close

మంగళవారం, జనవరి 28, 2020

ప్రధానాంశాలు

ఆలయాల చెరత.. వాహన నిలుపుదలకు చింత

స్థలం లేక ఇబ్బందులు ●

దూరప్రాంత భక్తులకు తప్పని అవస్థలు

న్యూస్‌టుడే, అలంపూర్‌

ఆలయ ప్రాంగణం ముందు నిండి పోయిన వాహనాలు

కోటి లింగాలకు నిలయమైన బాల బ్రహ్మేశ్వర స్వామి, అష్టాదశ శక్తిపీఠాల్లో అయిదో శక్తి పీఠమైన జోగులాంబ ఆలయాల దర్శనానికి నిత్యం వందలాది కిలోమీటర్ల నుంచి భక్తులు వస్తుంటారు. సెలవు రోజులు, మహా శివరాత్రి, దేవీ నవరాత్రులు, వార్షిక బ్రహ్మోత్సవాలు తదితర పర్వదినాల సమయంలో కుటుంబంతో సహా భక్తులు వాహనాల్లో వస్తుంటారు. ఆయా వేళల్లో రద్దీ మరింత అధికంగా ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే భక్తులు ఆలయాల ప్రాంగణంలోని వాహన పార్కింగ్‌ స్థలం వద్ద అవస్థలు పడాల్సి వస్తోంది. స్థలం సరిపోక పుష్కర్‌ఘాట్‌ వద్ద వాహనాలను నిలిపేందుక అనుమతిస్తున్నారు. వాహన పార్కింగ్‌ రుసుం చెల్లిస్తున్న భక్తులు తమ వాహనాలకు నీడ సౌకర్యం ఏదని ప్రశ్నిస్తున్నారు. ఏడాది క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు కారు నిలిపి దర్శనానికి వెళ్లగా వేడి పెరగడంతో ఇంజిన్‌ నుంచి మంటలు వ్యాపించాయి. అక్కడ ఉన్న భక్తులు గమనించి తక్షణమే నీరు చల్లడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. పార్కింగ్‌ ద్వారా ఏటా రూ.10 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నా.. భక్తుల వాహనాలకు మాత్రం సరైన సౌకర్యం కల్పించడం లేదు.

నిర్మాణాలు చేస్తే కేసులే.. : కృష్ణా పుష్కరాల వేళ 2016లో ఆలయాల అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చినా.. ఇప్పటికీ నెరవేరలేదు. మళ్లీ తుంగభద్ర పుష్కరాలు వచ్చే ఏడాది రానున్నాయి. ఆలయాల ముందు భాగంలో దాదాపు మూడు నుంచి నాలుగు ఎకరాల మేరకు ఖాళీ స్థలం ఉన్నా.. పురావస్తు శాఖ అధీనంలో ఉంది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేసినా సంబంధిత ఈవోపై ఆ శాఖ అధికారులు కేసులు నమోదు చేయిస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి శక్తిపీఠం దర్శనానికి వచ్చే సాధారణ భక్తులతో పాటు వీఐపీల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరిగింది. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో పాటు అత్యున్నతాధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. శుక్ర, ఆదివారంలో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఆయా రోజుల్లో వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం.

ఆలయాల చుట్టూ నివాస గృహాలు..

ఆలయాలకు చుట్టూ నివాస గృహాలు ఉండటంతో ఎక్కడ ఖాళీ ప్రదేశం లేదు. ఆలయాలకు సమీపంలో ప్రభుత్వ స్థలాలు కూడా లేక పోవడంతో ఇబ్బందికరంగా ఉంది. రద్దీ రోజుల్లో ప్రభుత్వ కళాశాల నుంచి ఆలయాల వరకు రాకపోకలకు అంతరాయం ఉంటోంది. ఆలయాలకు వెళ్లే రోడ్లు సైతం ఇరుకుగా ఉన్నాయి. వచ్చే ఏడాది తుంగభద్ర పుష్కరాలు రాబోతున్నాయి. అప్పటి వరకైనా వేల సంఖ్యలో వచ్చే వాహనాలకు పార్కింగ్‌ సమస్య పరిష్కరిస్తారా లేదా అని భక్తులు పేర్కొంటున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం..

పార్కింగ్‌ సమస్యపై ఉన్నతాధికారులకు నివేదించాం. ఆలయాల సమీపంలో ఎక్కడా ఖాళీ స్థలం లేదు. ప్రస్తుతం పార్కింగ్‌ ప్రదేశంలోనే గుంతలు ఉంటే సరి చేయించాం. పురావస్తు శాఖ పరిధిలో ఉండటంతో ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేసేందుకు అవకాశం లేదు. ఆలయాల చుట్టూ ఇళ్లు ఉండటం.. విస్తరణ, అభివృద్ధి పనులకు ఆటంకంగా ఉంది.

- ప్రేమ్‌కుమార్‌, ఈవో, అలంపూర్‌ ఆలయాలు

రోజు వచ్చే వాహనాలు ఇలా..

 

సాధారణ రోజుల్లో : 60 నుంచి 80 వాహనాలు

శుక్ర, ఆదివారం : 100కు పైగా వాహనాలు

ఉత్సవాల రోజున : 500 నుంచి 600కు పైగా వాహనాలు వస్తాయి

అమావాస్య రోజు : 100 నుంచి 120 వరకు

కార్తిక మాసం, ఇతర ఉత్సవాల్లో : 120 నుంచి 150కిపైగా

మరిన్ని వార్తలు

తాజా వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.