close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

ఉరుకులు.. పరుగులు

3.5 గంటలపాటు ఆస్పత్రిలో ఎన్‌హెచ్‌ఆర్సీ బృందం

భద్రతను సమీక్షించిన జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ (నేరవిభాగం)

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటరు నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి వద్ద రెండోరోజు శనివారం కూడా పోలీసుల ఉరుకులు.. పరుగులు కనిపించాయి. నిందితుల మృతదేహాల పరిశీలనకు జాతీయ మానవహక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్సీ) వస్తుండటంతో ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. జనరల్‌ ఆస్పత్రి పర్యవేక్షకులు డా|| రాంకిషన్‌తోపాటు ఇతర వైద్యబృందం వచ్చే సభ్యులకు పోస్టుమార్టం వివరాలను తెలిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మొత్తంగా మూడున్నర గంటలపాటు సుదీర్ఘంగా జాతీయ మానవహక్కుల సంఘం సభ్యులు దిశ కేసులో నిందితుల పోస్టుమార్టం వివరాలను సమీక్షించారు. అనంతరం వీరు తిరుగు ప్రయాణం కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుల మృతదేహలను మరో రెండు రోజులపాటు జనరల్‌ ఆస్పత్రిలో భద్రపరచనున్నారు.

శనివారం మధ్యాహ్నం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి వచ్చిన జాతీయ మానవహక్కుల సంఘం వెంట నేరవిభాగం డీసీపీ రోహిణి ప్రియదర్శిని వచ్చారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి, జనరల్‌ ఆస్పత్రి పర్యవేక్షకులు డా|| రాంకిషన్‌ ఈ బృందానికి సహకరించారు. మొదట నేరుగా మార్చురీ గదికి వెళ్లారు. అక్కడ పోస్టుమార్టం చేసిన ఫోరెన్సిక్‌ బృందం లేదని తెలియడంతో జనరల్‌ ఆస్పత్రి పర్యవేక్షకుడి గదికి వచ్చారు. అక్కడ అధికారులతో సమీక్షించాక మార్చురీ గదికి వెళ్లారు. ఫోరెన్సిక్‌ నిపుణుల బృందంతో కలిసి మృతదేహలను పరిశీలించారు. కొద్దిసేపు అధికారులతో చర్చించిన అనంతరం సాయంత్రం తిరుగు ప్రయాణం అయ్యారు.

సాధారణంగా జాతీయ మానవహక్కుల సంఘం సభ్యులు వస్తున్నారంటే ముందుగా వారి పర్యటనకు సంబంధించిన వివరాలు పోలీసులకు చేరుతాయి. ఆ మేరకు అవసరమైన భద్రతా చర్యలను తీసుకుంటారు. శనివారం వచ్చిన బృందం ఆ వివరాలేవీ పోలీసులకు ఇవ్వలేదు. ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరాక మొదట ఘటనా స్థలి అయిన చటాన్‌పల్లి వద్ద ఆగుతారని అందరూ అనుకున్నారు. అనూహ్యంగా వారు నేరుగా మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి వచ్చారు. మొత్తానికి జాతీయ మానవహక్కుల సంఘం సభ్యుల పర్యటన ముగిసేవరకు పోలీసు అధికారులు.. సిబ్బంది ఉరుకులు పరుగుల మధ్య కనిపించారు. ఉదయం తొమ్మిది గంటలకే ఆస్పత్రికి వచ్చిన పోలీసులు 11.00 గంటల నుంచి భద్రతను కట్టుదిట్టం చేశారు. కేవలం ఆస్పత్రి సిబ్బందిని.. రోగులను పరిశీలించి మరీ అనుమతించారు. మీడియాను లోపలికి పంపించలేదు. వారి కన్ను గప్పి లోపలికి వెళ్లినవారిని పోలీసులు మళ్లీ బయటికి తీసుకువచ్చారు. సాయంత్రం అయిదు గంటల వరకు ఇలాగే ఎవరినీ లోనికి అనుమతించలేదు. పోస్టుమార్టం గది వద్ద పోలీస్‌ పికెటు ఏర్పాటు చేశారు.

ఇక్కడే మృతదేహాలు : హైకోర్టు ఆదేశాలతో.. సోమవారం వరకు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలోనే మృతదేహాలను అధికారులు భద్రపరుస్తున్నారు. గాంధీ హాస్పిటలుకు తరలిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని జనరల్‌ ఆస్పత్రి అధికారులు కొట్టిపడేశారు. మృతదేహాల కోసం ప్రత్యేకంగా ఫ్రీజర్లు తెప్పించామని, మరో పది రోజులైనా ఇలాగే భద్రపరిచే అవకాశం ఉందని తెలిపారు. ఫోరెన్సిక్‌ నిపుణుల నివేదిక వచ్చేందుకు ఇంకా మూడు రోజుల సమయం పట్టే అవకాశముంది. మృతదేహాలను బుధవారంలోపు బంధువులకు అప్పగిస్తామని గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్‌ విభాగ అధిపతి డా.కృపాల్‌సింగ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.