close

సోమవారం, జనవరి 27, 2020

ప్రధానాంశాలు

ఫలించిన వ్యూహం

పురపాలిక వార్డుల ముసాయిదాపై అభ్యంతరాలు అంతంతే

ఓటర్ల జాబితా అనంతరం ప్రకటించడంతో తగ్గుదల

ప్రణాళికతో వ్యవహరించిన పుర కమిషనర్లు

రేపటితో ముగియనున్న ఫిర్యాదుల స్వీకరణ

ఈనాడు డిజిటల్‌, సూర్యాపేట, భువనగిరి పురపాలిక న్యూస్‌టుడే:


భువనగిరిలో 21వ వార్డును పునర్విభజించాలని కమిషనర్‌ వంశీకృష్ణకు

వినతి పత్రం సమర్పిస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు

పురపాలక సంఘం ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి. గతంలో చేపట్టిన వార్డులు, ఓటర్ల జాబితాల విభజన ప్రక్రియ అభాసుపాలైంది. దీన్ని రద్దు చేసి తాజాగా వార్డుల ముసాయిదా జాబితా విడుదల చేశారు. గత తప్పులు పునరావృతం కాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. రాజకీయ పార్టీలు, ప్రజల నుంచి గతంలో వచ్చిన అభ్యంతరాలను సరిచేశారు. నిపుణుల సాయంతో పురపాలక శాఖ మార్గదర్శకాలను అనుసరిస్తూ.. మరోసారి వార్డుల సరిహద్దులను ఖరారు చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకొని వార్డుల జాబితాలు విడుదల చేయడంతో అభ్యంతరాలు తగ్గిపోయినట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ఈ నెల 9తో ముగియనుంది. ఇప్పటి వరకు సూర్యాపేట, నల్గొండ, భువనగిరి పురపాలికల్లో రెండంకెల ఫిర్యాదులు రాగా.. మిగిలిన వాటిల్లో వేళ్లమీద లెక్కపెట్టేలా వచ్చాయి. ఆరు మున్సిపాలిటీల్లో ఒక్క అభ్యంతరమూ రాలేదు.

పూర్వాపరాలు ఇలా

జులైలో వార్డుల పునర్విభజనకు ఇచ్చిన ముసాయిదా ప్రకటనలో అనేక తప్పులున్నట్లు రాజకీయ పార్టీలు, ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాటిని సరిచేయడంలో పురపాలిక సిబ్బంది చేతులెత్తేయడంతో వివిధ వర్గాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. హడావుడిగా ప్రక్రియను చేపట్టడంతో పొరపాట్లు చోటుచేసుకున్నట్లు క్షేత్రస్థాయిలో అధికారులూ అంగీకరించారు. ఫిర్యాదులపై సుమారు ఐదు నెలల పాటు విచారణ జరిగింది. ఎటూ తేలకపోవడంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. వార్డుల పునర్విభజన ప్రక్రియ మరోసారి చేపట్టాలని ఆదేశించింది. అందుకు 14 రోజులు గడువు ఇచ్చింది. న్యాయస్థానం మార్గదర్శకాలను అనురిస్తూ.. పురపాలక శాఖ ఈ నెల 3వ తేదీన ముసాయిదా జాబితా విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్కడికక్కడ పురపాలిక కమిషనర్లు అదేరోజు వార్డుల విభజన వివరాలతో నోటిఫికేషన్లు జారీ చేశారు. అప్పటి నుంచి ఏడు రోజులపాటు అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు.

కారణాలు ఇవే

అభ్యంతరాలను ఆదిలోనే అరికట్టేందుకు పురపాలిక కమిషనర్లు ప్రత్యేక వ్యూహాన్ని అమలుపరిచారు. ముసాయిదా విడుదలకు రెండు రోజుల ముందే అన్ని రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించారు. గతంలో వచ్చిన అభ్యంతరాలు, సరిచేసిన వివరాలు తెలిపారు. పునర్విభజన చేసిన వార్డుల జాబితాలను వారికి అందించి ముందే అభ్యంతరాలు చెప్పాలని కోరారు. కొన్నిచోట్ల పలువురు నాయకులు సూచనలు చేశారు. నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటిని పరిగణనలోకి తీసుకున్నారు. ఓటర్ల జాబితాలను వార్డుల విభజన తర్వాత విడుదల చేస్తామని ప్రకటించారు. ఫలితంగా ఓటర్ల హద్దులు మారాయనే ఫిర్యాదులు రాలేదు.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులే అధికం

అభ్యంతరాలపై ప్రధాన రాజకీయ పక్షాల సరిగ్గా స్పందించలేదనే తెలుస్తోంది. విభాజ్య నల్గొండ జిల్లాలో ఏడు మున్సిపాలిటీలుండగా.. కేవలం నాలుగింటిలోనే 32 అభ్యంతరాలు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో ఐదు పురపాలికలుండగా.. నాలుగింటిలో 19 ఫిర్యాదులు అందాయి. ఇందులో సూర్యాపేట నుంచే 16 వచ్చినట్లు అధికారులు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ఆరు పురపాలికలకు నాలుగింటిలో 37 అభ్యంతరాలు వచ్చాయి. అన్ని జిల్లాల్లో ప్రజల నుంచే అధికంగా ఫిర్యాదులు వచ్చినట్లు పురపాలిక అధికారులు చెబుతున్నారు. తమ ఇంటి నంబర్లు వేరే వార్డులో కలపాలని, రెండు వార్డుల్లో తమ ఇంటి నంబర్లున్నాయనే అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. రాజకీయ పక్షాల నుంచి వచ్చిన వాటిలో నిబంధనల ప్రకారం ప్రక్రియ చేపట్టాలని మాత్రమే సూచించారు. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

వెంటనే పరిష్కరిస్తున్నాం

-రామాంజులరెడ్డి, పురపాలిక కమిషనర్‌, సూర్యాపేట

చిన్న, చిన్న అభ్యంతరాలను వెంటనే పరిష్కరిస్తున్నాం. నిబంధనలకు అనుగుణంగా ఉన్న వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాం. ముందస్తుగా రాజకీయ పక్షాలతో నిర్వహించిన సమావేశం కొంతమేర ఫలితాన్ని ఇచ్చింది. వారు చెప్పిన అభ్యంతరాలను ముందుగానే పరిష్కరించి ముసాయిదాను విడుదల చేశాం. అభ్యంతరాలకు మరో రోజు మాత్రమే గడువు ఉంది.

మరిన్ని వార్తలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.