close

గురువారం, జనవరి 23, 2020

ప్రధానాంశాలు

బడ్జెట్

నిశీధి వేళ నిఘా లేక

రోడ్లపై ఆకతాయిల అసాంఘిక కార్యక్రమాలు
వీధి దీపాలుండవు, పోలీసులు కనిపించరు
అటుగా వెళ్లాలంటే జంకుతున్న జనం
ఈనాడు, హైదరాబాద్‌

విశ్వనగరంగా చెప్పుకొనే రాజధానిలో వీధి దీపాలు సరిగాలేవు. ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్లలో చీకట్లు కమ్ముకుంటున్నాయి. శిథిల భవనాలు, ఖాయిలా పడ్డ పరిశ్రమలు, ఆకతాయిలు సంచరించే మైదానాలు, ఖాళీ స్థలాలు, ఉద్యానవనాలు, చెరువులు, మద్యం దుకాణాలు, పైవంతెనలు, పలు బస్తీల ద్వారా రాత్రిళ్లు ఒంటరిగా వెళ్లలేని దుస్థితులున్నాయి. మహిళలు, పురుషులు ఆయా మార్గాల్లో నడవాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుంది. మత్తులో మృగాళ్లు ఎక్కడ వెంటపడతారోనని భయాందోళనలో బతకాల్సి వస్తోంది. చీకట్లను పారదోలి, భద్రత కల్పించాల్సిన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అధికారుల నిర్లక్ష్యం
హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలో కోటి మందికిపైగా జీవనం సాగిస్తున్నారు. నగరంలో అధికారులు భద్రత చర్యలు తీసుకోవట్లేదు. గ్రేటర్‌లోని జనావాసాల మధ్య దీపాలను బిగించడంలో బల్దియా నిర్లక్ష్యంగా వహిస్తుంటే, శివారు, బాహ్య వలయ రహదారికి అనుకుని ఉన్న ప్రాంతాలు, సర్వీసు రోడ్లపై లైట్లు ఏర్పాటు చేయకుండా హెచ్‌ఎండీఏ చోద్యం చూస్తోంది.

అంతా చీకటిమయం..
లోయర్‌ ట్యాంక్‌బండ్‌ నుంచి ఇందిరాపార్కు వరకు, స్నోవరల్డ్‌ రోడ్డు, డీబీఆర్‌ మిల్స్‌ ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. డీబీఆర్‌ మిల్స్‌లో రాత్రి, పగలు తేడా లేకుండా పేకాటరాయుళ్లు, మద్యం సేవించేవారు సంచరిస్తుంటారు. అసాంఘిక కార్యక్రమాలు సాగుతుంటాయి. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఆనుకుని ఉన్న ఒలిఫెంటా బ్రిడ్జి నుంచి చిలకలగూడ, గాంధీ ఆస్పత్రి వెళ్లే రోడ్లపైనా అదే దుస్థితి. ఓయూ, వారసిగూడ, వెళ్లే మహిళలు ఆటోల కోసం చీకట్లో నిల్చుని భయం భయంగా ఎదురు చూడాల్సిన దుస్థితి ఉంటుంది. సీతాఫల్‌మండి రైల్వేస్టేషన్‌ దగ్గరి పైవంతెన కింద నిత్యం గంజాయి తాగుతూ పదుల సంఖ్యలో జనం ఉంటారు. మూసాపేట నుంచి హైటెక్‌సిటీ వెళ్లే రోడ్డు మార్గం, దుర్గం చెరువు, హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట, లింగంపల్లి, భరత్‌నగర్‌, సనత్‌నగర్‌, బోరబండ, తదితర రైల్వే స్టేషన్ల వద్ద వీధి దీపాలు ఉండవు. ఆకతాయిలు మద్యం మత్తులో తూగుతూ ఉంటారు. షేక్‌పేట, రాయదుర్గం, మెహిదీపట్నం-ఆరాంఘర్‌ కూడలి వరకు వీధి దీపాలు సవ్యంగా వెలగట్లేదు. వేలాది మంది రాకపోకలు సాగించే ఓయూ అంతర్గత రోడ్డు, మైదానాలు, వసతి గృహాల రోడ్లపై వీధి దీపాలు లేవు. అడుగు దూరంలో పోలీసు స్టేషన్‌ ఉన్నప్పటికీ, రాత్రయితే మైదానాల్లో మద్యం దుకాణాలు వెలుస్తాయి. శివారు ప్రాంతాల్లో పురపాలక సంఘాలు వీధి దీపాల నిర్వహణను గాలికొ వదిలేశాయి. ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డు మందుబాబులకు అడ్డాగా మారింది. చీకటి పడిందంటే .. రోడ్లకు ఇరువైపులా ద్విచక్ర వాహనాలు, కార్లు, లారీలు ఆగి ఉంటాయి. గుంపులు గుంపులుగా మద్యం సేవించే దృశ్యాలు కనిపిస్తుంటాయి. పెట్రోలింగ్‌తో ఆ పరిస్థితులను నివారించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. రోడ్ల పొడవునా వీధి దీపాలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన హెచ్‌ఎండీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.

అయోమయంలో సేఫ్‌ సిటీ ప్రాజెక్టు..
నిర్భయ ఘటన అనంతరం మహిళా భద్రతే లక్ష్యంగా కేంద్ర సర్కారు సేఫ్‌ సిటీ ప్రాజెక్టుకు తెరపైకి తెచ్చింది. దిల్లీ, ముంబయి, కలకత్తా, చెన్నై, బెంగళూరు, లక్నో, అహ్మదాబాద్‌ నగరాలతోపాటు హైదరాబాద్‌ను ప్రాజెక్టు అమలుకు ఎంపిక చేసింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.280 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ప్రాజెక్టు అమలులో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్లు, రవాణాశాఖ కమిషనర్‌, డీజీపీ, ఉమెన్‌సేఫ్టీ వింగ్‌, ఐజీ తదితరులు భాగస్వాములుగా ఉంటారు. సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రిళ్లు ఉద్యోగాలు ముగించుకుని ఇళ్లకు చేరుకోవాల్సిన మహిళల కోసం బస్సులు, క్యాబ్‌ సౌకర్యాలను పెంచడం, సాంకేతిక వనరులతో నిఘా వ్యవస్థను అందుబాటులోకి తేవడం వంటి పలు కార్యక్రమాలను అమలు చేయాలి. ప్రత్యేక మరుగుదొడ్లు, మహిళా పోలీసుల నియామకం, మొబైల్‌ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు పెరగాలి. అందుకు సంబంధించి నిధులు మంజూరైనప్పటికీ, పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికార యంత్రాంగంలో చిత్తశుద్ధి లోపించడమే అందుకు కారణం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.