close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

ఆదాయ మార్గం

ఆర్టీసీలో సీఎం హామీలు అమలు

2020 మే 31 తర్వాత క్యాట్‌ కార్డు కనుమరుగు

ఆర్టీసీ ఖమ్మం రీజియన్‌ మేనేజర్‌ కృష్ణమూర్తితో ముఖాముఖి

ఈనాడు, ఖమ్మం

సామాన్యుడిని గమ్య స్థానం చేర్చే ఆర్టీసీ బస్సు.. సమ్మె కాలంలో ఒడిదొడుకులు ఎదుర్కొంది. 55 రోజుల తర్వాత ఉద్యోగులు విధుల్లో చేరారు. వారిపై ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాలు కురిపించారు. ఇచ్చిన హామీ మేరకు ఈనెల 2న సెప్టెంబరు నెల వేతనాలు పడ్డాయా? లేదా? ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఉద్యోగ కల్పన ఎంత వరకు వచ్చింది? నష్టాల్లో నడుస్తున్న సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి ఏం చేస్తున్నారు? ఇతర దూర ప్రాంతాలకు ఏమైన బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇన్నాళ్లు మరమ్మతులకు సరిగా నోచుకోని బస్సులకు ఎలా మరమ్మతులు చేస్తున్నారో ఖమ్మం ఆర్టీసీ రీజియన్‌ మేనేజర్‌ కృష్ణమూర్తితో ‘ఈనాడు’ ముఖాముఖి నిర్వహించింది. పలు అంశాలపై ఆర్‌ఎం స్పందన ఇలా ఉంది..

ప్ర: దూరప్రాంతాలకు వెళ్లే డ్రైవర్లకు విశ్రాంతి(రెస్టు) ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి?

ఆర్‌ఎం: విశ్రాంతిలేని వారిని పంపకూడదని చెబుతున్నాం. డ్రైవర్‌ ఉద్యోగాల ఖాళీ కారణంగా కొన్నిసార్లు వేయాల్సి వస్తోంది.

ప్ర శ్న: సమ్మెకాలంలో బస్సులకు నామమాత్రంగా కూడా మరమ్మతులు చేయలేదు. ప్రస్తుతం ఎలా చేస్తున్నారు?

ఆర్‌ఎం: నిర్వహణ షెడ్యూలు ప్రకారం చేస్తున్నాం. ఇవి నాలుగు రకాలు. షెడ్యూలు-1లో రోజూ మరమ్మతులు చేస్తాం. షెడ్యూలు-2లో వారానికి ఒకసారి, షెడ్యూలు-3లో పల్లెవెలుగులకు 12 వేల కి.మీ., ఎక్స్‌ప్రెస్‌ 15 వేల కి.మీ. తిరిగిన తర్వాత, షెడ్యూలు-4లో 36 వేల వరకు తిరిగిన బస్సులకు సాధారణ మరమ్మతులుంటాయి. ప్రణాళిక ప్రకారం ఈ మరమ్మతులు చేపడుతున్నాం.

ప్ర శ్న: లాభనష్టాలు వస్తున్న సర్వీసులెన్ని?

ఆర్‌ఎం: రీజియన్‌ పరిధిలో 613 సర్వీసులు ఉన్నాయి. వీటిలో 354 నష్టాలతో నడుస్తున్నాయి. మిగతావి లాభాల్లో ఉన్నాయి.

ప్ర శ్న: నష్టాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారు?

ఆర్‌ఎం: ఒక బస్సులో కనీసం 20 మంది ప్రయాణికులు ఉండాలి. అలా లేని రూట్లలో ట్రిప్పులను తగ్గిస్తున్నాం. ఆదాయం ఉన్న మార్గాలలో బస్సులను నడుపుతున్నాం. ఆదాయం వచ్చే రూట్లను గుర్తించి ప్రతిపాదన చేస్తున్నాం. నిర్వహణ ఖర్చు తగ్గించుకొంటున్నాం.

ప్ర: ప్రయాణికుల నుంచి వసూలు చేసే ‘రూపాయి సెస్సు’ను ఎలా ఖర్చు చేస్తున్నారు?

ఆర్‌ఎం: సెస్సు రూపేణా వచ్చే సొమ్ము ఆర్టీసీ ఆర్థిక(అకౌంట్స్‌) నుంచి ఇంజినీరింగ్‌ విభాగానికి వెళ్తుంది. ఆ సొమ్ముతో బస్టాండు శుభ్రత తదితర అవసరాలకు వినియోగిస్తున్నాం. ఉదాహరణకు.. ఖమ్మం బస్టాండులో 12 మంది కార్మికులు పని చేస్తున్నారు. వారు పరిశుభ్రత పనులు చేస్తారు. ప్రస్తుతం ఈ నిధులతో భద్రాచలం, కొత్తగూడెంలో మూత్రశాలల నిర్మాణానికి చర్యలు చేపట్టాం.

ప్ర: ఫాస్టాగ్‌ తీసుకుంటున్నారా?

ఆర్‌ఎం: సగం వరకు బస్సులకు ఇప్పటికే తీసుకున్నాం. మిగతా వాటికి కూడా తీసుకుంటాం.

ప్ర: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలపై ఎలాంటి కసరత్తు జరుగుతోంది?

ఆర్‌ఎం: తూచా తప్పకుండా అమలు పరుస్తాం. రీజియన్‌ పరిధిలో ముగ్గురు మరణించారు. వారి కుటుంబాలకు ఇచ్చిన హామీలు నెరవేరుతాయి. చైన్నె, బెంగళూరుకు బస్సును నడిపేందుకు కసరత్తు చేస్తున్నాం. బెంగళూరుకు నడిపేందుకు అనుమతులు వచ్చాయి.

ప్ర: మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల వరకే విధుల గురించి..

ఆర్‌ఎం: 273 మంది మహిళా సిబ్బంది ఉన్నారు. వీరిలో 115 మంది రాత్రి 8 గంటల వరకే పని చేస్తున్నారు. మిగతా వారికి అలాగే విధులు కేటాయించడానికి కసరత్తు చేస్తున్నాం.

ప్ర: ప్రస్తుతం ఏయే కార్డులు ఉన్నాయి?

ఆర్‌ఎం: విద్యార్థి/జర్నలిస్టు పాసులు, సీజనల్‌ టికెట్‌లు, క్యాట్‌ కార్డులు మాత్రమే ఉన్నాయి. 2020 మే 31వ తేదీ నుంచి క్యాట్‌ కార్డులు ఉండవు. కనీస ఛార్జీల ప్రకారం క్యాట్‌ కార్డు పని చేస్తుంది. చిల్లర కొరత నివారణకు చర్యలు చేపట్టారు.

ప్ర: కొత్తగా వచ్చే అద్దె బస్సుల గురించి..

ఆర్‌ఎం: 125 అద్దె బస్సులు కొత్తగా వస్తున్నాయి. వీటిలో 02 ఇప్పటికే వచ్చాయి. నిర్దేశిత 90 రోజుల్లో మిగతా బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయి.

ప్ర: ఇప్పటి వరకు రోజు వచ్చే ఆదాయం? ఛార్జీలు పెంచిన తర్వాత వచ్చే ఆదాయం?

ఆర్‌ఎం: గతంలో రోజుకు రూ.75 లక్షల ఆదాయం వచ్చేది. ఇపుడు ఆదనంగా మరో రూ.5 లక్షల వరకు వస్తుంది. సమ్మె కాలంలో తాత్కాలిక సిబ్బందికి రూ.5.27కోట్లు చెల్లించాం.

ప్ర: ప్రయాణికులకు, సిబ్బందికి మీరు ఇచ్చే సలహా?

ఆర్‌ఎం: సిబ్బంది విశ్రాంతి తీసుకోవడానికి తగిన సౌకర్యాలు కల్పిస్తున్నాం. రెస్టు రూంలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం కలిగించేందుకు మావంతు కృషి చేస్తున్నాం. చేయి చేయి కలిపితే మరింత మెరుగ్గా సత్ఫలితాలు వస్తాయి.

ప్ర: ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

ఆర్‌ఎం: స్వల్ప ప్రమాదాలు సంభవించినప్పుడు స్థానికంగా ఆర్‌.ఐ. ఆధ్వర్యంలో డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నాం. రక్తం కారేలా మేజర్‌ ప్రమాదాలు చేసే వారిని జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజ్‌(వరంగల్‌)కు పంపిస్తున్నాం. ప్రమాదాల నివారణకు తగిన సూచనలు చేస్తున్నాం. రాష్ట్ర/రీజియన్‌/డిపో స్థాయిలో నగదు పురస్కారాలు అందిస్తున్నాం.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.