close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

దారులు దారుణం..  ప్రయాణం నరకం!

అధ్వానంగా గ్రామీణ రహదారులు

ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు

పీఎంజీఎస్‌వై నిధుల కోసం ఎదురు చూపులు

న్యూస్‌టుడే, పరిగి

దెబ్బతిన్న దోర్నాల్‌పల్లి -గూడూరు రోడ్డు

ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం కింద రాష్ట్రానికి మంజూరైన 2,427 కిలోమీటర్ల రహదారులను అన్ని గ్రామీణ నియోజకవర్గాలకు కేటాయిస్తాం.

- పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులతో ఇటీవల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

గ్రామీణాభివృద్ధిలో రోడ్లే కీలకం. రవాణా వ్యవస్థ మెరుగు పడితేనే గ్రామం అన్ని రంగాల్లోనూ పురోగతి సాధిస్తుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచినా నేటికీ పరిగి ప్రాంతంలోని అనేక పల్లెలకు తారు రోడ్లు లేని దుస్థితి. కంకర తేలిన రహదారులతో ప్రజలు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. అసలే అధ్వానంగా ఉండే గ్రామీణ రోడ్లు గత ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలకు మరింత దారుణంగా తయారయ్యాయి. వర్షం పడిన సమయంలో ప్రయాణమంటే.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న రోడ్లూ ఉన్నాయి. మరమ్మతులు చేపట్టాలని ప్రజలు చాలాకాలంగా కోరుతున్నా నిధుల కొరత ప్రధాన అడ్డంకిగా మారింది. గ్రామ సడక్‌ యోజన కింద నిధులు మంజూరు కావడంతో... పలు గ్రామాల ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. తమ ఊరికి కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు రూ.571 కోట్లను మంజూరు చేస్తూ మంత్రి మండలి వారం క్రితం నిర్ణయం తీసుకుంది. దీంతో అవసరమైన చోట మరమ్మతులు, పూర్తి అధ్వానంగా ఉన్న చోట కొత్త రోడ్లు వస్తాయని గ్రామీణులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

భగీరథ పనులతో...

 

ఇంటింటికి రక్షిత తాగునీరు అందించేందుకు చేపట్టిన మిషన్‌ భగీరథ పనులతో రోడ్లు మరింతగా దెబ్బతిన్నాయి. పైపులైన్ల ఏర్పాటు అనంతరం మరమ్మతు పనులు లేకపోవడంతో గ్రామీణులు నిత్యం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పరిగి నియోజకవర్గంలోని పూడూరు, పరిగి, దోమ, కుల్కచర్ల మండలాల్లో 148 పంచాయతీలుండగా... రోడ్లు, భవనాల శాఖ పరిధిలో 16 రోడ్లు ... 181.3 కి.మీ. దూరం (బీటీ) ఉన్నాయి. వీటిలో పలు మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్‌ శాఖ ఆధీనంలో పరిగి మండలంలో 111 రోడ్లు ... 236 కి.మీ. దూరం ఉన్నాయి. వీటిలో తారు రోడ్లు 51 కి.మీ. కాగా... 43 మట్టి రోడ్లు. పరిగి నియోజకవర్గం ఇతర మండలాల్లోని మరో 117 రోడ్లు .. అసలు వాహనాలు వెళ్లలేని విధంగా తయారయ్యాయి.

చినుకు పడితే ఇలా దోమ రోడ్డు దుస్థితి

ఇవిగో ఉదాహరణలు

కుల్కచర్ల మండల కేంద్రం నుంచి రాంనగర్‌ వరకు ఉన్న ఐదు కిలోమీటర్ల దూరం రోడ్డు దారుణంగా తయారైంది. వాహనాలు రాకపోకలకు తీవ్ర అవరోధంగా మారింది. ఇదే మండలంలోని కుల్కచర్ల గ్రామం నుంచి చౌడాపూర్‌ వరకు 12 కిలోమీటర్ల దూరం సగానికి సగం పాడైంది.

పరిగి మండలంలోని నర్సయ్యగూడ, రావులపల్లి గ్రామ పంచాయతీ కేంద్రాలకు మట్టిరోడ్డే దిక్కు. తారు రోడ్డు వేయాలని కొన్నేళ్లుగా గ్రామస్థులు కోరుతున్నారు.

పరిగి మండలం సుల్తాన్‌పూర్‌ గ్రామ స్టేజీ నుంచి బాసుపల్లి వరకు 13.8 కి.మీ. మార్గంలో.. 7.8 కి.మీ. నరకప్రాయంగా మారింది. దీనిపై నిత్యం సుమారు రెండు వేల మందికిపైగా ప్రయాణిస్తుంటారు. అడుగడుగునా గుంతలు పడి ప్రమాదాలకు నిలయంగా మారింది.

పరిగి - వికారాబాద్‌ మధ్య నస్కల్‌ సమీపాన రూ.1.8 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన వంతెన నిర్మాణం ముగిసినా.. ఇతర అభివృద్ధి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. భారీ వర్షం పడితే వాహనాలు పడిపోయే ప్రమాదం నెలకొంది.

పరిగిలో తహసీల్దారు కార్యాలయం నుంచి కోర్టు సమీపం వరకు ఉన్న ఒక వరుస రోడ్డు గుంతలమయంగా ఉంది. నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలు అధికంగా ఉంటాయి.

పరిగి నుంచి రుకుంపల్లి మధ్య రోడ్డుపై తారు లేచిపోయి కాల్వలు కాల్వలుగా మారింది. ద్విచక్ర వాహనాల రాకపోకలకు తీవ్ర అసౌకర్యంగా ఉంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

పరిగి మండలంలోని సయ్యద్‌పల్లి గ్రామానికి సగం దూరం తారు ఉండగా మరికొంత దూరం మట్టి రోడ్డు ఉంది. ఇది వర్షాలకు పూర్తిగా దెబ్బతింది.

పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని పూడూరు మండలం రాకంచర్ల నుంచి కంకల్‌ వెళ్లే ప్రధాన రహదారి 5.5 కి.మీ. పూర్తిగా పాడైంది. పరిగి నుంచి విద్యారణ్యపురికి వెళ్లే సింగిల్‌ రోడ్డు రాకపోకలకు అనువుగా లేదు.

 

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం

- సుదర్శన్‌రెడ్డి, డీఈ, పంచాయతీరాజ్‌, పరిగి డివిజన్‌

అధ్వానంగా ఉన్న రోడ్లను బాగు చేయాలని ఉన్నతాధికారులకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద ప్రతిపాదనలు పంపించబోతున్నాం. కొన్ని గిరిజన తండాలు పంచాయతీలుగా మారాయి. వాటినీ పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలు ఇవ్వాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయి కసరత్తులు ప్రారంభించాం.

ఆటోలు తిరగడం లేదు: కె.మహేష్‌, రావులపల్లి

పరిగి మండలం ఖుదావంద్‌పూర్‌ స్టేజీ నుంచి మూడు కిలోమీటర్ల దూరం రాళ్లు తేలి అస్తవ్యస్తంగా ఉంది. ఈసారే పంచాయతీగా ఏర్పడింది. నిత్యం గ్రామం నుంచి 50 మందికి పైగా విద్యార్థులు పరిగిలోని వివిధ పాఠశాలలకు వస్తుంటారు. బస్సు ఉదయం, సాయంత్రం సమయంలోనే ఉంటుంది. రోడ్డు దెబ్బతినడంతో ఆటోలు తిరగక అవస్థలు తప్పడం లేదు. తారు రోడ్డు వేసి ఇబ్బందులు తీర్చాలి.

తొలిదశలోనే చేపట్టాలి: యు.యాదయ్య, సర్పంచి, దోర్నాల్‌పల్లి

దోమ మండలం గొడుగానిపల్లి నుంచి డి.ఎన్కేపల్లి వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం కంకర తేలింది. ద్విచక్ర వాహనాలు తిరగడం కష్టసాధ్యంగా మారింది. ఏమాత్రం ఆదమరిచి నడిపినా అదుపుతప్పి పడిపోవడం ఖాయం. పీఎంజీఎస్‌వై పథకం కింద పూర్తిగా దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు తొలి విడతలోనే చేపట్టాలి.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.