close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

అంతులేని కథ.. ఆప్తులకు వ్యధ

హతులెవరో..? హంతకులెవరో..?

దారి తప్పిన దర్యాప్తులు

పేరుకుపోతున్న కేసులు

చోరీ సొత్తు స్వాధీనంలోనూ వెనుకంజ

వేధిస్తున్న పోలీసు సిబ్బంది కొరత

* యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురంలో మూడు నెలల క్రితం ఓ మహిళపై దుండగులు అత్యాచారం చేసి హతమార్చారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నేటికీ బలమైన ఆధారాలు లభ్యం కాలేదు. దీంతో దోషులను పట్టుకోలేకపోయారు.

* మూడేళ్ల క్రితం 22 సంవత్సరాల యువతిని ఎక్కడో హత్య చేసి నల్గొండ జిల్లాకేంద్రంలోని లెప్రసీ కాలనీ ప్రాంతంలోని వ్యవసాయ భూమి వద్ద మృతదేహాన్ని వదిలి వెళ్లారు. నేటికీ ఆ యువతి ఎవరు, ఆమెను హత్య చేసిందెవరు అనే వివరాలు తెలియ రాలేదు. స్థానిక టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

భువనగిరి నేరవిభాగం, న్యూస్‌టుడే:

నేరస్థుడు తప్పు చేసినప్పుడు భయాందోళనలో ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తాడు. ఏదైనా ఆధారం ఘటనా స్థలంలో వదిలి వెళ్తాడు. పోలీసులు ఆ ఆధారాన్ని పట్టుకొని విభిన్న కోణాల్లో విచారించి చివరకు దోషుల ఆటకట్టిస్తారు. ఇటీవల కొన్ని కేసుల దర్యాప్తులో మాత్రం పోలీసులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేరస్థుడు పోలీసులకంటే తెలివిగా వ్యవహరించడమే కారణమా..? అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఏటా వందల సంఖ్యలో కేసులు దర్యాప్తు దశలో అపరిష్కృతంగా ఉండటమే ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. సంవత్సరాలు గడుస్తున్నా.. బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు. నేరస్థులు దొరకుండా తప్పించుకొని దర్జాగా తిరుగుతున్నారు. పోలీసులు అధికారులు మాత్రం సిబ్బంది కొరతతో కేసులు పేరుకుపోతున్నాయని దాటవేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీడని మిస్టరీలపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

ఎక్కడో హత్యలు జరుగుతాయి.. కానీ, మృతదేహాలను శివారు ప్రాంతాల్లో పడేస్తారు.. ఇక ఏళ్లు గడిచినా సరైన ఆనవాళ్లు లేకపోవడం, ఆచూకీ దొరకక మృతదేహాల వివరాలు బయటకు రావు. వీటిని ఛేదించడంలో పోలీసులు ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉన్నారు. గుర్తుపట్టని మృతదేహాల ఘటనల వెనుక ఎవరి హస్తం ఉంటుందనే విషయం నేటికీ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. జిల్లా పోలీస్‌ యంత్రాంగం అటుపైపు నిఘా విభాగంతో పరిశోధించినట్లయితే గుర్తు పట్టని మృతదేహాల వివరాలు వేగంగా వెలుగులోకి వచ్చే అవకాశాలుంటాయి. కానీ, యంత్రాంగం ‘చూసీ’చూడనట్లుగా వదిలివేయడంతోనే ఉమ్మడి జిల్లాలో గుర్తుతెలియని మృతదేహాల సంగతి మిస్టరీగానే మిగిలిపోతున్నాయి.

శివారు ప్రాంతాలే అనుకూలం

హైదరాబాద్‌కు సమీపంలో నల్గొండ జిల్లా ఉండటంతో దండుమల్కాపురం, చౌటుప్పల్‌, గ్రామీణ ప్రాంతాలు, సంస్థాన్‌ నారాయణపురంతోపాటు నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్‌ బైపాస్‌రోడ్డు, లెప్రసీకాలనీ ఏరియా, కోదాడ రూరల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాకు సమీపంలో దేవరకొండ శివారు గ్రామాల ప్రాంతాలు, ఘట్‌కేసర్‌, భువనగిరి శివారు గ్రామాలు, ఆలేరు, జనగామ శివారు ప్రాంతాల్లో ఇలాంటి గుర్తు తెలియని మృతదేహాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. హంతకులు తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో హత్యలు చేసి ఎలాంటి ఆధారాలు లభ్యం కాకుండా మృతదేహాలను రోడ్డు వెంటనే కాల్చివేయడం, వదిలి వెళ్లడం పరిపాటిగా మారింది.

గుర్తుతెలియని మృతదేహాలకు నిలయం

హైదరాబాద్‌కు సమీపంలో యాదాద్రి భువనగిరి జిల్లా సరిహద్దు ఉండటంతో గుర్తుతెలియని మృతదేహాలకు సంబంధించిన కేసులు జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నాయి. వేరే ప్రాంతాల్లో ఆఘాయిత్యాలు, హత్యలకు పాల్పడి ఆధారాలు లభ్యం కాకుండా మృతదేహాలను తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్తున్నారు. గుర్తుతెలియని మృతదేహాలుగా స్థానిక పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఆధారాలు దొరకకపోవడంతో వాటి ఆచూకీ లభ్యం కావడంలేదు. హైదరాబాద్‌ శివారులో హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న కన్నతల్లి రజితను ప్రియుడితో కలిసి కూతురు హత్య చేసి మృతదేహాన్ని రామన్నపేట రైలుపట్టాల పక్కన వదిలేసిన కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. మొదట్లో గుర్తుతెలియని మహిళగా భావించిన పోలీసులు దర్యాప్తు అనంతరం కూతురే హత్య చేసినట్లు బయటపడింది. ఎక్కడో హతమార్చి మృతదేహాలను జిల్లా సరిహద్దు మండలాల్లో నిర్మానుష్య ప్రదేశాలు, రైలుపట్టాల వెంట పడేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రెండు హత్య కేసుల్లో దోషులను పట్టుకోలేక పోయారు. యాదాద్రి జిల్లాలో 2018లో నలుగురు, 2019లో ఐదుగురు అదృశ్యమయ్యారు. నేటికీ వారి ఆచూకీ లభించలేదు.

 

నేరాలు జరిగే ప్రాంతాలపై నిఘా

 

కె.నారాయణరెడ్డి, డీసీపీ, యాదాద్రి భువనగిరి

పెండింగ్‌ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాం. దర్యాప్తులో లభ్యమైన కీలక ఆధారాలతో నిందితులను గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. మిస్సింగ్‌ కేసులుగా నమోదవుతున్న వాటిలో చిన్న చిన్న కారణాలతో ఇంట్లో నుంచి వెళ్లిపోయినవే ఎక్కువగా నమోదవుతున్నాయి. వారిని వెంటనే గుర్తించి తిరిగి ఇంట్లో అప్పగిస్తున్నాం. నేరాలు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతంలో నిఘా పెంచాం.

* రెండున్నరేళ్ల క్రితం నల్గొండ జిల్లా అనిశెట్టిదుప్పలపల్లి ప్రాంతంలో 40 ఏళ్ల యువకుడిని ఎక్కడో చంపి తీసుకొచ్చి కారు టైర్ల మీద వేసి దహనం చేశారు. తిప్పర్తి ఠాణాలో కేసు నమోదైంది. నేటికీ ఆ యువకుడి ఆచూకీ తెలియలేదు.

* రెండేళ్ల క్రితం మామిళ్లగూడెం వద్ద ఓ యువకుడిని చంపి చెట్లపొదల్లో పడేశారు. నేటికీ ఆ మృతదేహం వివరాలు వెలుగులోకి రాలేదు.

* ఏడాది క్రితం ఎక్కడో హత్య చేసిన మహిళా మృతదేహాన్ని నల్గొండ జిల్లాకేంద్రంలోని మర్రిగూడ బైపాస్‌ ప్రాంతంలో పెట్రోల్‌ పోసి కాల్చి చంపారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నేటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు.

* సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం రామన్నగూడెంలో దుండగులు ఒక వృద్ధున్ని వారం రోజుల క్రితం హతమార్చారు. ఘటనా స్థలంలో నేరస్థులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టినా చిన్న ఆధారం లభించలేదు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ నిర్వహిస్తున్నారు.

* బొమ్మలరామారంలో ఓ పరిశ్రమ సమీపంలో చెట్టుకు అస్థిపంజరం వేలాడుతున్న ఘటన తాజాగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆ అస్థిపంజరం పరిశ్రమలో పనిచేస్తూ జులైలో అదృశ్యమైన కార్మికుడిదా.. ఎక్కడో హత్యచేసి ఇక్కడకు తీసుకొచ్చి వేశారా అనే సందేహాలు వెల్లువెెత్తుతున్నాయి.

గుట్టుతేలని చోరీలు

* ఈ ఏడాది ఫిబ్రవరిలో నల్గొండ జిల్లాకేంద్రంలోని ఆబ్కారీ సీఐ ఇంట్లో రూ.30 లక్షల నగదు, 30 తులాల బంగారం నగలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. అదే రోజు వరుసగా ఆరు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. కేసు నమోదు చేసిన పోలీసులు ఇంత వరకు దొంగలను పట్టుకోలేక పోయారు.

* ఏడాది క్రితం మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ ప్రాంతంలోనూ వరుసగా నాలుగు ఇళ్లల్లో చోరీలు జరిగాయి. మొత్తం 15 తులాల బంగారం, రూ.2 లక్షలు ఎత్తుకెళ్లిన దుండగుల ఆచూకీ నేటికీ తెలియలేదు.

* దేవరకొండ బస్టాండు సమీప హనుమాన్‌నగర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో జరిగిన చోరీలో 10 తులాల బంగారం ఆభరణాలు ఎత్తుకెళ్లిన చోరులను పోలీసులు గుర్తించడంలో విఫలం చెందారు.

 

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.