close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

వెలుగులు పెరిగాయి.. బిల్లులు తగ్గాయి!

ఎల్‌ఈడీ వీధి దీపాలతో ఏడాదికి రూ.45 లక్షలు ఆదా

నిర్వహణ బాధ్యతల నుంచి ఉపశమనం

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

ఎన్టీఆర్‌ కూడలిలో వొెలుగుతున్న ఎల్‌ఈడీ విద్యుత్తు దీపాలు

పురపాలక సంఘం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది.. మరోవైపు వీధి దీపాల నిర్వహణ.. విద్యుత్తు బిల్లుల భారం అధికమైంది.. అలాగని వాటి సంఖ్యను తగ్గిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోంది... పొదుపు దిశగా అడుగులు వేయడమే ఇందుకు పరిష్కారమని వికారాబాద్‌ మున్సిపల్‌ అధికారులు ఆలోచించారు. సాధారణ విద్యుత్తు దీపాల స్థానంలో ఎల్‌ఈడీలను అమర్చితే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చారు. తద్వారా విద్యుత్తు ఆదాతోపాటుగా... బిల్లుల భారం తగ్గుతుందని భావించారు. కానీ.. తొలుత రూ.కోట్లలో నిధులు అవసరం. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంతపెద్దమొత్తంలో కేటాయించడం అసాధ్యం. ఇతరులకు ఈ బాధ్యత అప్పగిస్తే కొంత ఉపశమనం కలుగుతుందని ఆశించారు. అనుకున్నది ఆచరించి సత్ఫలితాలు సాధిస్తున్నారు.

ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడంతో...

జిల్లా కేంద్రమైన వికారాబాద్‌లోని 5,031 వీధి దీపాల్లో దాదాపు 80 శాతం 18 వాట్ల సామర్థ్య కలిగినవి. గతంలో నెలకు రూ.18 లక్షల వరకు విద్యుత్తు బిల్లు వచ్చేది. ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత వారు సాధారణ దీపాలను తొలగించి ఎల్‌ఈడీ దీపాలను అమర్చారు. అనంతరం బిల్లు దాదాపు రూ.10.50 లక్షలే వస్తోందని అధికారులు చెబుతున్నారు. అంటే నెలకు రూ.7.50 లక్షల వ్యత్యాసం కనిపిస్తోంది. ఒప్పందం ప్రకారం ఈ మొత్తంలో నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సంస్థకు 50 శాతం చెల్లిస్తున్నారు. అంటే పురపాలికకు రూ.3.75 లక్షల వరకు నెలకు ఆదా అవుతోంది. ఈ లెక్కన ఏడాదికి విద్యుత్తు బిల్లుల భారం రూ.45 లక్షలు తగ్గుతోంది.

నిర్వహణ వ్యయం ఆదా..

ఇక గతంలో వీధి దీపాల నిర్వహణ కోసం మున్సిపాలిటీ నిధులను వ్యయం చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ భారం కూడా లేకుండా పోయింది. పాడైన దీపాలను బాగుచేయడం.. అవసరమైతే కొత్తవి అమర్చడం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన సంస్థ చూసుకొంటోంది. ఏతావాతా ప్రజలకు వెలుగులు.. ప్రభుత్వానికి విద్యుత్తు బిల్లు ఆదా... రెండువిధాలా లాభం చేకూరుతోంది.

మంచి ఫలితాలు వస్తున్నాయి..

- భోగేశ్వర్లు, కమిషనర్‌, వికారాబాద్‌ పురపాలక సంఘం

ఎల్‌ఈడీ వీధి దీపాలు అమర్చిన తరువాత విద్యుత్తు బిల్లుల వ్యయం భారీగా తగ్గింది. ఒప్పందం ప్రకారం సంస్థకు చెల్లింపులు చేస్తున్నాం. నిర్వహణ బాధ్యతలనూ వారే నిర్వహిస్తున్నారు. కొత్త విధానం మంచి ఫలితాలిస్తోంది.

విద్యుత్తు

స్తంభాలు: 5,000

వీధి దీపాలు: 5,031

18 వాట్లు: 4,361

70 వాట్లు: 200

110 వాట్లు: 298

190 వాట్లు: 172

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.