close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

రాష్ట్ర వార్తలు

ఆర్టీసీ ప్రయాణికులపై భారం

ఆర్టీసీ ప్రయాణికులపై భారం

● ఛార్జీల పెంపుదలకు ప్రభుత్వ నిర్ణయం

● పశ్చిమ రీజియన్‌కు పెరగనున్న ఆదాయం

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ ప్రయాణికులపై భారం పడనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పశ్చిమ రీజియన్‌ ప్రస్తుతానికి రూ.32 కోట్ల నష్టాల్లో ఉంది. ఇటువంటి స్థితిలో ఆర్టీసీ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించడంతో పశ్చిమ రీజియన్‌ నష్టాల నుంచి కొంతమేర గట్టెక్కనుంది. తెలుగు-వెలుగు, సిటీ సర్వీసు బస్సులకు ప్రతి కిలో మీటరుకు 10 పైసలు, మిగిలిన అన్ని బస్సులకు ప్రతి కిలో మీటరుకు 20 పైసల చొప్పున పెంచుతున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుదలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆమోద ముద్ర వేశారని ఆయన వెల్లడించారు. పెంచిన ఆర్టీసీ ఛార్జీలు ఎప్పటినుంచి వర్తించేదీ త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుదల అమల్లోకివస్తే పశ్చిమ రీజియన్‌కు రోజుకు రూ.10 లక్షల మేర ఆదాయం పెరుగుతుంది. ప్రస్తుతం రోజుకు రూ.65 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఈ రీజియన్‌లోని మొత్తం ఎనిమిది డిపోల పరిధిలో 645 బస్సులున్నాయి. ఇవి రోజుకు 2.20 లక్షల కిలోమీటర్ల మేర పయనిస్తున్నాయి. ఆర్టీసీ ఛార్జీల పెరుగుదల వల్ల పశ్చిమ రీజియన్‌కు రోజుకు రూ.10 లక్షల మేర అదనంగా ఆదాయం లభిస్తే నెలకు దాదాపు రూ.3 కోట్లు, ఏడాదికి రూ.36 కోట్ల వరకు సంస్థకు ఆదాయం చేకూరుతుంది. ఆర్టీసీ ఛార్జీల పెంపుదలపై ప్రభుత్వం నుంచి తమకు ఇంకా ఎటువంటి అధికారిక ఉత్తర్వులు అందలేదని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజరు ఎ.వీరయ్య చౌదరి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

ఛార్జీల పెంపు తగదు

ఆర్టీసీ నష్టాలను కొంతవరకైనా తీర్చాలంటే ఛార్జీలను పెంచకతప్పదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని అంటున్నారు. మంత్రి వ్యాఖ్యలు ఇలా ఉండగా ఛార్జీల పెంపుదల సరికాదంటూ పలు ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం నష్టాల భారాన్ని ఛార్జీల పెంపుదలతో ప్రజలపై మోపడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోకుంటే ఉద్యమిస్తామని వారంటున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.