close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

పల్లెల్లో చైతన్యం.. పట్టణాల్లో దురాగతం!

స్కానింగ్‌ కేంద్రాల్లో యథేచ్ఛగా లింగ నిర్ధరణ పరీక్షలు

ఆడశిశువని తేలితే భ్రూణ హత్య

కొరవడిన అధికారుల పర్యవేక్షణ

న్యూస్‌టుడే, వికారాబాద్‌

వికారాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి ఇద్దరు కుమారులు. వారికి ఇద్దరు చొప్పున ఆడపిల్లలు. ఇటీవల ఓ కోడలు మళ్లీ గర్భం దాల్చగా.. గ్రామీణ వైద్యుడి సహకారంతో వికారాబాద్‌లోని ఓ స్కానింగ్‌ సెంటర్‌లో పరీక్ష చేయించారు. పుట్టేది ఆడపిల్ల అని తెలిసి అబార్షన్‌ చేయించారు.

కొడంగల్‌ ప్రాంతంలో నివాసముంటున్న నరేష్‌(పేరు మార్చాం) ప్రభుత్వ ఉద్యోగి. బీఈడీ పూర్తి చేసిన యువతితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. మొదటి రెండు కాన్పుల్లో కుమార్తెలు పుట్టారు. మూడోసారి భార్య గర్భం దాల్చి నాలుగో నెల రాగానే పట్టణంలోని ఓ స్కానింగ్‌ కేంద్రాన్ని సంప్రదించాడు. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలియడంతో ఆర్‌ఎంపీ వైద్యునితో గర్భ విచ్ఛిత్తి చేయించారు.

పరిగి ప్రాంతానికి చెందిన రాములు ఉన్నత విద్య అభ్యసించి ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఇతనికి మొదట ఆడపిల్ల పుట్టింది. నాలుగు నెలల క్రితం భార్య గర్భం దాల్చగా రెండోసారి పుట్టబోయేదీ ఆడపిల్లేనేమోనని దగ్గర్లోని స్కానింగ్‌ సెంటర్‌లో చూపించాడు. మగబిడ్డ అని తెలియడంతో సంతోషంతో స్కానింగ్‌ కేంద్రం వారికి రూ.10 వేలు ఇచ్చారు.

 జిల్లాలో ఒకప్పుడు ఆడపిల్ల అనగానే మారుమూల ప్రాంతాల్లోనే వివక్ష ఉండేది. ప్రస్తుతం పట్టణ ప్రాంతాలకూ విస్తరించింది. వికారాబాద్‌ జిల్లా యంత్రాంగం ఈ దురాగతాన్ని నివారించడానికి.. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన అవగాహన కార్యక్రమాలు మంచి ఫలితాలిచ్చాయి. పట్టణాల్లో మాత్రం ఈ జాడ్యాన్ని యంత్రాంగం నివారించలేకపోతోంది. గల్లీకొక స్కానింగ్‌ సెంటర్‌ పుట్టుకురావడం, సంబంధిత శాఖాధికారుల మధ్య సమన్వయం లేకపోవడం, పర్యవేక్షణ కొరవడటంతో పుట్టకముందే చిట్టితల్లులు తనువు చాలిస్తున్నారు.

ఉన్నత విద్యావంతులే ఎక్కువ..

ఒకప్పుడు జిల్లాలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల వారు... ఆడపిల్లలు పుడితే ఆర్థిక భారంగా భావించేవారు. నాలుగు నెలలు నిండగానే స్థానిక ఆర్‌ఎంపీల సాయంతో దగ్గరలోని పట్టణంలో స్కానింగ్‌ చేయించి... పుట్టేది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్‌ చేయించేవారు. కొంతమంది ఆడపిల్లలు పుట్టాక పురిట్లోనే విక్రయించిన సంఘటనలు తాండూరు, పరిగి ప్రాంతాల్లో గతంలో వెలుగు చూశాయి. తర్వాత కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో కొంత చైతన్యం వచ్చింది. స్థానికులు కొందరు ఇలాంటి సంఘటనలను అధికారులు, మీడియా దృష్టికి తెస్తుండటం... మరోవైపు ఆడపిల్లలు పుడితే ఎలాంటి లాభాలుంటాయనే కోణంలో ప్రభుత్వ పరంగా గ్రామీణ, గిరిజన ప్రాంత మహిళల్లో అవగాహన కల్పించడంతో భ్రూణహత్యలు గణనీయంగా తగ్గాయి. అదే పట్టణ ప్రాంతాల్లో పక్కవారిని పట్టించుకొనే ధోరణి లేకపోవడంతో భ్రూణ హత్యల విష సంస్కృతి విస్తరిస్తోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు ఘటనలతోపాటు పైమూడు ఉదాహరణల్లో ఉన్నత విద్యావంతులే ఉండటం గమనార్హం. డబ్బు ఎంతైనా ఖర్చు చేయడానికి వెనుకాడకపోవడం, వివరాలు గోప్యంగా ఉంచుతారన్న నమ్మకంతో చాలా స్కానింగ్‌ కేంద్రాలు వీరికి సహకరిస్తున్నాయి.

అంతా కోడ్‌ భాషలోనే..

స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులు లింగనిర్ధరణ పరీక్షలు అందరికీ చేయరు. వారికి అత్యంత నమ్మకంగా ఉన్నవారికి, తాము నియమించిన మధ్యవర్తుల ద్వారా వచ్చేవారికే కోడ్‌ భాషలో పుట్టబోయేది ఎవరనేది చెబుతారు. ఆడపిల్ల అయితే మైనస్‌ అని, మగబిడ్డ ఉంటే ప్లస్‌ అని సంజ్ఞల ద్వారా తెలియజేస్తారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీ, పీఎంపీ వైద్యులతో పాటు కొందరు అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలను మధ్యవర్తులుగా నియమించుకున్నాయి. ఒక్కో కేసుకు సంప్రదించే వారి స్థోమత మేరకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 30 స్కానింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. మరో 5 కేంద్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కొందరు వైద్యులు తమ ఆసుపత్రుల్లోనే ఈ యంత్రాలు ఏర్పాటు చేశారు. లింగ నిర్ధరణ చేస్తే ఎలాంటి శిక్షలుంటాయన్న బోర్డులు ఎదురుగా కనిపిస్తున్నా వాటిని పట్టించుకోవడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు అప్పుడప్పుడు ఫిర్యాదులు వస్తున్నా ... తూతూమంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఐసీడీఎస్‌, వైద్యారోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ దురాచారానికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

కఠిన చర్యలు తీసుకుంటాం

- దశరథ్‌నాయక్‌, జిల్లా వైద్యాధికారి

లింగ నిర్ధరణ పరీక్షలు చేసినా.. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందుకు సహకరించినా ఐదేళ్ల జైలుతో పాటు రూ.50 వేలకు పైగా జరిమానా విధిస్తారు. చట్టరీత్యా మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేసి స్కానింగ్‌ కేంద్రాల గుర్తింపును రద్దు చేస్తాం. మూడు మాసాలకోసారి కేంద్రాల నిర్వాహకులతో సమావేశం ఏర్పాటుచేసి కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశిస్తున్నాం. 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.