close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

కళ తప్పిన చెరువులు

వర్షాలకు నిండింది 30 శాతమే

ఈ ఏడాదీ ఆరుతడి పంటలే

సగం నిండిన కోట్‌పల్లి ప్రాజెక్టు

ధారూర్‌, న్యూస్‌టుడే: వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక జిల్లాలో 30 శాతం చెరువులైనా నిండలేదు. అనంతగిరి గుట్టకు దిగువన ఉన్న మున్నూరుసోమారం, ఎబ్బనూర్‌ చెరువులు నిండగా.. చెంతనే ఉన్న ధారూర్‌ మండల పరిధిలోని చాలా చెరువులు, కుంటలు నీరు లేక వెలవెలబోతున్నాయి.

జిల్లాలో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో వాగులు, వంకల్లో అనుకున్న స్థాయిలో నీరు చేరలేదు. కురిసిన మోస్తరు వర్షాలు ఇప్పటికే సాగులో ఉన్న పంటలకు దోహదం చేశాయి. చెరువులు మాత్రం పూర్తి స్థాయిలో నిండలేదు. ధారూర్‌ మండల పరిధిలోని కోట్‌పల్లి ప్రాజెక్టు.. జిల్లాలోనే అతిపెద్ద సాగునీటి వనరు. పెద్దేముల్‌, ధారూర్‌ మండలాల్లోని 18 గ్రామాల రైతులకు సాగునీరు అందించేందుకు 1967లో ఈ ప్రాజెక్టు నిర్మించారు. దీని పూర్తి ఆయకట్టు 9200 ఎకరాలు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 24 అడుగులు ఉంది. వర్షాకాలంలో వాగులు, వంకల ద్వారా వచ్చే నీటితోనే ఈ చెరువు నిండుతుంది. పూర్తిస్థాయిలో నిండితే కుడి కాలువ ద్వారా 8100 ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 1100 ఎకరాలకు సాగునీరు అందించే నిర్మించారు. పంటల కాల్వలు శిథిలమవడం, చెరువులో పూడిక పేరుకుపోవడంతో పూర్తి స్థాయిలో నిండినా 6400 ఎకరాలకే సాగునీరు అందే అవకాశం ఉంది. గత రెండేళ్లుగా పూర్తిస్థాయిలో నిండకపోవడంతో ఆయకట్టు రైతులు వర్షాధార పంటలపైనే ఆధారపడుతున్నారు. ఈ ఏడాది అడపాదడపా కురిసిన వర్షాలకు 13 అడుగుల నీరు వచ్చింది. దీంతో ఆయకట్టు కింద రైతులు కంది, పత్తి పంటలకే పరిమితమయ్యారు. ప్రాజెక్టు అరకొరగా నిండటంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో బోరుబావుల్లో సైతం జలాలు అనుకున్నంతగా పెరగలేదని రైతులు చెబుతున్నారు.

పూర్తిగా నిండిన ఎబ్బనూర్‌ చెరువు

దిగువ ప్రాంతాల్లో జలకళ

ధారూర్‌ మండల పరిధిలోని మున్నూరుసోమారం, ఎబ్బనూర్‌ చెరువులు అనంతగిరి కొండలకు దిగువ ప్రాంతంలో ఉన్నాయి. మోస్తరు వర్షాలకే ఈ చెరువుల్లోకి నీరు వస్తుంది. దీంతో ఈసారి పడిన వర్షాలకు నిండిపోయాయి. మున్నూరుసోమారం చెరువు కింద ఆయకట్టు 247 ఎకరాలు ఉండగా, ఎబ్బనూర్‌ చెరువు కింద 220 ఎకరాలు ఉంది. నీరు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆయకట్టు రైతులు ఆరుతడి పంటలే సాగు చేస్తున్నారు.

మైలారం సమీపంలో చుక్కనీరు లేని మెండికుంట చెరువు

 

సర్పన్‌పల్లి ప్రాజెక్టు: గత రెండేళ్లుగా ఈ ప్రాజెక్టు నీరు అంతగా చేరలేదు. ఈ ఏడాది వర్షాకాలం ముగింపులో పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ఆ మాత్రమైనా నీరు వచ్చి చేరింది. రెండు పంట కాలువల కింద 3,288 ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ ప్రస్తుతానికి సాగునీరు అందించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

చుక్క నీరు చేరని మెండికుంట: ధారూర్‌ మండల పరిధిలోని మైలారం గ్రామ సమీపంలో ఉన్న మెండికుంట చెరువులోకి ఈసారి చుక్కనీరు చేరలేదు. దీంతో 278 ఎకరాల ఆయకట్టు రైతులు నిరాశకు గురయ్యారు. ఆరుతడి పంటలపైనే ఆధారపడాల్సి వస్తోందని పెదవి విరుస్తున్నారు.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.