జరిగింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోకూడదు. ఇలాంటి నేరాలు జరగకుండా చర్యలు చేపట్టాలి. చిన్నతనం నుంచే సరైన విద్య, సాధికారత అందించి మార్పు జరిగేలా చూడాలి. జైహింద్‌.. దిశ ఆత్మకు శాంతి కలగాలి.

- బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌, నటుడు రవితేజ

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.