close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

విపణి వెలిగేలా.. అవినీతి తొలగేలా

ఖమ్మం మార్కెట్‌పై ప్రత్యేక నిఘా

పత్తి జీరోపై దృష్టి

విజిలెన్స్‌ అధికారుల పర్యవేక్షణ

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌పై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక నిఘా పెట్టింది. రాష్ట్రంలోని అతి పెద్ద మార్కెట్లలో ఒకటైన దీనిపై దృష్టి సారించింది. గత కొంత కాలం నుంచి ఇక్కడ జరుగుతున్న అక్రమాలపై కన్నెర్ర చేసింది. ప్రధానంగా ఇప్పుడు మార్కెట్‌లో జరుగుతున్న పత్తి జీరో దందాతో పాటు ఇతర అక్రమాలను అరికట్టేందుకు నడుంబిగించింది. ఇందుకోసం మార్కెటింగ్‌శాఖ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సంయుక్త సంచాలకుడు వి.ఎల్లయ్యను ప్రత్యేకంగా పంపటం విశేషం. ఆయనతో పాటు ఆరుగురు అధికారులను కూడా తనిఖీల నిమిత్తం ఏర్పాటు చేశారు. వీరితో పాటు మార్కెటింగ్‌శాఖ వరంగల్‌ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడు మల్లేశ్‌ కూడా ఇక్కడ తనిఖీలు చేశారు. మూడు రోజుల పాటు విజిలెన్స్‌ అధికారులు మార్కెట్లో జరుగుతున్న అక్రమాలను పరిశీలించారు. మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్‌ నుంచి ఇద్దరు సూపర్‌వైజర్లను, ఒక జేఎంఎస్‌ను, సూర్యాపేట నుంచి మరో సూపర్‌వైజర్‌ను పత్తి యార్డులో పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా నియమించారు.

అస్తవ్యస్తం

గత నెల 25వ తేదీ నుంచి విపణి అస్తవ్యస్తంగా తయారైంది. అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఒక ప్రత్యేక వ్యవస్థ వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఉదాహరణకు గేటు ఎంట్రీలో ఒక రోజు 10వేల బస్తాల సరకు నమోదైతే బయటకు వెళ్లిన సరకు సుమారు 6వేల బస్తాలు మాత్రమే ఉండేది. అంటే సుమారు 4వేల బస్తాల సరకు లెక్క లేకుండా పోయింది. లోపలికి వచ్చే సరకు బయటకు వెళ్లే సరకుకు పొంతన లేకుండా ఉంది. దీని వల్ల మార్కెట్‌ ఆదాయం తగ్గిపోయింది. కొంత మంది పత్తి వ్యాపారులు జీరో దందాకు శ్రీకారం చుట్టారు. జీరో దందాను అనుమతించాలని వ్యాపారులు అడిగే స్థాయికి వెళ్లారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్ఛు మార్కెట్‌కు వచ్చే పత్తికి సరైన లెక్కలు లేవు. ప్రభుత్వానికి సెస్సు రూపంలో వచ్చే ఆదాయానికి భారీగా గండిపడింది.

ఈ-నామ్‌కు ఎగనామం

ఈ-నామ్‌తో సంబంధం లేకుండానే వ్యాపారులు కొనుగోళ్లు మొదలు పెట్టారు. ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌ పూర్తికాక ముందే రైతుల నుంచి వేల బస్తాల సరుకు కొనుగోలు చేశారు. చివరకు ఈ-నామ్‌కు అర్థం లేకుండా చేశారు. వ్యవస్థను దిగజార్చారు. అదే అదనుగా కొంత మంది దడవాయిలు అడ్డగోలుగా తూకాలు వేశారు. కంప్యూటర్ల ద్వారా కాకుండా కాగితాలపై చేతి రాతతో తూకం వివరాలను నమోదు చేశారు. చాలా మంది రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. రైతులకు అనుకోని ప్రమాదం జరిగితే ఒక్క పైసా కూడా బీమా ప్రీమియం బాధిత కుటుంబాలకు వచ్చే అవకాశం లేదు.

అధిక కమీషన్లతో నష్టపోతున్న రైతులు

కమీషన్‌ వ్యాపారులు రైతుల నుంచి నిబంధనల ప్రకారం కేవలం 2శాతం మాత్రమే కమీషన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం 6శాతం వరకు వసూలు చేస్తున్నారు. దీని వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్‌కు సరకు తెచ్చే రైతుల నుంచి తేమశాతం పేరుతో ధర గణనీయంగా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. ఇలా క్వింటాకు రూ.1000 నుంచి రూ.1500 వరకు నష్టపోతున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభించినా ఇక్కడ మాత్రం కొనుగోళ్లు జరగటం లేవు. లూజు పత్తి రావటం లేదనే సాకుతో కొనుగోలు చేయటం లేదు. జిన్నింగు మిల్లుల వద్దనే కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో పోటీ లేకపోవటంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. కొంత మంది వ్యాపారులు ఇక్కడ తక్కువకు కొనుగోలు చేసి ఇదే పత్తిని రైతుల పేరుతో జిన్నింగు మిల్లుల్లో విక్రయిస్తున్నారు. రైతుల కష్టాన్ని వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి అక్రమ దందా ఖమ్మం విపణిలో ఎక్కువ కావటంతో రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ అప్రమత్తమైంది.

రంగంలోకి దిగిన రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ

అనేక రకాల అక్రమాలను నిరోధించటం స్థానిక అధికారులకు ఇబ్బందికరంగా మారటంతో ఏకంగా రాష్ట్రమార్కెటింగ్‌శాఖ ప్రత్యక్షంగా రంగంలోకి దిగటం విశేషం. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటనలు జరిగిన సందర్భాలు లేవు. మార్కెట్‌ మొత్తం వ్యాపారవర్గాల చేతిలోకి వెళ్తుందనే విషయాన్ని పసిగట్టి మార్కెటింగ్‌శాఖ అధికారులు, విజిలెన్స్‌ అధికారుల బృందాలు, ఇతర మార్కెట్ల నుంచి సిబ్బందిని నియమించటం ద్వారా అక్రమాలను నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది వ్యాపారులు ఇక్కడ వ్యాపారాన్ని శాసిస్తున్నారు. వారు చెప్పిందే వేదం. మొత్తం తమ గుప్పిట్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారుల తనిఖీల బృందాలు పూర్తి నివేదికను రాష్ట్ర మార్కెటింగ్‌శాఖకు ఇవ్వనున్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టటంతో విపణితో సంబంధం ఉన్న అన్ని వర్గాల వారి వెన్నులో వణుకుపుడుతోంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.