close

ఆదివారం, జనవరి 26, 2020

ప్రధానాంశాలు

ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు ఊరట

రాత్రి 8 గంటల వరకే విధులు

పోలకు చేరిన ఉత్తర్వులు

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ గ్రామీణం

కల్వకుర్తి బస్సులో ప్రయాణికులకు టికెట్లు ఇస్తున్న మహిళా కండక్టర్‌

ఆర్టీసీలో మహిళా ఉద్యోగులకు ఊరట లభించింది. సమ్మె అనంతరం ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు పిలిపించుకొని మాట్లాడుతూ.. పలు వరాలు ఇచ్చిన విషయం విధితమే. వరాల అమలులో భాగంగా మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకు మాత్రమే విధులు కేటాయించాలని సీఎం ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై ఆర్టీసీ మహిళా ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. డిపోలకు ఉత్తర్వులు రావడంతో వాటిని అమలు చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఆర్టీసీ అధికారుల కసరత్తు..: ఇన్నాళ్లు బస్సుల వేళలపై అంతగా దృష్టి సారించని ఆర్టీసీ అధికారులు సీఎం ఉత్తర్వులతో మహిళా ఉద్యోగులను రాత్రి 8 గంటలకే ఇంటికి పంపేలా వేళల విషయంలో కసరత్తు ప్రారంభించారు. డిపో నుంచి బస్సు బయలుదేరే సమయం, తిరిగి చేరుకునే సమయాన్ని (రన్నింగ్‌టైం) డ్యూటీ చార్టులపై పక్కాగా నమోదు చేస్తున్నారు. బస్టాండ్‌ లేదా డిపో నుంచి నిర్ణీత గమ్యస్థానం చేరుకునే రూట్‌ సమయాన్ని కుదించినట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న భూత్పూర్‌ మండలం కర్వెనకు వెళ్లాల్సిన పల్లెవెలుగు బస్సు ఇన్నాళ్లు 40 నిమిషాల్లో చేరుకోవాలని ఉండేది. ఇప్పుడీ సమయాన్ని 25 నిమిషాలకు కుదించారని, 20 కి.మీ. దూరం ఉన్న బాదేపల్లి పాతబస్టాండ్‌కు 40 నిమిషాల్లో చేరుకోవాల్సి ఉండగా.. దాన్నికూడా కుదించారని ఆర్టీసీ సిబ్బంది పేర్కొంటున్నారు. ఈ మార్పులతో సిబ్బంది సకాలంలో విధులు ముగించుకొని త్వరగా ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మిగతా హామీలకు ఎదురుచూపులు : సీఎం ఇచ్చిన హామీల్లో మిగతావాటిపై కూడా మహిళా ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. డిపోల్లో ప్రత్యేకంగా మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకొనేందుకు గది ఏర్పాటుపై కూడా ఆర్టీసీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. పిల్లలకు బోధనా రుసుంలో రాయితీ, గృహ నిర్మాణ పథకం, ప్రసూతి సెలవులు, మూడు మాసాల శిశు సంరక్షణ సెలవులు తదితర వాటిపై మహిళా ఉద్యోగులు ఆశతో ఎదురు చూస్తున్నారు.

ఉత్తర్వుల అమలుకు చర్యలు..: ఆర్టీసీలో ఎప్పటిలాగే రూట్‌ వేళలు అమలు చేస్తున్నాం. ఏఒక్క రూటులో ఇప్పటి వరకు రన్నింగ్‌ టైం కుదించలేదు. ఉత్తర్వుల మేరకు మహిళా కండక్టర్లను రాత్రి 8 గంటల లోపు ఇళ్లకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. వారికి డిపోల్లో దుస్తులు మార్చుకోవడానికి గదులు, మరుగుదొడ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం

- అశోక్‌రాజు, డీఎం, మహబూబ్‌నగర్‌

స్పెషల్‌ ఆఫ్‌ సమయం తగ్గిస్తేనే సాధ్యం..: మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకే ఇళ్ల చేరుకోవాలని సీఎం ఇచ్చిన హామీ సంతోషంగా ఉంది. అయితే ఇపుడున్న డ్యూటీ చార్టుల్లో మార్పులు చేస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. స్పెషల్‌ ఆఫ్‌ డ్యూటీకి 14 గంటల సమయం పడుతోంది. జిల్లాలో చాలా రూట్లు సరిగా లేవు. అందుకే సయమంతోపాటు కిలోమీటర్లు కూడా తగ్గించాలి.

- ఎస్‌.కళమ్మ, కండక్టర్‌, మహబూబ్‌నగర్‌

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.