close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

మక్కల నిల్వకే రైతుల మొగ్గు

 ధర పెరుగుదలతో సంతోషం

కొనుగోలు కేంద్రాల్లో అమ్మేందుకు అనాసక్తి

మర్పల్లిలో కొనుగోళ్లు లేక మూసివేసి ఉన్న గోదాం

మర్పల్లి, న్యూస్‌టుడే: మొక్కజొన్న ధర పెరుగుతుండటంతో పండించిన రైతు అమ్మకుండా వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ధర మరింత పెరుగుతుందన్న ఆశతో పంటను నిల్వ చేసుకొనేందుకు మొగ్గు చూపుతున్నారు. మర్పల్లి మండలంలో ఈసారి 2472 హెక్టార్లలో మక్క సాగు చేశారు. కోత ప్రారంభమవడంతో ఎకరానికి 15- 20 కింట్వాళ్ల వరకు దిగుబడి వస్తోంది. తొలుత ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలేదని రైతులు దిగాలు చెందారు. అధికారులు స్పందించి మండల కేంద్రంలోని విపణి ఆవరణలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటుచేశారు. రూ.1760 మద్దతు ధర ప్రకటించారు. అయినా గత 12 రోజులుగా ఒక్క బస్తా అయినా ఎవరూ విక్రయించలేదు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర కంటే బయట ఎక్కువ ధర పలుకుతుండటంతో దళారులకే అమ్ముతున్నారు. ఇంకా మక్కల ధరలు పెరుగుతాయన్న ప్రచారంతో ఎక్కువమంది పంటను కోశాక అమ్మకుండా నిల్వ చేస్తున్నారు.

గత ఏడాది రైతులంతా మక్కలు విక్రయించాక క్వింటాలు రూ.2 వేలు- రూ.2200 వరకు పెరిగింది. దీంతో రైతులు క్వింటాలుకు రూ.300- రూ.500 వరకు నష్టపోయారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాదీ అలాగే పెరగవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం దళారులు మద్దతు ధరకు కాస్త ఎక్కువగానే(రూ.1750- రూ.1800) కొనుగోలు చేస్తున్నా రైతులు పెద్దగా అమ్మేంతుకు ఇష్టపడటం లేదు. పెట్టుబడులు అధికమై, కుటుంబ అవసరాలకు తక్షణం డబ్బులు కావాల్సిన కొందరే అమ్ముతున్నారు. ఎక్కువమంది పంట నిల్వ చేసి, మంచి ధర కోసం ఎదురుచూస్తున్నారు.

నిల్వకు చోటేదీ?

రైతులు ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట నిల్వ చేసేందుకు స్థలాలు లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారు. ఈ ఏడాది సరైన సమయంలో వర్షాలు పడటంతో మక్కల దిగుబడి పెరిగింది. ఎక్కడచూసినా ఇళ్ల ముందు, సీసీ రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్నలే కనిపిస్తున్నాయి. ఇళ్లలో, ఇళ్ల ముందు నిల్వ చేసి టార్పాలిన్‌ పట్టలు కప్పుతున్నారు. గ్రామాల్లో గోదాంలు అందుబాటులో ఉంటే సురక్షితంగా నిల్వ చేసుకొని కావాల్సిన సమయంలో విక్రయించుకొనే వెసులుబాటు ఉండేదని పేర్కొంటున్నారు.

ధరలు పెరుగుతాయని అంటున్నారు

- శ్రీనివాస్‌, రైతు, పట్లూర్‌

నాలుగు ఎకరాల్లో మక్క సాగు చేశాను. దిగుబడి బాగా వస్తోంది. ఈసారి పెట్టుబడులు, కూలీల ఖర్చులూ ఎక్కువయ్యాయి. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే బయటి దళారులు ఎక్కువకే కొంటున్నారు. గత ఏడాది పంట కోసిన వెంటనే అమ్ముకొని మాతో పాటు చాలామంది రైతులు నష్టపోయారు. ధర మరింత పెరుగుతుందని చెబుతుండటంతో ఈ ఏడాది మంచి ధర కోసం ఎదురుచూస్తున్నాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.