close

శనివారం, జనవరి 25, 2020

ప్రధానాంశాలు

అమెరికా నుంచి వేసిన ఎర

అనిశాకు చిక్కిన లైన్‌ఇన్‌స్పెక్టర్‌

మల్లారెడ్డి సహాయకుడు డీకొండ వెంకటేశ్వర్లు

ఖమ్మం రోటరీనగర్‌, న్యూస్‌టుడే: విద్యుత్తు శాఖలో అవినీతి పర్వం గుట్టురట్టయింది. ప్రతి చిన్నపనికీ చేయితడపనిదే పనికాదన్న అపవాదును నిజం చేస్తూ ఖమ్మం నగరంలో ఓ విద్యుత్తు ఉద్యోగి శనివారం లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు. బాధితుడు అమెరికాలో ఉంటూనే అనిశాకు ఉప్పందించి ఉద్యోగిని పట్టించారు. రూ.20వేలు లంచం తీసుకుంటూ లైన్‌ఇన్‌స్పెక్టరు సిజాహుద్దీన్‌ చిక్కడం సంచలనం కలిగించింది.

నగదు డిమాండ్‌: నగరంలోని ఓ ప్రయివేటు పాఠశాల సమీపంలో బహుళ అంతస్తుల భవనం సాక్షి రెసిడెన్సీని బొక్కా మల్లారెడ్డి అనే వ్యక్తి నిర్మిస్తున్నారు. మల్లారెడ్డి అమెరికాలో ఉండటంతో భవన నిర్మాణ పనులను లక్ష్మారెడ్డి అనే వ్యక్తికి అప్పగించి డీకొండ వెంకటేశ్వర్లును పర్యవేక్షకునిగా నియమించుకున్నారు. భవనానికి అవసరమైన విద్యుత్తు నియంత్రిక ఏర్పాటుకు రెండు నెలల క్రితం డీడీ చెల్లించి దరఖాస్తు చేశారు. నియంత్రిక ద్వారా విద్యుత్తు కనెక్షను ఇచ్చేందుకు ధంసలాపురం ఉపకేంద్రంలో పనిచేస్తున్న విద్యుత్తు శాఖ సిబ్బంది రూ.50వేలు డిమాండ్‌ చేస్తున్నారని వెంకటేశ్వర్లు తన యజమాని మల్లారెడ్డికి తెలిపారు. దీనిపై పలుమార్లు చర్చించిన అనంతరం రూ.20వేలు చెల్లించేందుకు అంగీకరించిన మల్లారెడ్డి ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అధికారులు వలపన్ని నగదు ఇచ్చేందుకు వెంకటేశ్వర్లును పంపారు. కనెక్షనుకు అవసరమైన సామగ్రి ఇచ్చేందుకు నగరంలోని ఇల్లెందు క్రాస్‌రోడ్డులోని విద్యుత్తు శాఖ స్టోర్‌ వద్దకు ఎల్‌ఐ రమ్మన్నాడు. రహదారిపై వెంకటేశ్వర్లు నుంచి ఎల్‌ఐ సిజాహుద్దీన్‌ నగదు తీసుకుంటుండగా ప్రత్యక్షంగా పట్టుకున్నారు. వెంటనే అదుపులోకి తీసుకుని నగదును సీజ్‌ చేసిన అనిశా డీఎస్పీ మధుసూదన్‌ విచారణ చేపట్టారు. విచారణలో ఏసీబీ సీఐ రమణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

పై అధికారిపై ఆరోపణ

నియంత్రిక ఏర్పాటు తన పరిధి కాదని ఎల్‌ఐ సిజాహుద్దీన్‌ అనిశా అధికారుల వద్ద వాపోయాడు. తన పై అధికారి ఆదేశాల మేరకు నగదు తీసుకునేందుకు వెళ్లినట్లు ఆయన రాతపూర్వకంగా అధికారులకు వివరించాడు. ఈ భవనానికి ఏర్పాటు చేసే నియంత్రికను ఈనెల 5వ తేదీనే స్టోర్‌ నుంచి విడుదల చేశారు. మిగిలిన ఏబీ స్విచ్‌, ఎర్త్‌పైపు, ఇతర సామగ్రి ఇచ్చేందుకు స్టోర్‌ వద్దకు రమ్మన్నారని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో విచారణ జరిగితే మరిన్ని వివరాలు వెలుగుచూసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.