close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

ఎన్డీకి ఎదురుదెబ్బ

ఇల్లెందు గ్రామీణం, గుండాల, న్యూస్‌టుడే

ఎన్డీ నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల, ఇల్లెందు, మణుగూరు, పాకాల కొత్తగూడెం ప్రాంతాల్లో కంచుకోటగా ఉన్న న్యూడెమోక్రసీ పార్టీకి ముఖ్య దళనేతల ఎన్‌కౌంటర్లు, అరెస్టులతో కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మూడున్నర దశబ్దాల క్రితం మావోయిస్టు, ప్రజాప్రతిఘటన, ప్రతిఘటన, జనశక్తి, ఎన్డీ పార్టీలు ఒకే నినాదంతో చండ్రపుల్లారెడ్డి పేరుతో పనిచేశాయి. పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తడంతో పలు పార్టీలుగా విడిపోయాయి. ఈ నేపథ్యంలో న్యూడెమోక్రసీ మాత్రం ప్రజలతో మమేకమై ఎన్నికల్లో పోటీచేస్తే ప్రజా సమస్యలను పరిష్కరించవచ్చనే విధానం ఎంచుకుంది. ఎన్డీ మినహా అజ్ఞాత దళాలు అందుకు భిన్నంగా వ్యవహరించాయి. ఎన్నికలు లేకుండా ప్రజలే పాలించినప్పుడు స్వేచ్ఛ ఉంటుందన్న భావనతో పనిచేశాయి. దీంతో మావోయిస్టు, ప్రజాప్రతిఘటన, ప్రతిఘటన, జనశక్తి అజ్ఞాత దళాలను అప్పట్లో ప్రభుత్వం నిషేధించింది. నిషేధించిన పార్టీలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ, నష్టాన్ని కలిగించాయి. దీంతో పోలీసులు, ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపడంతో ఆ పార్టీలు అంతరించిపోయాయి. మావోయిస్టు, ఎన్డీ మాత్రమే మిగిలాయి. మావోయిస్టు పార్టీ చర్చల అనంతరం ముఖ్య దళనేతలను కోల్పోవడంతో పార్టీ ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలో కొంత మేరకు పట్టు కోల్పోయింది. ఎన్డీ మాత్రం కంచుకోటగా మిగిలిపోయింది. ఎన్డీలో దళనేతలుగా పని చేసిన కోటన్న, ఎల్లన్న, మురళి, గణేశ్‌ ఎన్‌కౌంటర్లలో మృతిచెందారు. పార్టీకి ఆయువుపట్టుగా ఉన్న బాటన్న అనారోగ్యంతో చనిపోయాడు. అనంతరం ఎన్డీలో అంతర్గత విభేదాలు తలెత్తడంతో రాయల, చంద్రన్న వర్గాలుగా విడిపోయారు. లింగన్న అరెస్టు అనంతరం ఎన్‌కౌంటర్‌, మధు, సాగరన్న అరెస్టు తదితర కారణాలతో ఎన్డీకి కోలుకోలేని దెబ్బ తగిలింది.

22 ఏళ్ల నుంచి అజ్ఞాతంలో...యదళ్లపల్లి గుంపునకు చెందిన ఆజాద్‌ ప్రజాప్రతిఘటన పోరాటాలకు ఆకర్షితుడై 1997లో ఆ పార్టీలో చేరాడు. కొద్ది రోజులకు పీపీజీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. పీపీజీలో ఉండగానే కోయ సామాజిక వర్గానికి చెందిన ఆజాద్‌, లంబాడీ సామాజిక వర్గానికి చెందిన శారదను కులాంతర వివాహం చేసుకున్నాడు. పీపీజీలో కీలకంగా వ్యవహరిస్తున్న క్రమంలో కొన్ని అంతర్గత సమస్యల కారణంగా 2008లో ఎన్డీలో చేరాడు. 2016లో మండలంలోని మాణిక్యారం పంచాయతీ తుంటబాలతండా రహదారిలో పోలీసులకు దొరికాడు. జైలు నుంచి తిరిగి వచ్చి మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అప్పటి నుంచి పాల్వంచ మండలం బంగారుచెలక ఏరియా దళకమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆజాద్‌ మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చాడు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

కోర్టులో హాజరుపర్చాలి: మధు

దళకమాండర్‌ ఆజాద్‌ను కోర్టులో హాజరుపర్చాలని ఎన్డీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు డిమాండ్‌ చేశారు. ఎన్డీ ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఆజాద్‌ను ఎక్కడ ఉంచారో తెలపకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారన్నారు. చట్టబద్ధంగా ఆజాద్‌ను కోర్టులో హాజరుపర్చాలనీ, ఆయన ఆరోగ్య సంరక్షణకు పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.

మంత్రుల పర్యటన నేపథ్యంలో..

ఇల్లెందు పట్టణం, మండలంలో ఆదివారం మంత్రులు సత్యవతిరాఠోడ్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌ పర్యటించనున్నారు. 9న ఎర్రబెల్లి దయాకర్‌ పర్యటనలు చేయనున్న క్రమంలో దళకమాండర్‌ ఆజాద్‌ అరెస్టు సంచలనంగా మారింది. మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ఆయన ఎప్పుడు వచ్చాడు? ఎందుకు వచ్చాడు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.