close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

నేరం ఎవరిది? పరీక్ష ఎవరికి?

9 పాఠశాలలు.. 196 మంది విద్యార్థులు

‘నామినల్‌ రోల్స్‌’ నిలిపివేతతో ఆందోళన

లబోదిబోమంటున్న తల్లిదండ్రులు

పాల్వంచ సాంస్కృతికం, న్యూస్‌టుడే

విద్య వ్యాపారంగా మారడం.. ఆ శాఖ పర్యవేక్షణ కొరవడటం.. వెరసి జిల్లాకు చెందిన పలువురు పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వార్షిక పరీక్షలు రాయడంపై నీలినీడలు కమ్ముకొన్నాయి. పాఠశాల యాజమాన్యాల నిర్లక్ష్యమే విద్యార్థులను ఈ స్థితికి తీసుకొచ్చింది. జిల్లాలోని పలు మండలాలకు చెందిన తొమ్మిది ప్రైవేటు పాఠశాలలకు అనుమతి లేకపోవడంతో పదో తరగతి విద్యార్థుల ‘నామినల్స్‌ రోల్స్‌’ పక్రియను నిలిపేశారు. ఆయా బడుల్లో అభ్యసిస్తున్న 196 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రస్తుతం ప్రమాదంలో పడిపోయింది.

జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వందల సంఖ్యలో ప్రైవేటు పాఠశాలలు నడుస్తున్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలల నుంచి ఉన్నత పాఠశాలల వరకు తరగతులు బోధిస్తున్నాయి. ‘విద్యాహక్కు చట్టం’ అమలు విషయంలో ఆ శాఖ పర్యవేక్షణ తీసికట్టుగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఎన్ని ప్రైవేటు పాఠశాలలకు అనుమతులున్నాయి? వేటికి లేవు? సకాలంలో రెన్యువల్‌ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నాయా? పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నాయా? అనే పరిశీలన జరుగుతున్న దాఖలాల్లేవు. ఈ సమాచారం విద్యా శాఖాధికారుల వద్ద లేదంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్ఛు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలు అనేకం ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చివరకు కొన్ని హైస్కూల్స్‌ సైతం తమ విద్యార్థుల వివరాలను ‘నామినల్‌ రోల్స్‌’ చేయించడం లేదంటే వారికి విద్యాశాఖ అంటే ఎంత భయం ఉందో చేసుకోవచ్ఛు అనుమతి లేని పాఠశాలలను పరీక్ష రుసుం చెల్లింపు తేదీల వరకు కూడా గుర్తించకపోవడంపై తల్లిదండ్రుల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. జిల్లా విద్యా శాఖాధికారులు ఇలా నిబంధనలకు నీళ్లు వదిలేయడం వల్లే అనుమతిలేని విద్యాలయాలు పుట్టుకొస్తున్నాయని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల ఉన్న చోట మరో పాఠశాలకు కి.మీ. దూరం దాటాక మాత్రమే ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి. జనాభా ప్రాతిపదికగా తీసుకోవాలి. ఇదీ విద్యాశాఖ నిబంధన. ప్రస్తుతం జిల్లాలో పలు మండలాల్లో ఇలాంటి నిబంధనేదీ అమలు చేయడం లేదన్న వాదన ప్రస్తుతం తెరమీదకు వచ్చింది.

నామినల్‌ రోల్స్‌ అంటే..

‘పది’ వార్షిక పరీక్షలకు హాజరుకానున్న విద్యారులకు సంబంధించిన పేరు, తల్లిదండ్రుల పేరు, పాఠశాల, ఆధార్‌ సంఖ్యతో పాటు ఫొటోలను విద్యాశాఖ కార్యాలయానికి పంపాలి. వారు వాటిని పరిశీలించి హాల్‌టికెట్‌ను జారీ చేస్తారు. అనుమతి లేని యాజమాన్యాలకు చెందిన ఈ వివరాలను నిబంధనల ప్రకారం అధికారులు పరిగణనలోకి తీసుకోరు.

ఎవరి ఇష్టం వారిదే

జిల్లాలోని కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు విమర్శలున్నాయి. విద్యార్థుల భవిష్యత్తు కన్నా వ్యాపారమే ముఖ్యంగా ‘అనుమతుల’ జూదం ఆడుతున్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. పైరవీలతో ఎలాగోలా అనుమతి సాధించవచ్చన్న నిర్లక్ష్యంతో తుదకంటా ఆలస్యం చేస్తున్నారు. విద్యాశాఖలోని కొందరు అధికారుల సహకారంతో ఎలాగోలా ఏటేటా పబ్బం గడుపుతూ వస్తున్నారు. ఈ ఏడాదీ ఇదే జరుగుతుందన్న పలు పాఠశాలల యాజమాన్యాల అంచనా ‘నామినల్‌ రోల్స్‌’ విషయానికి వచ్చే సరికి తప్పినట్లు తెలుస్తోంది. గతంలో పాల్వంచలోని ఓ ప్రైవేట్‌ పాఠశాల అనుమతి విషయంలో డబ్బులు వసూలు చేసి విద్యాశాఖ సిబ్బంది అనిశాకు పట్టుబడిన సంఘటన ఇక్కడ ప్రస్తావనార్హం. ప్రధానంగా జిల్లాలో ఒకే పేరు మీద పలు ప్రాంతాల్లో బ్రాంచీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నిబంధన ప్రకారం అనుమతి ఉన్న పాఠశాలల జాబితాలను విద్యా శాఖ తన వెబ్‌సైట్‌లో పొందుపరచాల్సి ఉన్నా అలా చేయడం లేదు.


ఆ తొమ్మిది పాఠశాలల్లో..

నామినల్‌ రోల్స్‌ నమోదు కాని పాఠశాలలు జిల్లాలో మొత్తం తొమ్మిది ఉన్నాయి. మణుగూరు మండలంలో 3 పాఠశాలల్లో 102 మంది, ఆళ్లపల్లి మండలంలోని ఓ పాఠశాలలో 5, కొత్తగూడెంలోని 2 పాఠశాలల్లో 47, పాల్వచంలోని ఓ విద్యాలయంలో 2, భద్రాచలానికి చెందిన ఓ హైస్కూల్‌లో 13, పినపాక మండలం ఏడూళ్ల బయ్యారంలోని మరో పాఠశాలకు చెందిన 27 మంది పది విద్యార్థుల వివరాలు విద్యాశాఖలో నమోదు కాలేదు.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం

పి.సరోజినీదేవి, డీఈవో

జిల్లాకు చెందిన కొన్ని ప్రైవేట్‌ పాఠశాలలకు గుర్తింపు లేకపోవడంతో ‘నామినల్‌ రోల్స్‌’ ఇవ్వలేదు. నమోదుకు ఇటీవల గడువు పూర్తయ్యింది. గుర్తింపు లేని పాఠశాలల పిల్లల పరిస్థితి గురించి ఆర్జేడీ దృష్టికి తీసుకెళ్తాం. ఈనెల 12 వరకు రూ.500 అపరాధ రుసుంతో పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లించే వెసులుబాటు ఉంది. ఉన్నతాధికారులు అనుమతిస్తే ఆయా పాఠశాలల నుంచి ‘నామినల్‌ రోల్స్‌’ తీసుకుంటాం.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.